సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పొరపాట్లకు తావు లేని పవిత్ర మేళా
కుంభమేళ 2025లో పారిశుద్ధ్య కార్యక్రమాలు
Posted On:
24 JAN 2025 6:59PM by PIB Hyderabad
పరిచయం
2025 మహా కుంభమేళా ఒక ముఖ్యమైన మతపరమైన సమావేశం మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన ఒక నమూనా కూడా. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణ, నదుల పరిరక్షణ, పర్యావరణ అనుకూల పద్ధతుల విషయంలో ఈ కుంభమేళా కొత్త ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతోంది. “పరిశుభ్రమైన మహా కుంభమేళా” కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పారిశుద్ధ్య ప్రణాళికను అమలు చేస్తోంది. వినూత్నమైన వ్యర్థ నిర్వహణ పద్ధతులు, ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్ విషయంలో కఠిన నిబంధనలు, విస్తృత అవగాహన కార్యక్రమాలతో హరిత, పరిశుభ్రమైన తీర్థయాత్రను భక్తులకు అందించటమే లక్ష్యంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను తెలియజేస్తోంది. ఆధ్యాత్మికత, సుస్థిరత సామరస్యపూర్వక సహజీవనాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణం విషయంలో నాయకత్వం వహించటానికి సంబంధించిన చిత్తశుద్ధిని ఈ కుంభమేళా తెలియజేస్తోంది.
గంగా, ప్లాస్టిక్ రహిత ప్రదేశాల్లో స్వచ్ఛత
2025 మహా కుంభమేళా ప్రధాన లక్ష్యాలలో ఒకటి గంగానది పవిత్రతను కాపాడటం. ఇందుకోసం కాలుష్య నివారణ విషయంలో కఠిన నిబంధనలు విధించారు, నదిని నిరంతర పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి ఉపయోగించే ప్లాసిక్‌ను పూర్తిగా నిషేధిస్తూ ఉత్సవాలు జరిగే ప్రదేశాలను ప్లాస్టిక్ రహితమైనవిగా ప్రకటించారు. యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించాలని, చెత్తను నిర్దేశిత బుట్టలలో పారవేయాలని కోరుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పెద్ద ఎత్తున పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు
భారీగా తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా పటిష్టమైన పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని:
12,000 సెప్టిక్ ట్యాంకులతో కూడిన ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (ఎఫ్ఆర్పీ) మరుగుదొడ్లు.
16,100 ఇంకుడు గుంతలతో కూడిన ప్రీఫ్యాబ్రికేటెడ్ స్టీల్ టాయిలెట్లు.
వివిధ పవిత్ర కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో 20,000 సామూహిక మూత్రశాలలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు.
ఈ సౌకర్యాలు యాత్రికులకు శుభ్రమైన, పరిశుభ్రమైన విశ్రాంతి గదులను అందుబాటులో ఉంచేలా చూసుకుంటున్నాయి. అంతేకాకుండా బహిరంగ మలవిసర్జన, సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ
కుంభమేళా జరిగే ప్రాంతాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా ఉంచేందుకు సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఉంది. దీనికి సంబంధించి తీసుకున్న చర్యల్లో కొన్ని:
చెత్త ఉత్పత్తయ్యే స్థానంలోనే వేరు చేసేందుకు వీలుగా 20,000 చెత్త బుట్టలు.
క్రమబద్ధమైన వ్యర్థాల సేకరణ, తరలింపు కోసం 37.75 లక్షల లైనర్ బ్యాగులు.
ముఖ్యంగా ప్రధానమైన స్నానాల తర్వాత వ్యర్థాల తొలగింపు కోసం ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు.
ఈ చర్యలు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ రీసైక్లింగ్, పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
మియావాకి అడవులు: హరిత కార్యక్రమం
పారిశుద్ధ్య చర్యలతో పాటు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రయాగ్‌రాజ్‌లో పచ్చదనాన్ని పెంచడానికి ప్రభుత్వం మియావాకి అడవుల పెంపకం పద్ధతిని అమలు చేసింది. పరిమిత ప్రదేశాల్లో దట్టమైన అడవులను సృష్టించడానికి 1970వ దశకంలో ప్రఖ్యాత జపనీస్ వృక్ష శాస్త్రవేత్త అకిరా మియావాకి అభివృద్ధి చేసిన ఒక విప్లవాత్మక పద్ధతే ఇది. దీనిని "కుండీల్లో మొక్కలు పెంచే పద్ధతి” అని కూడా పిలుస్తుంటారు. ఇందులో చెట్లు, పొదలను ఒకదానికొకటి దగ్గరగా నాటడం వల్ల వాటి పెరుగుదల వేగవంతం అవుతుంది. ఈ పద్ధతిలో మొక్కలు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఒక ఆచరణాత్మక పరిష్కారం. మియావాకి పద్ధతిలో నాటిన చెట్లు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించటమే కాకుండా వేగంగా పెరుగుతాయి. సంప్రదాయ అడవులతో పోలిస్తే సంపన్న జీవవైవిధ్యానికి ఈ అడువులు ఉపయోగపడుతాయి.
