కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘న్యూ సంచార్ సాథీ మొబైల్ యాప్’ ద్వారా అందరి చెంతకూ భద్రత
పౌర కేంద్రీకృత టెలికాం కార్యక్రమాల్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
సంచార్ సాథీ మొబైల్ యాప్‌కు శ్రీకారం చుట్టిన మంత్రి
నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ (ఎన్‌బీఎమ్) 2.0 ఆవిష్కరణ
డీబీఎన్ ఆర్థికసాయం ద్వారా నిర్వహిస్తున్న 4జి మొబైల్ సైట్లలో ఇంట్రా- సర్కిల్ రోమింగు ప్రారంభం
వికసిత్ భారత్ సాకారం దిశగా ఈనాటి మూడు నూతన కార్యక్రమాలు: మంత్రి
టెక్నాలజీ, అనుసంధాన ప్రక్రియతో వికసిత్ భారతానికి సాధికారిత
పరస్పర సహకారం, నవకల్పన... వల్లనే రక్షణ సుసాధ్యం
డిజిటల్ మార్పు, ప్రపంచ స్థాయి పోటీతో సరికొత్త యుగం….
వికసిత్ భారత్ దార్శనికతకు సరిపోయే విధంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్నదే ఎన్‌బీఎమ్ 2.0 ధ్యేయం
డీబీఎన్ ఆర్థికసాయాన్ని అందించిన 4జి మొబైల్ సైట్లలో సర్కిళ్ల మధ్య రోమింగ్
అనేక టెలికాం సేవాప్రదాత సంస్థలకు ఒకే టవర్ నుంచి సేవలను అందించే వీలు
వినియోగదారులకు అంతరాయంలేని సేవలు..
Posted On:
17 JAN 2025 3:12PM by PIB Hyderabad
భారతదేశం అంతటా టెలికాం సేవల అందుబాటునూ, భద్రతనూ, సాధికారితనూ పెంచడానికి ఉద్దేశించిన ఒక ప్రధాన నిర్ణయంలో భాగంగా... పౌరులకు సేవలు అందించే కొత్త కార్యక్రమాల్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సంచార్ సాథీ మొబైల్ యాప్, నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ (ఎన్‌బీఎం) 2.0నూ ప్రవేశపెట్టడంతో పాటు డీబీఎన్ ఆర్థికసాయం చేసిన 4జి మొబైల్ సైట్లలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని ప్రారంభించడం వంటివి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
సంచార్ సాథీ మొబైల్ యాప్ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా తయారు చేసిన సదుపాయం. ఈ యాప్‌ను టెలికాం భద్రతను బలపర్చి, పౌరులకు సాధికారితను కల్పించడానికి రూపొందించారు. ఈ మొబైల్ అప్లికేషనును మంత్రి ప్రారంభిస్తూ...దీని ద్వారా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం ఒక్కటే కాకుండా, వినియోగదారులందరికీ ఒక సురక్షిత స్థితిని కల్పిస్తుందని తెలిపారు. సంచార్ సాథీ యాప్ అందరి కోసం టెలికాం నెట్‌వర్క్ ను భద్రమైనదిగా, సురక్షతమైందిగా, విశ్వసనీయమైందిగా నిర్వహించడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
యాండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్లలో సంచార్ సాథీ యాప్ లభ్యమవుతున్నది. ఇది యూజర్లకు వారి వారి టెలికాం సంబంధిత వనరులను భద్రంగా అట్టిపెట్టుకోవడానికీ, టెలికాం సంబంధిత మోసాలను ఎదుర్కోవడానికీ అవసరమైన కీలక సాధనాలను అందిస్తుంది.
ముఖ్యాంశాలు:
1. చక్షు: అనుమానాస్పద మోసపూరిత సందేశాల్ని నివేదించడం; అనుమానం వచ్చిన కాల్స్‌నూ, ఎస్ఎంఎస్లపై యాప్ ద్వారా, లేదా నేరుగా మొబైల్ ఫోన్ కాల్ లాగ్ నుంచి ఫిర్యాదు చేయవచ్చు.
