ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
15 JAN 2025 2:08PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నరు సి.పి.రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నా మంత్రివర్గ సీనియర్ సహచరులు - శ్రీ రాజ్ నాథ్ సింగ్, సంజయ్ సేథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, సిడిఎస్, సిఎన్ఎస్, నేవీ సహోద్యోగులు, మజగావ్ డాక్ యార్డ్ లో పనిచేసే సహోద్యోగులు, ఇతర అతిథులు, లేడీస్ అండ్ జెంటిల్ మెన్.
జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు భారతదేశ సముద్ర వారసత్వానికి, నావికాదళం అద్భుతమైన చరిత్రకు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కు ఒక గొప్ప రోజు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత నావికాదళానికి కొత్త బలాన్ని, కొత్త దార్శనికతను ఇచ్చారు. ఆయన నడయాడిన పవిత్ర భూమిలో, మేము 21 వ శతాబ్దపు నావికాదళాన్ని బలోపేతం చేసే దిశగా నేడు ఒక పెద్ద అడుగు వేస్తున్నాం. డిస్ట్రాయర్, ఫ్రిగేట్, సబ్ మెరైన్ లను కలిపి ప్రారంభించడం ఇదే తొలిసారి. అత్యంత గర్వించదగ్గ విషయం ఏమిటంటే, ఈ మూడు ప్రధాన యుద్ధ వాహనాలు మేడ్ ఇన్ ఇండియా కావడం. ఈ సందర్భంగా భారత నావికాదళానికి, వాటి నిర్మాణంలో భాగస్వాములైన అందరికీ, ఇంజినీర్లకు, కార్మికులకు, యావత్ దేశానికి నా అభినందనలు.
మిత్రులారా,
నేటి కార్యక్రమం మన ఘనమైన వారసత్వాన్ని భవిష్యత్తు ఆకాంక్షలతో అనుసంధానిస్తుంది. సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు, వాణిజ్యం, నౌకాదళ రక్షణ, నౌకా పరిశ్రమలో మనకు గొప్ప చరిత్ర ఉంది. చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని నేటి భారతదేశం ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోంది. ఈ రోజు ప్రారంభించిన యుద్ధ వాహనాలు కూడా దీనిని ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు, మన నీలగిరి నౌక చోళ రాజవంశం సముద్ర శక్తికి అంకితమైంది. గుజరాత్ ఓడరేవుల ద్వారా పశ్చిమాసియాతో భారత్ అనుసంధానమైన కాలాన్ని సూరత్ యుద్ధనౌక గుర్తు చేస్తుంది. ఈ రెండు నౌకలతో పాటు వాఘ్షీర్ జలాంతర్గామి కూడా నేడు అందుబాటులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం పీ75 తరగతికి చెందిన తొలి జలాంతర్గామి కల్వరి ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈ రోజు అదే తరగతికి చెందిన ఆరో జలాంతర్గామి వాఘ్షీర్ ను ప్రారంభించే భాగ్యం నాకు లభించింది. ఈ కొత్త సరిహద్దు యుద్ధ వాహనాలు భారతదేశ భద్రత, పురోగతి రెండింటికీ కొత్త బలాన్ని ఇస్తాయి.
మిత్రులారా,
నేడు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నదేశాల్లో నమ్మదగిన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందుతోంది. భారతదేశం విస్తరణవాదంతో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుంది. స్వేచ్చాయుత, బహిరంగ, సురక్షిత, సమ్మిళిత, సంపన్నవంతమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది.
అందుకే సముద్రానికి తీర దేశాల అభివృద్ధి విషయంలో భారత్ ‘సాగర్‘ అనే మంత్రాన్ని ఇచ్చింది. సాగర్ అంటే అప్రాంతంలోని అందరికీ భద్రత, ఎదుగుదల (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్) అని అర్థం. సాగర్ దృష్టి కోణంతో మనం ముందుకు సాగాం. జి-20 అధ్యక్ష పదవి బాధ్యత భారతదేశానికి వచ్చినప్పుడు, ప్రపంచానికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే మంత్రాన్ని అందించాం. కరోనా మహమ్మారితో ప్రపంచం పోరాడుతున్నప్పుడు ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అనే దృష్టిని భారత్ ఇచ్చింది. మనం మొత్తం ప్రపంచాన్ని మన కుటుంబంగా భావిస్తాం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సిద్ధాంతంలో మన విశ్వాసం ఉంది. అందుకే ఈ మొత్తం ప్రాంత రక్షణ, భద్రతను భారతదేశం తన బాధ్యతగా భావిస్తోంది.
