ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర బడ్జెటు 2025-26పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందన
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చనున్న వికసిత్ భారత్ బడ్జెట్ 2025-26: ప్రధాని
బలాన్ని పెంచే వికసిత్ భారత్ బడ్జెట్ 2025-26: ప్రధానమంత్రి
దేశంలో ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించనున్న వికసిత్ భారత్ బడ్జెట్ 2025-26: ప్రధాని
వికసిత్ భారత్ బడ్జెట్ 2025-26 వ్యవసాయ రంగానికి సాధికారతను కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది: ప్రధానమంత్రి
మన దేశంలో మధ్య తరగతికి వికసిత్ భారత్ బడ్జెట్ 2025-26 తో అనేక ప్రయోజనాలు: ప్రధాని
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు,చిన్న వ్యాపార సంస్థలకు దన్నుగా నిలవడానికి తయారీ రంగంపై సమగ్ర దృష్టిని సారించిన వికసిత్ భారత్ బడ్జెట్ 2025-26: ప్రధానమంత్రి
Posted On:
01 FEB 2025 3:58PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర బడ్జెటు 2025-26పై తన అభిప్రాయాలను ఈ రోజు వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. భారతదేశం అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఒక ముఖ్య ఘట్టాన్ని ఆవిష్కరించిందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ఈ బడ్జెటు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అద్దంపట్టడంతోపాటు దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేరుస్తుందని వ్యాఖ్యానించారు. యువత కోసం అనేక రంగాల్లో తలుపులను తెరిచారు, సామాన్య పౌరుడే వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాడని ఆయన స్పష్టంచేశారు. ఈ బడ్జెటు బలాన్ని అనేక రెట్లు పెంచనుందని, ఈ బడ్జెటు పొదుపును, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని ఇంతలంతలు చేస్తుందని ప్రధాని అన్నారు. ‘ప్రజల బడ్జెటు’ను ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు, ఆమె బృందానికి అభినందనలు తెలిపారు.
సాధారణంగా, బడ్జెటు దృష్టంతా ప్రభుత్వ ఖజానాను ఎలా నింపాలా అనే విషయంపైనే ఉంటుందని ప్రధాని అన్నారు. ఏమైనా, ఈ బడ్జెటు పౌరుల జేబులను ఎలా నింపాలా, వారి పొదుపు మొత్తాలను ఎలా పెంచాలా, వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను ఎలా చేయాలా అనే అంశాలపై దృష్టి సారించిందన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ఈ బడ్జెటు పునాది వేసింది అని ఆయన ఉద్ఘాటించారు.
‘‘ఈ బడ్జెటులో సంస్కరణల దిశగా ముఖ్యమైన అడుగులు వేశారు’’ అని శ్రీ మోదీ అన్నారు. పరమాణుశక్తి రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలన్న చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న సంగతిని ప్రధానంగా ప్రస్తావించారు. శాంతియుత ప్రయోజనాలకు పరమాణు శక్తిని వినియోగించుకోవడమన్నది రాబోయే కాలంలో దేశాభివృద్ధి సాధనలో ముఖ్య పాత్రను పోషించనుందని ఆయన తెలిపారు. ఉపాధిని కల్పించే అన్ని రంగాలకు బడ్జెటులో ప్రాధాన్యాన్ని ఇచ్చారని ఆయన ఉద్ఘాటించారు. రెండు ప్రధాన సంస్కరణలు భవిష్యత్తులో గొప్ప మార్పులను తీసుకురానున్నాయని శ్రీ మోదీ చెప్పారు. నౌకానిర్మాణ పరిశ్రమకు మౌలిక సదుపాయాల రంగ హోదాను కల్పించడం వల్ల దేశంలో పెద్ద పెద్ద నౌకల నిర్మాణానికి ఊతం అంది, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు (స్వయంసమృద్ధ భారత్ ఉద్యమం) జోరును అందిస్తుందన్నారు. అలాగే 50 పర్యాటక నగరాల్లోని హోటళ్లను మౌలిక సదుపాయాల రంగం కేటగిరీలో చేర్చడం ఈ రంగానికి దన్నుగా నిలుస్తుంది. దీంతో మన దేశంలో ఉద్యోగాలను సృష్టించే రంగాల్లో అతి పెద్ద రంగంగా ఉన్న ఆతిథ్య రంగానికి కూడా కొత్త శక్తి వస్తుందన్నారు. ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధి, వారసత్వం) మంత్రంతో దేశం ముందంజ వేస్తోందని ప్రధాని వివరించారు. జ్ఞాన్ భారతం మిషన్‌ను ప్రారంభించి చేతిరాతలో ఉన్న ఒక కోటి పుస్తకాలను పదిలపరచాలని ఈ బడ్జెటులో కీలక చొరవ తీసుకున్నారని ఆయన చెప్పారు. దీనికి తోడు, దేశంలోని జ్ఞాన పరంపర ద్వారా ప్రేరణను పొందుతూ ఒక జాతీయ డిజిటల్ భండారాన్ని ఏర్పాటు చేయనున్నారని ప్రధాని గుర్తుచేశారు.
