చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాగరాజ్ లో ‘హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్’

Posted On: 22 JAN 2025 10:20AM by PIB Hyderabad

భారత రాజ్యాంగం, ప్రజల చట్టబద్ధమైన హక్కులపై అవగాహన పెంచే దిశగా న్యాయశాఖ కీలక చర్యలు తీసుకుంది. సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ‘హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ (హెచ్ఎస్2)’ ప్రచారం విజయవంతంగా సాగిన సందర్భంగా ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా వద్ద శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి గతేడాది జనవరి 24న ఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ‘హమారా సంవిధాన్ హమారా సమ్మాన్’ ప్రచారాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత భారత్ దార్శనికతను సాధించడంలో ప్రతి పౌరుడూ క్రియాశీల భాగస్వామి కావాలని ఇది పిలుపునిస్తోంది. గణతంత్రంగా భారత్ 75 ఏళ్లు పూర్తిచేసుకోవడం, రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములయ్యారు. మై గవ్ వేదికగా 1.3 లక్షల మంది ఉత్సాహంగా పంచప్రాణ ప్రతిజ్ఞను స్వీకరించారు. దేశ నిర్మాణంపట్ల వారి నిబద్ధతకు ఇది నిదర్శనం. గ్రామ విధి చేతన కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విద్యా సంస్థల విద్యార్థులు దత్త గ్రామాల్లో న్యాయపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో దాదాపు 21,000 మందికిపైగా లబ్ధిదారులను చేరుకోవడం ద్వారా క్షేత్రస్థాయి భాగస్వామ్యం సాధ్యపడింది. దీనికితోడు దూరదర్శన్, ఇగ్నో భాగస్వామ్యంతో న్యాయశాఖ నిర్వహించిన ప్రభావవంతమైన వెబినార్ల ద్వారా నారీ భాగీదారి, వంచిత వర్గ సమ్మాన్ కార్యక్రమాల్లో 70 లక్షలకు పైగా ప్రజలు భాగస్వాములయ్యారు. చట్టపరమైన, సామాజిక అంశాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ఇది పెంపొందిస్తుంది. ‘నవభారత్ నవ సంకల్ప్’ ద్వారా యువతలో స్ఫూర్తిని నింపేలా వివిధ ముఖాముఖీ పోటీలు నిర్వహించారు. ఇది వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు మెరుగైన భవిష్యత్తు దిశగా వారి బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది.

భారత్ లోని వివిధ భాగాలను చేరుస్తూ ఏడాది పొడగునా ఈ కార్యక్రమం కొనసాగింది. బికనీర్ (రాజస్థాన్), ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్), గౌహతి (అస్సాం) ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు 5,000 మందికి పైగా పౌరులు వ్యక్తిగతంగా హాజరుకాగా.. వీటిలో భాగంగా నిర్వహించిన సబ్ కో న్యాయ హర్ ఘర్ న్యాయ, నవ భారత్ నవ సంకల్ప్, విధి జాగృతి అభియాన్ వంటి ప్రచారాల్లో 8 లక్షల మందికి పైగా పౌరులు క్రియాశీలకంగా భాగస్వాములయ్యారు.

ప్రస్తుత కార్యక్రమం ప్రయాగరాజ్ లోని అరైల్ ఘాట్ లో ఉన్న పరమార్థ త్రివేణి పుష్ప్ లో జరగనుంది. కార్యక్రమ విజయాన్ని, అది సాధించిన పురోగతిని చాటేలా పలు కీలక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద, ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటి.. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంలో స్నానాల కోసం లక్షలాది మంది ఒక్కచోటికి చేరే మహా కుంభమేళా జరుగుతున్న వేళ సంగమ నగరి ప్రయాగరాజ్ లో ఈ విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయాగరాజ్ లో ఈ చారిత్రక ఆధ్యాత్మిక ఉత్సవం జరుగుతున్న సమయంలోనే హెచ్ఎస్2 ప్రచార ముగింపు కార్యక్రమమూ నిర్వహిస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం - ఆధ్యాత్మిక సంప్రదాయాలూ రాజ్యాంగ విలువల సమ్మేళనాన్ని ఇది సూచిస్తుంది.

కార్యక్రమంలో ముఖ్యాంశాలు:

విజయాలను వివరించే బుక్ లెట్ విడుదల: గౌరవనీయ న్యాయ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి దీనిని విడుదల చేస్తారు. ప్రారంభం, ప్రాంతీయ కార్యక్రమాలు, పోటీలు, ఏడాది పొడవునా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు సహా ‘హమారా సంవిధాన్ హమారా సమ్మాన్’ ప్రస్థానాన్ని ఇందులో వివరించారు.

న్యాయశాఖ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ: ఈ ప్రచార ప్రాతిపదికలను, కార్యక్రమాలను ప్రతిబింబించేలా రూపొందించిన 2025 క్యాలెండరును కూడా ప్రారంభిస్తారు.

హెచ్ఎస్2 ప్రచారంపై సినిమా విడుదల: హెచ్ఎస్2 ప్రచార ఏడాది ప్రస్థానాన్ని ప్రదర్శించేలా.. కార్యక్రమ ఆశయాన్ని ఆడియో- విజువల్స్ ద్వారా సంగ్రహంగా చిత్రించిన సినిమాను విడుదల చేస్తారు.

భారత రాజ్యాంగం, దాని చరిత్ర, ప్రస్తుత ప్రపంచంలో దాని ఔచిత్యంపై అవగాహన కల్పించడంలో ‘హమారా సంవిధాన్ హమారా సమ్మాన్’ ప్రచారం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఘనంగా ముగించడానికి, ‘హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్’ను ప్రారంభించడానికి ప్రయాగరాజ్ లో జరిగే కార్యక్రమం వేదికవుతుంది. దేశవ్యాప్తంగా పౌరులను భాగస్వాములను చేయడంలో సమష్టి కృషిని ఇది చాటుతుంది.

న్యాయ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పరమార్థ నికేతన్ అధ్యక్షులు - ఆధ్యాత్మికాధినేత పూజ్య స్వామి చిదానంద సరస్వతీ జీ గౌరవ అతిథిగా హాజరవుతారు. విశిష్ట అతిథిగా పరమార్థ నికేతన్ అంతర్జాతీయ డైరెక్టర్ పూజ్య సాధ్వి భగవతీ సరస్వతీ జీ పాల్గొంటారు. న్యాయ విభాగ కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్ గోయల్, సంయుక్త కార్యదర్శి శ్రీ నీరజ్ కుమార్ గయాగీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా ఈ నాలుగో కార్యక్రమాన్ని వైభవంగా సాగుతున్న మహాకుంభమేళా మధ్యలో ప్రయాగరాజ్ అరైల్ ఘాట్ సమీపంలోని పరమార్థ నికేతన్ త్రివేణీ పుష్ప్ వద్ద నిర్వహిస్తున్నారు. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ ప్రచారానికి ఇది నాంది. రాజ్యాంగం, దాని విలువలు, చట్టపరమైన హక్కుల ప్రాధాన్యాలను పౌరులందరికీ చాటడం దీని లక్ష్యం.  

 

***


(Release ID: 2095156) Visitor Counter : 10