సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మహా కుంభమేళా 2025: అలహాబాద్ మ్యూజియంలో ‘భాగవత్’ ప్రదర్శన.. ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
వాసుదేవ కృష్ణ భగవానుడి 12 మంది భాగవతుల లీలలు, అవతారాలు, గాథలను వివరించే 75 సూక్ష్మ చిత్రాల ప్రదర్శన
కుంభమేళాది అత్యంత పురాతన చరిత్ర, ఇది భారత ఐక్యతకు శాశ్వత చిహ్నం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని చాటుతున్న మహా కుంభమేళా: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
Posted On:
23 JAN 2025 10:58AM by PIB Hyderabad
సూక్ష్మ చిత్రాలతో ఏర్పాటు చేసిన ‘భాగవత్’ ప్రదర్శనను అలహాబాద్ మ్యూజియంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం ప్రారంభించారు. పవిత్ర ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళాను మరింత ఘనంగా, విశిష్టంగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయాగరాజ్ లోని చారిత్రక మ్యూజియం ఏర్పాటు చేసిన ‘భాగవత్’ ప్రదర్శన ఈ వేడుకకు శోభనిస్తుంది. సమష్టి కృషి వల్లే అద్వితీయమైన ఈ కుంభమేళా దివ్యంగా, మహత్తరంగా సాగుతోంది.
మ్యూజియం ఆవరణలో ఉన్న అమర వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం కేంద్ర మంత్రి ‘భాగవత్’ ప్రదర్శనను వీక్షించారు. ఈ అందమైన ఏర్పాటుపట్ల మ్యూజియం బృందాన్ని అభినందించిన ఆయన.. ఈ సూక్ష్మ చిత్రాలు ప్రపంచాన్ని, గతకాలాన్ని, సమాజాన్ని, కళను, సంస్కృతిని సమష్టిగా ప్రతిబింబిస్తున్నాయన్నారు. ప్రదర్శనశాలలోని విలువైన సేకరణలను కుంభమేళా సంప్రదాయంతోనూ రాముడు, కృష్ణుల పాత్రలతోనూ ఈ ప్రదర్శన సమ్మిళితం చేసిందన్నారు.
పవిత్రమైన, దివ్యమైన కార్యక్రమం మహా కుంభమేళాను మరింత ఘనంగా, విశిష్టంగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేస్తున్నారని శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రయాగరాజ్‌లోని ఈ చారిత్రాత్మక మ్యూజియం నిర్వహిస్తున్న ‘భాగవత్’ ప్రదర్శన ఈ విశిష్ట వేడుకను మరింత శోభాయమానం చేసే దిశగా ఓ అర్థవంతమైన ప్రయత్నం. మహా కుంభమేళా ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని, శ్రీరామచంద్రుడికి సంబంధించిన కథనాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. దేశంలోని కళా రంగం సునిశితత్వాన్ని అవగతం చేసుకునే అవకాశం ఈ ప్రదర్శన ద్వారా కలుగుతుంది.
భారతీయ ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కుంభమేళా సంగ్రహంగా ఆవిష్కరిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అన్ని మత విశ్వాసాలు, ఆరాధన పద్ధతులు, నమ్మకాలు, సాంస్కృతిక ధోరణులకు చెందిన ప్రజలను అది ఒక్కచోటికి చేరుస్తుందన్నారు. స్వతంత్రానికి ముందు వివిధ పాలకుల కింద అనేక భాగాలుగా భారత్ ఉండేదని చెప్పేవారికి.. భారత ఐక్యతకు శాశ్వత నిదర్శనంగా కుంభమేళా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. కుంభమేళా దేశాన్ని ఏకం చేయడానికి ఎంతలా దోహదపడిందో వివరిస్తూ కాలాగ్రామ్ లో ‘శాశ్వత్ కుంభ్’ పేరుతో ఒక ప్రదర్శనను ఈ మహా కుంభమేళా సందర్భంగా నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతరం ప్రదర్శన కేటలాగ్ ను కేంద్ర మంత్రి విడుదల చేశారు.
అనంతరం ఆజాద్ పథ్, శిల్ప కళా ప్రదర్శన శాల, టెర్రాకోట కళా ప్రదర్శన శాలలను ఆయన సందర్శించారు. మ్యూజియం చరిత్ర, అందులోని సేకరణల ప్రాధాన్యాన్ని డైరెక్టర్ శ్రీ రాజేశ్ ప్రసాద్ వివరించారు. మ్యూజియం ప్రచురణలు, త్రైమాసిక పత్రిక ‘వివిధ’, మ్యూజియంలోకి ప్రవేశం కోసం ప్రత్యేక మహాకుంభమేళా టికెట్ ను కేంద్ర మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం అధికారులు, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు.
****
(Release ID: 2095462)
Visitor Counter : 11