ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహా కుంభ్ 2025 సందర్భంగా ఆహార సురక్షకు ఎఫ్ఎస్ఎస్ఏఐ విస్తృత చర్యలు..
ఆహార పరీక్షల కోసం రంగంలోకి సంచార ప్రయోగశాలలతోపాటు అధికారులూ
మేళా సమీప ప్రాంతాలన్నింటా హోటళ్లలో, ధాబాలలో, చిన్న ఆహార స్టాళ్లలో తరచుగా తనిఖీలు..
ఆహార భద్రతపై ఫిర్యాదులొస్తే రంగంలోకి దిగి, వెనువెంటనే తగిన కార్యాచరణకు చొరవ
సురక్షిత, స్వచ్ఛ భోజనం స్వీకరణ అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించే ధ్యేయంతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ
Posted On:
19 JAN 2025 6:58PM by PIB Hyderabad
ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం మహా కుంభ్ 2025ను నిర్వహిస్తున్న సందర్భంగా, అక్కడకు తరలివస్తున్న లక్షలాది భక్తజన సమూహాలకు సురక్షిత, స్వచ్ఛ ఆహారం అందుబాటులో ఉండేటట్లు చూడడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గట్టి చర్యలను పెద్దఎత్తున అమలుచేస్తోంది. ఆహార భద్రతపై శ్రద్ధ వహించే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల (ఎఫ్ఎస్ఓస్) మోహరింపు, ఆహార పదార్ధాల్ని పరీక్షించే సంచార ప్రయోగశాలల్ని (ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్) రంగంలోకి దింపడంతోపాటు ప్రజలకు మంచి ఆహారంపై అవగాహనను కలిగించే ప్రచార ఉద్యమాల్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహిస్తోంది. మహా కుంభ్ మేళా కొనసాగే కాలంలో ఆహార భద్రత పరిరక్షణకు సంబంధించిన విషయాల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది.
మహా కుంభ్ ను నిర్వహిస్తున్న ప్రాంతంలో అనేక చోట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆహార భద్రత, ఔషధ పరిపాలన యంత్రాంగం సహకారంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహారపదార్థాల విశ్లేషకుల సేవలను ఉపయోగించుకొంటూ ఉండడమే కాక 10 ఆహార పరీక్షా సంచార ప్రయోగశాలల్ని కూడా రంగంలోకి దింపింది. ఈ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఆహార పదార్థాల్లో ఏవైనా కల్తీలు జరుగుతున్నాయా, లేక అవి పాడయ్యే ప్రమాదం ఉందా అనే కోణంలో అక్కడికక్కడే ఆయా ఆహార పదార్థాలను తనిఖీ చేస్తున్నాయి. వివిధ ఆహారపదార్థాల చిరువ్యాపారులు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (ఎఫ్‌బీఓస్), సాధారణ ప్రజానీకం.. వీరికి స్వచ్ఛ ఆహారాన్ని భుజించే అంశాలపై అవగాహనను కలిగిస్తోంది. మేళా లో అన్నపానాదులకు సంబంధించి సురక్షిత వాతావరణాన్ని ఏర్పరచడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ పాటుపడుతోంది.
మేళా ప్రాంతాన్ని 5 మండలాలు (జోన్స్)తోపాటు 25 క్షేత్రాలు ( సెక్టర్స్)గా గుర్తించి, ప్రతి ఒక్క క్షేత్రంలోనూ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల (ఎఫ్ఎస్ఓస్)ను నియమించారు. వారికి స్వచ్ఛత, భద్రత ప్రమాణాల్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించే బాధ్యతను అప్పజెప్పారు. నిఘాను పటిష్టం చేయడానికి, అయిదుగురు చీఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల (సీఎఫ్ఎస్ఓస్) సహా మొత్తం 56 మంది ఎఫ్ఎస్ఓలను పెట్టారు. ప్రతి ఒక్క క్షేత్రంలో ఇద్దరు ఎఫ్ఎస్ఓల చొప్పున పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క జోనును ఒక సీఎఫ్ఎస్ఓ పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆహార భద్రత ప్రమాణాల్ని పక్కాగా అమలుపరుస్తున్నారా అని ఒక కంట కనిపెడుతున్నారు.
మేళాలో ఆహార భద్రత కార్యకలాపాల కేంద్ర స్థాయి నిర్వహణ కోసం నగరంలోని సెక్టర్ 24లో గల సంకట్ మోచన్ మార్గ్‌లో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మేళా పరిసరాల్లో హోటళ్లు, ధాబాలు, చిన్న ఆహార స్టాళ్లలో సైతం ఆహారం సరిగా ఉంటోందీ లేనిదీ తరచుగా తనిఖీ చేస్తున్నారు. ఆహారం బాగోలేదనే ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి వంటకు అనుసరిస్తున్న పద్ధతులను నిర్మొహమాటంగా అడిగి తెలుసుకోవడం, సోదాలు జరుపుతూ, అవసరమైన చర్యలను చేపట్టాల్సిందిగా క్షేత్ర స్థాయి బృందాలకు ఆదేశాలిచ్చారు. వంటలకు నాణ్యమైన పదార్థాలనే వాడుతున్నారా అనేది పరిశీలించడం కూడా ఇందులో ఓ భాగం చేయాలని బృందాలకు సూచించారు.
మహా కుంభ్ మేళా ప్రాంతంలో ఉపయోగిస్తున్న బియ్యం, చక్కెర, గోధుమ పిండి, ఇతర నిత్యావసర ఆహార వస్తువుల నమూనాను పరీక్షల కోసం క్రమం తప్పక సేకరిస్తున్నారు. ఈ నమూనాలను సేకరించడానికి పంపిణీ, నిలవ కేంద్రాలను కూడా గుర్తించి పెట్టుకొన్నారు. సేకరించిన నమూనాలను వారణాసిలో ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో పరీక్షిస్తున్నారు.
పర్యవేక్షణ, అమలు విధులకు తోడుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ భక్తులతో, వ్యాపారులతో ముఖాముఖి మాటామంతీకిగాను ఒక ఇంటరాక్టివ్ మండపాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ తరహా స్టాళ్లలో మనిషి ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టని ఆహారాన్ని స్వీకరించే పద్ధతులకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని వివరించే వీధినాటకాలను ప్రదర్శిస్తున్నారు. ఆహార భద్రత, పోషణ సంబంధిత విజ్ఞానం అంశాలపై ప్రశ్నోత్తరాల పోటీ (క్విజ్)లను కూడా ఈ స్టాళ్లలో నిర్వహిస్తున్నారు. స్టాల్‌లో ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు కూడా ఉండి కల్తీ, లైసెన్సు, శిక్షణ వంటి ముఖ్య అంశాలపై అవగాహనను కలగజేస్తున్నారు.
ఈ విధమైన ప్రచార ఉద్యమాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహిస్తూ, సురక్షిత, స్వచ్ఛ ఆహార సేవనానికి ప్రాధాన్యాన్నివ్వాలని ప్రజలకు సులభంగా అర్థమయ్యేటట్లు వివరించడానికి కంకణం కట్టుకుంది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నడుంకట్టిన ఈ విస్తృత స్థాయి ఏర్పాట్లు ప్రజారోగ్య సంరక్షణతోపాటు ఆహార భద్రతకు ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని సూచిస్తున్నాయి.
(Release ID: 2094491)
Visitor Counter : 8