2. మీ పేరుతో ఉన్న మొబైల్ కనెక్షన్లను గురించి తెలుసుకోండి: పౌరులు వారి పేరుతో జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లను ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు. అనధికారిక వినియోగం జరగకుండా ఇందువల్ల జాగ్రత్త తీసుకోవచ్చు.
3. పోగొట్టుకొన్న లేదా చోరీకి గురైన మీ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను బ్లాక్ చేయడం: మీరు మీ మొబైల్ ఫోన్లను పోగొట్టుకొన్నా, లేదా మీ మొబైల్ ఫోన్లను ఎవరైనా దొంగతనం చేసినా వెనువెంటనే అడ్డుకోవడం, ఆరా తీయడం, రాబట్టుకోవడం సాధ్యపడతాయి.
4. మొబైల్ హ్యాండ్‌సెట్ నికార్సయిందేనా అనేది తెలుసుకోండి: మొబైల్ హ్యాండ్‌సెట్స్ ప్రామాణికతను సరిచూడడానికి సులభమైన పద్ధతిని ఈ యాప్ అందిస్తుంది. దీంతో యూజర్లు చట్టబద్ధమైన సెల్ ఫోన్లను కొనుగోలు చేయడానికి వీలుంటుంది.
దేశంలో స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారి సంఖ్య 90 కోట్లకు మించిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ ఈ కీలక సేవలు అందుబాటులో ఉండేటట్టు చూడడమే సంచార్ సాథీ మొబైల్ యాప్ ధ్యేయం.
నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ (ఎన్‌బీఎమ్) 2.0
కేంద్ర మంత్రి జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ (ఎన్‌బీఎమ్) 2.0 దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించడం ద్వారా ఎన్‌బీఎమ్ 2.0ను ప్రారంభించారు. ఎన్‌బీఎమ్ 1.0 లో దాదాపుగా 8 లక్షల టవర్లను ఏర్పాటు చేయడంతో దానిని ప్రారంభ లక్ష్యం నెరవేరగా, తరువాతి చర్యగా ఎన్‌బీఎమ్ 2.0ను తీసుకొన్నామని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ‘‘బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారు సంఖ్య 66 కోట్ల నుంచి 94 కోట్లకు పెరిగింది. ఈ వృద్ధి ఎన్‌బీఎమ్ 2.0కు ఒక పునాదిగాను, ఆధారంగాను ఉపయోగపడింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
టెలికాం రంగంలో, డిజిటల్ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. 53.10 కోట్ల మందికి పైగా భారతీయులు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవల్ని అందుకొంటున్నారు. మన టెలికాం నెట్‌వర్క్ ఊతాన్నిస్తున్న యూపీఐ మాధ్యమం ద్వారా, గత సంవత్సరంలో 172 బిలియన్ (17200 కోట్ల) లావాదేవీలకు మార్గాన్ని సుగమం చేశాం. ఈ లావాదేవీల విలువ సుమారుగా రూ.247 కోట్లు. దేశ వృద్ధి నిజానికి మన టెలికాం నెట్‌వర్క్ శక్తితో పెనవేసుకొని ఉంది. ఈ దార్శనికతతోనే జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషనును ప్రారంభించామ’’ని కూడా కేంద్ర మంత్రి వివరించారు.
ఎన్‌బీఎమ్ 2.0 ప్రధాన ఉద్దేశమల్లా దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న 1.7 లక్షల గ్రామాలను సంధానించడంతోపాటు ఆకాంక్షాత్మక విజయాల్ని సాధించడం కూడానని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రతి 100 కుటుంబాల్లో కనీసం 60 కుటుంబాలు బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందుకొనే స్థితిలో ఉండేటట్టు చూడాలన్నదే మా లక్ష్యం. దీనికి అదనంగా, కనీసం 100 ఎంబీపీఎస్ ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించాలని కూడా మేం లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఇది నెరవేరితే, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పటిష్ట డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పడినట్లే’’ అని ఆయన వివరించారు.