నాలుగేళ్ల క్రితం 2020-21లో ప్రయాగ్‌రాజ్‌లో మియావాకి ప్రాజెక్టును చిన్న తరహాలో ప్రారంభించారు. నైనీ ఇండస్ట్రియల్ జోన్‌లోని నెవాడా సమోగర్‌లో 34,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 63 విభిన్న జాతులకు చెందిన 119,700 మొక్కలను నాటడంతో ఈ ప్రాజెక్టు 2023-24లో గణనీయంగా విస్తరించింది. గతంలో స్థానిక కర్మాగారాలు తమ వ్యర్థాలను అక్కడ పడేయడంతో ఈ ప్రాంతం పారిశ్రామిక వ్యర్థాలతో భారీగా కలుషితమై ఉండేది.
నగరంలోని అతిపెద్ద చెత్త డంపింగ్ యార్డు అయిన బస్వార్ కూడా మియావాకి ప్రాజెక్టు కింద గణనీయమైన మార్పుకు లోనైంది. ఒకప్పుడు వ్యర్థాలతో నిండి ఉండే ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసి 9,000 చదరపు మీటర్లకు పైగా 27 వేర్వేరు జాతులకు చెందిన 27,000 మొక్కలను నాటారు. నేడు ఈ మొక్కలు దట్టమైన అడవిగా పెరిగి పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. ప్రయాగ్‌రాజ్ నగరంలో 13 ఇతర ప్రదేశాలలో అడవులను సృష్టించడానికి మియావాకి పద్ధతిని ఉపయోగించారు.
మామిడి, విప్ప, వేప, రావి, చింత, అర్జున, టేకు, తులసి, ఉసిరి, బెర్ వంటి ప్రధాన జాతి మొక్కలను ఈ ప్రాజెక్టు కింద నాటారు. వీటితో పాటు మందారం, కదంబ, గుల్మోహర్, జంగిల్ జిలేబీ, బోగన్ విల్లా, బ్రాహ్మీ వంటి అలంకార, ఔషధ మొక్కలను కూడా నాటారు. ఈ పచ్చని ప్రదేశాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి (4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్), జీవవైవిధ్యాన్ని పెంచడానికి.. వాయు, నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి.. నేల కోతను నివారించడానికి ఉపయోగపడుతాయి. మహా కుంభమేళా సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో చేపడుతున్న చర్యలకు కూడా సహకరిస్తున్నాయి.
సామాజిక భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు
మహా కుంభమేళాలో పరిశుభ్రత కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం కీలకం. ఇది జరుగుతున్న పరిసరాల్లో చెత్త వేయొద్దని, పరిశుభ్రత పాటించేందుకు నిర్దేశిత ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేయాలని అధికారులు కోరుతున్నారు. పౌరులను నిమగ్నం చేయడానికి, అవగాహనను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించారు.
పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ రథయాత్రను నగరంలో వివిధ దారుల్లో నిర్వహించింది.
వీధి నాటకాలు, సంగీత ప్రదర్శనలు సరైన వ్యర్థాలను వేరు చేయడం, పారవేయడంపై యాత్రికులకు అవగాహన కల్పించాయి.
ఘాట్ల వద్ద భక్తులకు సమాచారం అదించే ఏర్పాట్ల ద్వారా భక్తులను పరిశుభ్రత పాటించాలని కోరుతూ నిరంతరం వివిధ సందేశాలను ప్రసారం చేస్తున్నారు.
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ర్యాపిడ్ పారిశుద్ధ్య బృందాలు
భక్తులు ఎక్కువగా స్నానాలు చేసే ప్రధాన తేదీల తరువాత మేళా జరిగే ప్రదేశాల్లో పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను కింది పనుల కోసం నియమించారు.
ప్రజా మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయటం: మేళాలో ఉపయోగించే ప్రజా మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అదనపు పారిశుద్ధ్య కార్మిక బృందాలను రంగంలోకి దింపారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి ఘాట్ల వరకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
యాత్రికులు వదిలివెళ్లిన వ్యర్థాలను తొలగించటం: వ్యర్థాలను సేకరించి నిర్దేశిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. సేకరించిన వ్యర్థాలను తరలించటం కోసం వాటిని బ్లాక్ లైనర్ బ్యాగుల్లో నిల్వ చేస్తున్నారు. ఈ ప్రణాళిక అమలులో వేగవంతమైన పురోగతి సాధించారు.