రైతులను ఉద్దేశించి బడ్జెటులో పొందుపరిచిన చర్యలు వ్యవసాయ రంగంలో, పూర్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త విప్లవానికి పునాదిని వేస్తాయని శ్రీ మోదీ అన్నారు. ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో భాగంగా 100 జిల్లాల్లో నీటిపారుదల సదుపాయాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి చోటు చేసుకోనుందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడం వల్ల రైతులకు మరింత సహాయం అందనుందని ఆయన స్పష్టంచేశారు.
బడ్జెటు రూ. 12 లక్షల వరకు ఆదాయానికి పన్నును మినహాయించిందని ప్రధాని ప్రధానంగా చెబుతూ, అన్ని ఆదాయ వర్గాల వారికీ పన్ను మినహాయింపులను అందించారని, దీంతో మధ్య తరగతి వారితోపాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి చాలా ప్రయోజనం కలుగుతుందన్నారు.
‘‘తయారీ మొదలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎంఎస్ఎంఈ)లను, చిన్న వ్యాపార సంస్థలను బలపరచడానికి బడ్జెటు సమగ్రంగా దృష్టి సారించింద’’ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వచ్ఛ సాంకేతికత, తోలు, పాదరక్షలు, ఆటవస్తువుల తయారీ పరిశ్రమ వంటి రంగాలు జాతీయ తయారీ మిషన్‌లో భాగంగా ప్రత్యేక అండదండలను అందుకొన్నాయని తెలిపారు. దేశంలో తయారు చేసే ఉత్పాదనలు ప్రపంచ మార్కెట్లో ఆదరణ పొందేటట్లు చూడాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు.
రాష్ట్రాలలో హుషారైన, పోటీతత్వంతో కూడిన పెట్టుబడి వాతావరణాన్ని ఏర్పరచడానికి బడ్జెటు ప్రత్యేక ప్రాధాన్యాన్నిచ్చిందని శ్రీ మోదీ అంటూ, ఎంఎస్ఎంఈలకు, అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)కు పరపతి హామీని రెట్టింపు చేసిన సంగతిని తెలిపారు. షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్‌టీ), మహిళల్లో నవ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రూ. 2 కోట్ల వరకు రుణాలను పూచీకత్తు లేకుండానే ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టనుండడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గిగ్ వర్కర్ల కోసం బడ్జెటులో ఓ ప్రధాన ప్రకటన ఉందని, వారి పేర్లను తొలిసారిగా ఈ-శ్రమ్ (e-Shram) పోర్టల్‌లో నమోదు చేసి ఆరోగ్య సంరక్షణ, ఇతర సామాజిక భద్రతా పథకాలను అందుబాటులోకి తేనున్నారని ప్రధాని చెప్పారు. కార్మికుల శ్రమను గౌరవించే అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్య చాటిచెబుతోందని ప్రధాని అన్నారు. జన్ విశ్వాస్ 2.0 వంటి నియంత్రణ సంబంధ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు కనీస స్థాయి ప్రభుత్వం, విశ్వాసంపై ఆధారపడ్డ పరిపాలన.. ఈ అంశాల్లో నిబద్ధతను పటిష్టపరుస్తాయని ఆయన తెలిపారు.
ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ బడ్జెటు దేశంలో ప్రస్తుత అవసరాలను తీర్చడం ఒక్కటే కాకుండా భవిష్యత్తు కోసం దేశాన్ని సన్నద్ధపరచడంలో కూడా సాయపడుతుందని ప్రధాని చెప్పారు. డీప్ టెక్ ఫండ్, జియో స్పేషియల్ మిషన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ వంటి వాటితో సహా అంకుర సంస్థల(స్టార్ట్-అప్స్) కోసం పొందుపరిచిన కార్యక్రమాలను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ చరిత్రాత్మక బడ్జెటు ద్వారా లాభపడనున్న దేశ పౌరులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
***
MJPS/SR
(Release ID: 2098722)
Visitor Counter : 23
Read this release in:
Odia
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Manipuri
,
Gujarati