కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
గత ఏడాది నవంబరులో ఈపీఎఫ్ఓ నికరంగా చేర్చుకొన్న సభ్యులు 14.63 లక్షల మంది కొత్తగా చేరింది 8.74 లక్షల మంది
Posted On:
22 JAN 2025 12:12PM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2024 నవంబరు నెలకు తాత్కాలిక వేతనదారుల పట్టీ సమాచారాన్ని (పేరోల్ డేటా) విడుదల చేసింది. 14.63 లక్షల మంది సభ్యులు నికరంగా చేరారని (నెట్ యాడిషన్) ఈ సమాచారం తెలియజేస్తోంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే నికర సభ్యుల చేరిక 9.07 శాతం మేర పెరిగింది.
దీనికి తోడు, ఏటికేడాది విశ్లేషణను బట్టి చూస్తే, 2023 నవంబరులో నికర సభ్యులు జతపడిన స్థాయి కన్నా ఈసారి 4.88 శాతం పెరిగినట్లు తేలింది. అంటే ఉద్యోగ అవకాశాలు, అలాగే ఉద్యోగం వస్తే అందే ప్రయోజనాలు ఏమేమిటన్న విషయాలపట్ల అవగాహన పెరుగుతోందన్న మాట. ఈపీఎఫ్ఓ చైతన్య ప్రచార కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తుంటే, ఆ కార్యక్రమాలు ప్రజల్లో చక్కని ప్రభావాన్ని కలగజేస్తున్నాయని తేలుతోంది.
గత ఏడాది నవంబరు నెలకు ఈపీఎఫ్ఓ పేరోల్ డేటాలోని కీలకాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
కొత్త సభ్యత్వాలు:
ఈపీఎఫ్ఓ 2024 నవంబరులో 8.74 లక్షల మంది కొత్త సభ్యులను నమోదు చేసుకొంది. అదే సంవత్సరం అక్టోబరు నెలతో పోల్చిచూసినప్పుడు అదే ఏడాదివారీ విశ్లేషణను బట్టి చూస్తే, 2023 నవంబరు కన్నా 2024 నవంబరులో కొత్త సభ్యుల భర్తీలో 18.80 శాతం వృద్ధి ఉంది. ఉద్యోగ అవకాశాలు అధికం కావడం, ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలను గురించి అవగాహన పెరగడం, ఈపీఎఫ్ఓ ప్రచార కార్యక్రమాలు చాలా మందిని ఆకట్టుకోవడం వంటి అంశాలు కొత్త సభ్యత్వాలు జోరందుకోవడానికి దారితీశాయని చెప్పవచ్చు.
పేరోల్ సంకలనంలో 18-25 ఏళ్ల వయోవర్గం వారిదే ఆధిక్యం:
డేటాలో గమనించదగ్గ మరో అంశం 18 ఏళ్ల మొదలు 25 ఏళ్ల వయసు ఉద్యోగులది పైచేయిగా ఉండడం. ఈ వయోవర్గానికి చెందిన వారిని 4.81 లక్షల మందిని కొత్త సభ్యులుగా ఈపీఎఫ్ఓ చేర్చుకొంది. 2024 నవంబరులో జతపడ్డ మొత్తం కొత్త సభ్యుల్లో వీరు 54.97 శాతంగా ఉన్నారు.
18-25 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి 2024 అక్టోబరులో ఈపీఎఫ్ఓ సభ్యత్వం తీసుకున్న వారి కన్నా ఆ తరువాతి నెల (నవంబరు)లో ఈ సభ్యత్వాన్ని తీసుకున్న వారు 9.56 శాతం ఎక్కువ మంది ఉన్నారు. ఇదే వయోశ్రేణిలో ఉండి 2023 నవంబరులో ఈపీఎఫ్ఓలో సభ్యత్వాలు పొందిన వారితో పోలిస్తే 2024 నవంబరులో సభ్యత్వాలను పొందిన వారు 13.99 శాతం ఎక్కువగా ఉన్నారు.
