సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా ఘనంగా పరాక్రమ దివస్


నేతాజీ జన్మస్థలమైన కటక్ లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఒడిశా ముఖ్యమంత్రి

Posted On: 21 JAN 2025 5:56PM by PIB Hyderabad

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలమైన చారిత్రక నగరం కటక్ లోని బారాబతి కోటలో పరాక్రమ దివస్ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. నేతాజీ 128వ జయంతి సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 25 వరకు ఆయనను స్మరించుకుంటూ నిర్వహించే ఈ వేడుకలో వివిధ కార్యక్రమాలుంటాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ ప్రారంభిస్తారు.

నేతాజీ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. మొదటి పరాక్రమ్ దివస్ ను కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ లో నిర్వహించారు. 2022లో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2023లో అండమాన్ - నికోబార్ ద్వీపసమూహంలో 21 పేరులేని ద్వీపాలకు 21మంది పరమవీర చక్ర పురస్కార గ్రహీతల పేర్లు పెట్టారు. 2024లో ఐఎన్ఏ విచారణలు జరిగిన ఢిల్లీలోని చారిత్రాక ఎర్రకోట వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.

ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది పరాక్రమ్ దివస్ వేడుకను నేతాజీ జన్మస్థలం, ఆయన తొలి భావాలను తీర్చిదిద్దిన కటక్ నగరంలో సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఒడిశా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు నేతాజీకి నివాళి అర్పించడం, ఆయన జన్మించిన ఇంటి వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో ఈ మూడు రోజుల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ భవనాన్ని ప్రస్తుతం మ్యూజియంగా తీర్చిదిద్దారు. అనంతరం ప్రధానమంత్రి వీడియో సందేశంతో బారాబతి కోటలో పరాక్రమ్ దివస్ వేడుకలు మొదలవుతాయి. ఇందులో భాగంగా సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలను వివరించేలా అరుదైన చిత్రాలు, లేఖలు, వివిధ పత్రాలతో ప్రదర్శననూ నిర్వహిస్తారు. ఆయన అద్భుత ప్రస్థానాన్ని వివరించేలా అగుమెంటెడ్/ వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలు కూడా ఉంటాయి. శిల్పకళా వర్క్ షాప్, చిత్రలేఖన పోటీ- వర్క్ షాప్ లను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. నేతాజీ ఘనతను, సుసంపన్నమైన ఒడిశా సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలను కూడా నిర్వహిస్తారు. వాటితోపాటు బోస్ జీవిత విశేషాలపై సినిమాలను కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రదర్శిస్తారు.  

 

***


(Release ID: 2095094) Visitor Counter : 66