ఈ-గవర్నెన్స్ మొదలు విపత్తు నిర్వహణ వరకు, ఎన్‌బీఎమ్ 2.0 ప్రతి ఒక్క రంగాన్నీ మార్చడానికి వాగ్దానాన్ని చేస్తోంది. అంతేకాక దీనికి దేశవ్యాప్తంగా సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే సామర్థ్యం కూడా ఉంది. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలను విస్తరించడం ఒక్కదాని గురించే కాదు. ఇది డిజటల్ మాధ్యమం ద్వారా అన్ని వర్గాలనూ రాబోయే కాలం వైపునకు నడిపించడానికి రంగాన్ని సిద్ధం చేయడానికి సంబంధించింది కూడా. భవిష్యత్తులో అనుసంధానం (కనెక్టివిటీ) మాత్రమే పౌరులందరికీ సాధికారితను అందిస్తుంది. భారతదేశం డిజిటల్ మాధ్యమ మార్గంలో ముందుకు పయనిస్తున్న కొద్దీ, మిషన్ లక్ష్యం స్పష్టమైన రూపును తీసుకుంటుంది. అనుసంధానం పూర్తయిన, ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే, సుస్థిర భారత్‌ను నిర్మించాలి. ఆ తరహా టెక్నాలజీతోపాటు నవకల్పన (ఇన్నొవేషన్) లు అందరికీ సమృద్ధిని సమకూరుస్తాయి.
భారతదేశాన్ని డిజిటల్ మార్పుపరంగా ఒక కొత్త యుగంలోకి తీసుకుపోవడమే ఎన్‌బీఎమ్ 2.0 ధ్యేయం. 2047కల్లా వికసిత్ భారత్‌ను ఆవిష్కరించాలని గౌరవ ప్రధానమంత్రి చెబుతున్న దానికి అనుగుణంగా హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్నూ, అందరికీ సార్థక సంధాన సదుపాయాన్నీ అందించడం ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయి జ్ఞాన ప్రధాన సమాజంగా రూపొందించాలన్న ఉద్దేశంతో ఎన్‌బీఎమ్ 2.0ను రూపొందించారు. 2019 మొదలు 2024 మధ్య కాలంలో అమలు చేసిన ఎన్‌బీఎమ్ 1.0 దానికి ఉద్దేశించిన లక్ష్యాలను సాధించడంలో విజయవంతం కావడంతో, ఇప్పుడు ఈ ఎన్‌బీఎమ్ 2.0 లో ఈ కింది అంశాలను ముఖ్య ప్రయోజనాలుగా నిర్దేశించుకొన్నారు:
1. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) సౌకర్యాన్ని 2030కల్లా 2.70 లక్షల గ్రామాలకు విస్తరించడం. ఇంతవరకు 50,000 కన్నా తక్కువగా నమోదైన స్థితి నుంచి... 95 శాతం వృద్ధి నమోదైంది.
2. పాఠశాలలు, పీహెచ్‌సీలు, ఆంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వంటి ప్రముఖ సంస్థల్లో 90 శాతం సంస్థలకు 2030కల్లా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని సమకూర్చడం.
3. బ్రాడ్‌బ్యాండ్ డౌన్‌లోడ్ స్పీడ్స్ పరంగా జాతీయ సగటు స్థాయిని 2024 నవంబరులో 63.55 ఎంబీపీఎస్ స్థాయిలో ఉండగా దీనిని 2030కల్లా 100 ఎంబీపీఎస్ స్థాయికి మెరుగుపరచడం.
4. ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్‌ప్లాన్ ప్లాట్‌ఫాం (పీఎంజీఎస్)లో 2026నాటికి ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల యాజమాన్యంలోని ఫైబర్ నెట్‌వర్కులలో 100 శాతం మ్యాపింగ్ ప్రక్రియను ముగించడం. అదనపు భారత్‌నెట్ ప్రాజెక్టుకు రంగాన్ని సిద్ధం చేయడానికి పీఎమ్‌జీఎస్‌ను ఉపయోగించడం.
5. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైట్ ఆఫ్ వే అప్లికేషన్ సగటు పరిష్కార కాలాన్ని ఇప్పుడున్న 60 రోజుల స్థాయి నుంచి 2030కల్లా సగానికి, అంటే 30 రోజులకు కుదించడం. ఇది 2019లో 449 రోజులుగా ఉంది.
6. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రతి 100 మందిలో 45 మంది ఇంటర్‌నెట్ సేవలను ఉపయోగిస్తున్నారు. 2030కల్లా ఈ సంఖ్యను 60కి పెంచడం.
7. 2030కల్లా 30 శాతం మొబైల్ టవర్లకు అంతరాయంలేని విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడం.
8. భూమి లోపల ఏర్పాటు చేసిన టెలికాం మౌలిక సదుపాయాలు, ఇతర వ్యవస్థలను పరిరక్షించడానికి ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ అనే మొబైల్ యాప్‌ను విస్తృతం చేస్తున్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి దీనిని 2023 మార్చి నెలలో ప్రారంభించారు.
9. టెలికమ్యూనికేషన్ల చట్టం-2023లో భాగంగా జారీ చేసిన కొత్త ఆర్ఓడబ్ల్యూ రూల్స్, 2024 వర్తించేటట్టు చూడడం కోసం కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పురపాలక సంఘాల వంటి అందరు ఆసక్తిదారులతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవడం.
10. 5జి నెట్‌వర్క్‌నూ, అలాగే 6జి సామర్థ్యం కలిగి ఉండే అత్యాధునిక నెట్‌వర్క్‌లనూ దేశంలో మూలమూలలా విస్తరించడానికి వీలుగా ఇప్పటికే ఉన్న పార్కులు, వీధి స్తంభాలు వంటి రెడీమేడ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.
11. టెలికాం నెట్‌వర్క్‌లు, ఇతర యుటిలీటీల నిర్వహణతోపాటు ఖర్చుల్లో తగ్గింపునకు తోడ్పడే విధంగా ఉమ్మడి, పంచుకోదగ్గ టెలికాం గొట్టాలు, యుటిలిటీ కారిడార్ల ఏర్పాటు కోసం ఆసక్తిదారులందరితో కలిసి పనిచేయడం.
12. దేశంలో దూరప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో విపత్తులు, యుద్ధాలు, ఇతర అత్యవసర స్థితులు ఏర్పడినప్పుడు.. అక్కడ సాంప్రదాయిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం సవాళ్లతో కూడుకొని ఉంటుంది కాబట్టి.. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల విశ్వసనీయతను పెంచడానికి విద్యుత్తు రంగంలోని ఆప్టికల్ గ్రౌండ్ వైర్ (ఓపీజీడబ్ల్యూ) వంటి ఉపకరణాలను ఉపయోగించుకోవడం.
డిబిఎన్ నిధులతో ఏర్పాటైన 4జి మొబైల్ ప్రాంతాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్
దేశంలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాల నడుమ టెలికం సదుపాయాల అంతరం తగ్గించడంలో డిజిటల్ భారత్ నిధి (డిబిఎన్; లోగడ యుఎస్ఒఎఫ్) తన విస్తృత మొబైల్ టవర్ ప్రాజెక్టుల ద్వారా కీలక పాత్ర పోషించింది. అలాంటి సంక్లిష్ట ప్రాంతాల్లో ‘డిబిఎన్’ నిధులతో ఏర్పాటైన టెలికాం టవర్లు, అదే తరహాలో ‘డిబిఎన్’ నిధులతో టవర్లు ఏర్పాటు చేసిన నిర్దిష్ట టెలికం సేవా ప్రదాన (టిఎస్‌పి) సంస్థల చందాదారులకు సేవలందిస్తున్నాయి. కానీ, ఇతర ‘టిఎస్‌పి’ సంస్థల చందాదారులకు ఇప్పటిదాకా ఈ ప్రయోజనం లభించడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కార్యక్రమంలో భాగంగా ‘డిబిఎన్’ నిధులతో ఏర్పాటైన 4జి మొబైల్ ప్రాంతాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసిఆర్) సదుపాయాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీని ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- “ఇదెంతో కీలక మూలస్తంభం. దేశంలోని మూడు టెలికం సేవాప్రదాన సంస్థలైన ‘బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్’ ప్రస్తుతం ‘డిబిఎన్’ నిధులతో ఏర్పాటైన టవర్లుగల అన్ని ప్రాంతాల్లో తమ మౌలిక సదుపాయాలను పరస్పరం వాడుకునేలా చేతులు కలుపుతున్నాయి. ఇటువంటి దాదాపు 27,836 ప్రాంతాల్లో అనుసంధానంతోపాటు దేశవ్యాప్త వినియోగదారులకు తమ అభీష్టానుసారం టెలికం సేవాప్రదాన సంస్థను ఎంచుకునే స్వేచ్ఛను కూడా మేం కల్పిస్తున్నాం.” అని చెప్పారు.