దీనికి అదనంగా, 2024 నవంబరు లో 18-25 ఏళ్ల వయస్కులకు సంబంధించిన నెట్ పేరోల్ డేటా సుమారు 5.86 లక్షల సంఖ్యను సూచిస్తోంది. అంతకు ముందు నెల అంటే 2024 అక్టోబరులో నమోదైన వీరి సంఖ్య దీనికన్నా 7.96 శాతం తక్కువగా ఉంది.
ఇది వ్యవస్థీకృత కార్మిక రంగంలో చేరుతున్న చాలా మంది యువకులు, ముఖ్యంగా మొట్టమొదటిసారి ఉద్యోగాన్ని దక్కించుకున్న వారేనని సూచించిన ఇదివరకటి ధోరణినే ఈ డేటా కూడా అనుసరిస్తోంది.
మళ్లీ చేరిన సభ్యులు:
దాదాపుగా 14.39 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ నుంచి బయటకు వెళ్లిపోయినా ఆ తరువాత మళ్లీ అందులో చేరారని పేరోల్ డేటా స్పష్టంచేస్తోంది. ఈ సంఖ్య 2024 అక్టోబరుతో పోలిస్తే 11.47 శాతం వృద్ధిని సూచిస్తోంది.
అంతేకాకుండా 2023 నవంబరు సమాచారం పక్కన పెట్టుకొని చూసినా కూడా ఏటికేడాది 34.75 శాతం వృద్ధి ఉందని ఇది తెలియజేస్తోంది. ఈ సభ్యులు వారు చేస్తున్న కొలువుల్లో నుంచి మారారు. అయితే వారు ఈపీఎఫ్ఓ పరిధి వర్తించే సంస్థల్లోనే చేరారు. తుది పరిష్కారం (ఫైనల్ సెటిల్‌మెంట్) కోసం దరఖాస్తు పెట్టుకోకుండా వారి జమచేసిన మొత్తాలను బదలాయించాలని కోరడానికే మొగ్గు చూపారు. ఇలా చేయడం ద్వారా, వారు దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయానికి, సామాజిక భద్రత కవచానికి కట్టుబడి ఉన్నారు.
మహిళా సభ్యత్వాలు పెరిగాయ్:
పేరోల్ డేటాను పురుషులు, మహిళల దృష్టికోణం నుంచి విశ్లేషించినప్పుడు నవంబరులో జతపడిన కొత్త సభ్యులలో దాదాపుగా 2.40 లక్షల మంది నూతన మహిళా సభ్యలున్నారని వెల్లడైంది. 2024 అక్టోబరు నెలతో పోల్చి చూస్తే ఈ నూతన మహిళా సభ్యుల్లో 14.94 శాతం వృద్ధి చోటుచేసుకొంది. అదే నిరుడు నవంబరుతో పోల్చినా కూడా నూతన మహిళా సభ్యుల్లో 23.62 శాతం వృద్ది ఉంది.
నెల రోజుల్లో నికరంగా సుమారు 3.13 లక్షల మంది మహిళా సభ్యుల జతపడ్డారు. అంతకు మందు నెల అంటే 2024 అక్టోబరులో జతపడ్డ వారి కంటే నవంబరులో చేర్చుకున్న మహిళా సభ్యులు 12.16 శాతం మంది ఎక్కువున్నారు. అదే 2023 నవంబరుతో పోల్చి చూసినప్పుడు కొత్త మహిళా సభ్యుల్లో ఏటికేడాది పెరుగుదల 11.75 శాతంగా ఉంది. మహిళా సభ్యులను చేర్చుకోవడంలో నమోదైన వృద్ధి కార్మికలోకంలోకి మరింత మందిని, వివిధ విభాగాల్లోకి చేర్చుకొంటున్నారన్న సంగతిని తెలియజేస్తోంది.
ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత:
మొత్తం సభ్యుల నమోదులో సుమారు 59.42 శాతం నమోదులు అగ్రగామి 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే జరిగాయని పేరోల్ డేటా రాష్ట్రం వారీ విశ్లేషణ తెలియజెబుతోంది. నవంబరులో మొత్తం కలిపి 8.69 లక్షల సభ్యులు జతపడ్డారు.
