కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మెరుగైన సేవలు, సభ్యులకు జీవన సౌలభ్యం, పీఎఫ్ బదలాయింపు ప్రక్రియ సరళతరం: ఈపీఎఫ్ఓ చర్యలు
Posted On:
19 JAN 2025 11:37AM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు వారు చేయాల్సిన పనిని సరళతరంగా మార్చే ఉద్దేశంతో, ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగాన్నుంచి వేరే ఉద్యోగానికి మారినప్పుడు పీఎఫ్ ఖాతా ట్రాన్స్‌ఫర్ విషయంలో అనుసరించాల్సిన పద్ధతిని సరళతరం చేసింది. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిముల్ని ఆ ఉద్యోగి ఇదివరకటి యాజమాన్య సంస్థ (ఎంప్లాయర్) పక్షాన గానీ, లేదా ఆ ఉద్యోగి ఇప్పటి యాజమాన్య సంస్థ తరఫున గానీ పంపించాల్సివస్తున్న నియమాన్ని చాలా వరకు కేసుల్లో ఈపీఎఫ్ఓ ఎత్తివేసింది. సవరించిన ప్రక్రియను ప్రారంభించడంతో, భవిష్యత్తులో 1.30 కోట్ల ట్రాన్స్‌ఫర్ క్లెయిముల్లో 1.20 కోట్ల క్లెయముల వరకు అంటే మొత్తం క్లెయిముల్లో 94 శాతం క్లెయిములను యాజమాన్య సంస్థ ప్రమేయం లేకుండా నేరుగా ఈపీఎఫ్‌ఓకు పంపించనున్నారు.
ప్రస్తుతం, సభ్యుల్లో ఎవరైనా ఏదైనా ఉద్యోగాన్ని వదలిపెట్టి వేరే ఏ సంస్థలోనో చేరినప్పుడు, కొన్ని సందర్భాల్లో ట్రాన్స్‌ఫర్ క్లెయిములకు యాజమాన్య సంస్థ నుంచి ఎలాంటి ఆమోదాన్నీ పొందాల్సిన అవసరం లేదు. 2024 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు, ఈపీఎఫ్‌ఓకు ఆన్‌లైన్ పద్ధతిలో దాదాపుగా 1.30 కోట్ల ట్రాన్స్‌ఫర్ క్లెయిములు అందాయి. వాటిలో నుంచి సుమారు 45 లక్షల క్లెయిములు ఆటో-జనరేటెడ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిములే. ఇవి మొత్తం ట్రాన్స్‌ఫర్ క్లెయిముల్లో 34.5శాతంగా ఉన్నాయి.
ఈ సరళీకరించిన పక్రియ అమల్లోకి రావడంతో సభ్యులు పెట్టుకొన్న దరఖాస్తు క్లెయిము గా మారడానికి పట్టే కాలం బాగా తగ్గిపోనుంది. ఇది సభ్యుల ఫిర్యాదుల సంఖ్యను కూడా చాలావరకు తగ్గించనుంది. (ప్రస్తుతం మొత్తం ఫిర్యాదుల్లో 17 శాతం ఫిర్యాదులు ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన అంశాలకు చెందినవే ఉంటున్నాయి) అలాగే, ఆయా ప్రతిపాదనల తిరస్కరణల్లోనూ తగ్గింపు చోటుచేసుకోనుంది. బడా యాజమాన్య సంస్థలకు ఈ తరహా కేసులకు ఆమోదాన్ని తెలియజేయడానికి సంబంధించిన పనిభారం పెద్దదిగా ఉంటున్నందువల్ల ఆ తరహా సంస్థల వ్యాపార నిర్వహణ సౌలభ్యం ఇక చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడే వీలుంటుంది.
సవరించిన విధానం అమల్లోకి వచ్చాక, ట్రాన్స్‌ఫర్ క్లెయిముల్ని ఈపీఎఫ్ఓ నేరుగా పరిష్కరిస్తుంది. ఫలితంగా సభ్యులకు అందే సేవలు వేగవంతమవుతాయి. ఈ సంస్కరణలు ఒక్క ప్రక్రియల్లో సువ్యవస్థీకరణను చేయడం మాత్రమే కాకుండా, ఈపీఎఫ్ఓ సేవలపై మరింత భరోసానూ, ఎక్కువ విశ్వాసాన్నీ కలగజేయడంలోనూ తోడ్పడతాయి.
ఈపీఎఫ్ఓ సభ్యులకు జీవన సౌలభ్యాన్ని అందించే ఉద్దేశంతో అనేక ప్రక్రియల్ని సరళతరంచేయడంతోపాటుగా ఈపీఎఫ్ఓ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య చాటిచెబుతోంది. టెక్నాలజీని వినియోగించుకొంటూ సభ్యులకు అనుకూలంగా ఉండే విధానాల్ని ప్రవేశపెడుతూ, వారికి ఎలాంటి అడ్డంకులూ ఎదురవకుండా సురక్షిత సేవల్ని అందించాలనేదే ఈపీఎఫ్ఓ లక్ష్యం.
***
(Release ID: 2094377)
Visitor Counter : 22