బ్లాక్ లైనర్ బ్యాగులను ఉపయోగించి చెత్తను క్రమపద్ధతిలో తరలించడం
క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, ఫాగింగ్ చేయడం.
శిథిలాలు, రాళ్లు, ఇటుకలు, శిథిలాలతో పాటు అన్ని నిర్మాణ సామగ్రిని మేళాకు వెళ్లే దారుల నుంచి క్రమం తప్పకుండా తొలగించేందుకు కృషి చేయటం
ఈ చర్యల ద్వారా త్వరగా స్పందిస్తున్నారు. ఇది మేళ జరుగుతున్న ప్రాంతాల్లో శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచే నిబద్ధతతను బలపరుస్తోంది.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం
మహా కుంభమేళాలో పరిశుభ్రతను పాటించడంలో, స్వచ్ఛ మహా కుంభమేళా అభియాన్‌ను విజయవంతం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల కీలక పాత్ర పోషిస్తున్నారు. సఫాయి మిత్రలుగా పిలిచే వీరి శ్రేయస్సుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ దిశగా తీసుకున్న చర్యల్లో కొన్ని:
పారిశుద్ధ్య కాలనీల్లో సరైన గృహవసతి, సౌకర్యాలు కల్పించింది..
విద్యా కుంభమేళా కార్యక్రమం ద్వారా వారి పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు, విద్య, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది.
పారిశుద్ధ్య కార్మికులందరికీ తగినంత ఆహారం, వసతి, సకాలంలో జీతాలు చెల్లిస్తోంది.
పారిశుద్ధ్య నిర్వహణ మాత్రమే కాకుండా దానికి బాధ్యులైన కార్మికులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం నిబద్ధతను ఈ చర్యలు తెలియజేస్తున్నాయి.
హరిత మహా కుంభమేళా: పర్యావరణానికి సంబంధించి జాతీయ చర్చ
పర్యావరణ అవగాహనను మరింత పెంపొందించడానికి, 2025 జనవరి 31 న హరిత మహా కుంభమేళా నిర్వహిస్తున్నారు. ఇందులో 1,000 మందికి పైగా పర్యావరణ, నీటి సంరక్షణ నిపుణులు పాల్గొంటారు. శిక్షా సంస్కృతీ ఉత్తన్ న్యాస్ నిర్వహించే జ్ఞాన్ మహా కుంభమేళా - 2081 సిరీస్‌లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఈ అంశాలపై దృష్టి సారించనుంది:
ప్రకృతి, పర్యావరణం, నీరు, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలు.
ప్రకృతిలోని పంచభూతాలను సమతుల్యం చేయటం.
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతలో ఉత్తమ పద్ధతులు.
సుస్థిరతకు సంబంధించి చర్యల్లో భక్తులను నిమగ్నం చేసే వ్యూహాలు.
విజ్ఞానాన్ని పంచుకోవడానికి, పర్యావరణ బాధ్యతాయుతమైన మహా కుంభమేళా దార్శనికతను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడనుంది.
ముగింపు
పరిశుభ్రత, సుస్థిరత, పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు మహా కుంభమేళా 2025 నిదర్శనమని చెప్పుకోవచ్చు. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాల నుంచి మియావాకి అడవుల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ కార్యక్రమాల వరకు పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మేళాలోని ప్రతి అంశాన్ని పక్కాగా ప్రణాళిక చేశారు. చేపట్టిన కార్యక్రమాలు పరిశుభ్రమైన మహా కుంభమేళా ఉండేలా చూసుకోవటమే కాకుండా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు ఆదర్శంగా నిలుస్తాయి. సామాజిక భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి, విధాన ఆధారిత చర్యల ద్వారా మహా కుంభమేళా 2025 పర్యావరణానికి సంబంధించిన బాధ్యత, ప్రజా పారిశుద్ధ్యంలో ఒక మైలురాయిగా నిరూపితం అవుతోంది.
ఆధారం:
సమాచార, ప్రజా సంబంధాల మంత్రిత్వ శాఖ(డీపీఐఆర్), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
www.kumbh.gov.in
https://www.instagram.com/ddnews_official/p/DCQS50yvZ-9/?img_index=2
https://x.com/PIBKohima/status/1881268090627145733
https://www.instagram.com/mib_india/p/DEM0AESuVzf/
***
(Release ID: 2096558)
Visitor Counter : 8