రాష్ట్రాలన్నిటిలోనూ మహారాష్ట్ర 2024 నవంబరు లో 20.86 శాతం సభ్యులను నికరంగా చేర్చుకొని అగ్ర స్థానంలో నిలిచింది. ఆ నెలలో మొత్తం నికర సభ్యుల్లో 5 శాతాని కన్నా మించి సభ్యత్వాల్ని జోడించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి.
పరిశ్రమలవారీగా సరళులు ఇలా ఉన్నాయి:
పరిశ్రమ వారీ సమాచారాన్ని నెలకు నెల ప్రాతిపదికన పోల్చి చూసినప్పుడు ఈ కింది పరిశ్రమల్లో పనిచేస్తున్న స
భ్యుల్లో చెప్పుకోదగ్గ వృద్ధి ఉందని తేలింది:
సొసైటీ, క్లబ్బులు లేదా అసోసియేషన్లు,
ఇంజినీర్లు, ఇంజినీరింగ్ గుత్తేదారులు (కాంట్రాక్టర్లు),
వస్త్ర తయారీ పరిశ్రమ,
దుస్తుల తయారీ పరిశ్రమలు,
విద్యుత్తు, మెకానికల్, లేదా సాధారణ ఇంజినీరింగ్, ఇతరత్రా ఉత్పాదనలను తయారు చేస్తున్న పరిశ్రమలు,
మొత్తం నికర సభ్యత్వంలో నుంచి సుమారు 38.98 చేరికలు నిపుణులు అందిస్తున్న సేవల విభాగాల్లో (ఈ విభాగంలో సిబ్బందిని అందించే సంస్థలు, సాధారణ గుత్తేదారులు, భద్రత సేవలు, వివిధ కార్యకలాపాలను కొనసాగించే సంస్థలు మొదలైనవి) నుంచే ఉన్నాయి.
పైన ప్రస్తావించిన పేరోల్ డేటా తాత్కాలికం. ఎందుకంటే, డేటా రూపకల్పన అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఉద్యోగికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాపరుస్తుంటారు. మునుపటి డేటాను ఈ కింది కారణాల రీత్యా నెలనెలా ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సవరిస్తుంటారు:
పేరోల్ రిపోర్టును సిద్ధం చేసిన తరువాత ఇదివరకటి నెలలకు ఈసీఆర్లను నింపుతుంటారు.
ఇదివరకు దాఖలు చేసిన ఈసీఆర్లను పేరోల్ రిపోర్టుల తయారీ అనంతరం సవరిస్తుంటారు.
పేరోల్ రిపోర్టు తయారయ్యాక మునుపటి నెలల్లో ఈపీఎఫ్ సభ్యత్వాన్నుంచి బయటకు వెళ్లిపోయిన తేదీని తిరగరాస్తుంటారు.
ఈపీఎఫ్ఓ 2018 ఏప్రిల్ నుంచి పేరోల్ డేటాను విడుదల చేస్తోంది. 2017 సెప్టెంబరు నెల మొదలు డేటాను లెక్కలోకి తీసుకుంది. నెలవారీ పేరోల్ డేటాలో, ఆధార్ ప్రమాణీకరించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా మొట్టమొదటిసారి ఈపీఎఫ్ఓలో చేరిన వారు ఎంతమంది ఉన్నారు, ఈపీఎఫ్ఓ పరిధిలో నుంచి బయటకు వెళ్లిపోయిన వారు ఎంతమంది, బయటకు వెళ్లిన తరువాత తిరిగి వచ్చి సభ్యులుగా చేరిన వారు ఎంతమంది అనే వివరాలను లెక్కలోకి తీసుకొని నికరంగా నెలవారీ వేతనపట్టీ సమాచారం (పేరోల్ డేటా)లో చేరుస్తారు.
***
(Release ID: 2095159)
Visitor Counter : 8