ఈ విధంగా ‘డిబిఎన్’ నిధులతో ఏర్పాటైన టవర్లుగల అన్ని 4జి మొబైల్ ప్రాంతాల్లో ‘టిఎస్‌పి'’ల మధ్య ‘ఐసిఆర్’ సదుపాయం ఉంటుంది కాబట్టి వివిధ ‘టిఎస్‌పి'’ల చందాదారులు వాటికి సంబంధించిన వేర్వేరు టవర్ల నుంచి కాకుండా ‘డిబిఎన్’ నిధులతో ఏర్పాటైన ఒకే టవర్ ద్వారా 4జి సేవలు పొందే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా ఆపరేటర్ల-ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గడంతోపాటు ఎక్కువ మంది చందాదారులు ప్రయోజనం పొందుతారు. అంటే- దాదాపు మొత్తం 27,000 టవర్ల ద్వారా సేవలందే 35,400కుపైగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు నిరంతరాయ 4జి అనుసంధానానికి హామీ లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ (టెలికం విభాగం) కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ మాట్లాడుతూ- ప్రభుత్వం చేపడుతున్న పౌర-కేంద్రక కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ‘సంచార్ సాథీ’ మొబైల్ అనువర్తనం పౌరులకు వ్యక్తిగత సాధికారతనిస్తుందని చెప్పారు. దీంతోపాటు మోసాల ముప్పును అరికట్టడంలో సమష్టి కృషికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అలాగే ‘డిబిఎన్’ నిధులతో ఏర్పాటైన మొబైల్ టవర్లుగల ప్రాంతాల్లో ‘ఐసిఆర్’ ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల వినియోగదారులకు ఎంతో ఉపయుక్తం కాగలదని ఆయన విశదీకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రిత్వశాఖ టెలికం విభాగం కార్యదర్శి, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డిసిసి) చైర్మన్ డాక్టర్ శ్రీ నీరజ్ మిట్టల్; ‘డిసిసి’ సభ్యులు శ్రీ రోహిత్ శర్మ (సర్వీసెస్), శ్రీ సంజీవ్ కె.బిద్వాయ్ (టెక్నాలజీ), అదనపు కార్యదర్శి (టి) శ్రీ గుల్జార్ నటరాజన్, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సంచార్ సాథీ ప్రాధాన్యం
టెలికం విభాగం (డిఒటి) చేపట్టిన అనేక పౌర-కేంద్రక కార్యక్రమాల్లో ‘సంచార్ సాథీ’ అత్యంత విజయవంతమైన కార్యక్రమం. ఈ మేరకు 2023 మే నెలలో (www.sancharsaathi.gov.in) పోర్టల్ ప్రారంభమయ్యాక సైబర్ మోసాలను అరికట్టడంలో గణనీయ ప్రగతి సాధించింది. ఈ మేరకు 9 కోట్ల మందికిపైగా ఈ పోర్టల్‌ను సందర్శించగా, 2.75 కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్లు తొలగించారు. అలాగే వినియోగదారులు పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన 25 లక్షలకుపైగా పరికరాలను కనుగొని రాబట్టారు. ఈ అద్భుత ఫలితాలతోపాటు సైబర్ నేరాలకు సంబంధించి 12.38 లక్షల వాట్సాప్ ఖాతాల రద్దు సహా ఆర్థిక మోసాల నివారణ దిశగా 11.6 లక్షల ‘ముసుగు’ (మ్యూల్) బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసారు. మరోవైపు ‘ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్’ను కూడా ‘డిఒటి’ ప్రవేశపెట్టింది. తద్వారా మోసపూరిత అంతర్జాతీయ కాల్స్ ద్వారా సాగే సైబర్ నేరాల పరిష్కార ప్రభావశీలత రుజువైంది. పోయినేడాది ఈ వ్యవస్థ ప్రారంభమయ్యాక కేవలం రెండు నెలల వ్యవధిలో 90 శాతం మోసపూరిత కాల్స్‌ను అడ్డుకుంది. దీంతో ఈ తరహా మోసాల సంఖ్య 1.35 కోట్ల స్థాయి నుంచి 6 లక్షలకు తగ్గింది. అలాగే డిజిటల్ అరెస్టు పేరిట వంచన, పన్ను లావాదేవీల రూపంలో మోసాలు, చట్టాల అమలు వ్యవస్థల తరహాలో బెదిరింపులు వంటి మోసగాళ్ల పన్నాగాల నిరోధంలో ఈ చురుకైన చర్యలు కీలకపాత్ర పోషిస్తూ సైబర్ దాడుల నుంచి పౌరులకు రక్షణ కల్పించాయి.
సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో కేంద్ర భద్రతా సంస్థలు, రాష్ట్ర పోలీసులు, “ఐ4సి, జిఎస్టిఎన్, బ్యాంకులు, టిఎస్‌పి, సెబి, సిబిడిటి, డిజిజిఐ, ఐబి, సిబిఐ” సహా వాట్సాప్ వంటి 520కిపైగా ఇతరత్రా సంస్థలకు ‘డిఒటి’ నిఘా వేదిక గణనీయంగా మద్దతిచ్చింది. చట్టాల అమలు వ్యవస్థలు, ఆర్థిక సంస్థలు, టెలికం సేవా ప్రదాతలతో ‘డిఒటి’ సంయుక్త కృషి జాతీయ టెలికం భద్రతను మరింత బలోపేతం చేసింది. డిజిటల్ అంతరాన్ని తగ్గించడంతోపాటు అంతర్జాతీయ డిజిటల్ ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ‘డిఒటి’ నిబద్ధతను ఈ కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి.
‘ఎన్‌బిఎం 1.0’ ప్రాధాన్యం
ఈ కార్యక్రమం జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ-2018లో భాగంగా అమలవుతోంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాల వృద్ధిని వేగిరపరచడం, డిజిటల్ అంతరం తగ్గింపు, డిజిటల్ సాధికారత, సార్వజనీనత సౌలభ్యం, అందరికీ అందుబాటులో బ్రాడ్‌బ్యాండ్ సార్వత్రిక లభ్యత ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు. అలాగే విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇ-గవర్నెన్స్ సేవల లభ్యత మెరుగుదల, ఆర్థిక అవకాశాల పెంపు, డిజిటల్ అనుసంధానంతో సామాజిక సార్వజనీనత పెంపు వంటి విస్తృత ప్రభుత్వ ధ్యేయాలకు అనుగుణంగా ఇది అమలవుతోంది.
‘ఎన్‌బిఎం 1.0’ సాధించిన కొన్ని కీలక విజయాలు:
· దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబరు నాటికి 41.91 లక్షల కిలోమీటర్ల దాకా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్‌సి) నెట్‌వర్క్ విస్తరణ.
· టెలికం టవర్ల సంఖ్య 8.17 లక్షలకు చేరిక; బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య 941 మిలియన్లకు పెరుగుదల.
· “గతిశక్తి సంచార్” పోర్టల్ ద్వారా ప్రధాన ‘రైట్ ఆఫ్ వే’ (ఆర్ఒడబ్ల్యు) సమస్యల పరిష్కారం, ప్రక్రియల క్రమబద్ధీకరణ.
· భూగర్భ టెలికం మౌలిక సదుపాయాల రక్షణ దిశగా “కాల్ బిఫోర్ యు డిగ్” (సిబియుడి) మొబైల్ యాప్ రూపకల్పన.
(Release ID: 2094117)
Visitor Counter : 40