మిత్రులారా,
ప్రపంచ భద్రత, ఆర్థిక, భౌగోళిక రాజకీయ స్వరూపాన్ని రూపుదిద్దడంలో భారత్ వంటి సముద్ర దేశం పెద్ద పాత్ర పోషించబోతోంది. ఆర్థిక పురోగతి, ఇంధన భద్రత కోసం ప్రాదేశిక జలాలను రక్షించడం, నౌకాయాన స్వేచ్ఛకు హామీ ఇవ్వడం, వాణిజ్య సరఫరా మార్గాలు, సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. ఉగ్రవాదం, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ఈ ప్రాంతం మొత్తాన్ని మనం కాపాడుకోవాలి. అందువల్ల, సముద్రాలను సురక్షితంగా, సంపన్నంగా మార్చడంలో మనం ప్రపంచ భాగస్వాములు కావడం ఈ రోజు చాలా ముఖ్యం, రవాణా సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడం, షిప్పింగ్ పరిశ్రమ అభివృద్ధిపై మనం కృషి చేస్తున్నాం. అరుదైన ఖనిజాలు, చేపల నిల్వలు వంటి సముద్ర వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, వాటిని పటిష్టంగా నిర్వహించడానికి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. కొత్త షిప్పింగ్ మార్గాలు, సముద్ర కమ్యూనికేషన్ మార్గాలను కనుగొనడంలో మనం పెట్టుబడులు పెడుతున్నాం. ఈ దిశలో నేడు భారతదేశం నిరంతర అడుగులు వేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి ప్రతిస్పందన దేశంగా అవతరించింది. గత కొన్ని నెలల్లోనే మన నౌకాదళం వందలాది మంది ప్రాణాలను కాపాడింది, వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ, అంతర్జాతీయ సరుకులను కాపాడింది. ఇది భారతదేశంపై ప్రపంచానికి నమ్మకాన్ని పెంచింది, మీ అందరి వల్ల ఇది పెరిగింది, అందుకే నేను ఈ రోజు మీ అందరినీ అభినందిస్తున్నాను. భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ లపై నమ్మకం కూడా పెరుగుతోంది. ఆసియాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ లేదా ఆఫ్రికా దేశాలతో భారతదేశ ఆర్థిక సహకారం నిరంతరం బలపడటాన్ని కూడా మీరు చూడవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఉనికి, దాని బలం ఈ సంబంధాల బలోపేతానికి చాలా పెద్ద ఆధారం. అందుకే ఈరోజు జరిగిన కార్యక్రమం సైనిక దృక్పథంతో పాటు ఆర్థిక కోణంలో కూడా అంతే ముఖ్యమైనది.
మిత్రులారా,
21వ శతాబ్దంలో భారతదేశ సైనిక సామర్థ్యం మరింత సమర్థవంతంగా, ఆధునికంగా ఉండడం దేశం ప్రాధాన్యతల్లో ఒకటి. నీరు, భూమి, ఆకాశం, లోతైన సముద్రం లేదా అనంతమైన అంతరిక్షం ఎక్కడైనా సరే , భారతదేశం ప్రతిచోటా తన ప్రయోజనాలను కాపాడుకుంటోంది.. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం సంస్కరణలు కొనసాగుతున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు కూడా అలాంటి ఒక ముఖ్యమైన సంస్కరణ. మన బలగాలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా థియేటర్ కమాండ్ల దిశలో కూడా భారత్ ముందుకు వెళ్తోంది.
మిత్రులారా,
గత పదేళ్లలో భారత త్రివిధ దళాలు స్వావలంబన మంత్రాన్ని స్వీకరించిన విధానం చాలా ప్రశంసనీయంగా ఉంది. సంక్షోభ సమయంలో ఇతర దేశాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అర్థం చేసుకున్న మీరంతా ఈ పనిని ముందుకు తీసుకెళ్తూ నాయకత్వాన్ని అందిస్తున్నారు. ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకోనవసరం లేని 5 వేలకు పైగా పరికరాలు, ఉపకరణాల జాబితాను మన సైన్యాలు సిద్ధం చేశాయి. ఒక భారతీయ సైనికుడు భారత్ లోనే తయారైన పరికరాలతో ముందుకు సాగితే అతని ఆత్మవిశ్వాసం కూడా భిన్నంగా ఉంటుంది. గత పదేళ్లలో దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కర్మాగారం కర్ణాటకలో ప్రారంభమైంది. సైన్యం కోసం రవాణా విమానాలను తయారు చేసే కర్మాగారం ప్రారంభమైంది. తేజస్ యుద్ధ విమానం భారతదేశ ఖ్యాతిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. యూపీ, తమిళనాడులో నిర్మిస్తున్న డిఫెన్స్ కారిడార్లు రక్షణ ఉత్పత్తికి మరింత ఊతమివ్వనున్నాయి. మన నావికాదళం కూడా మేకిన్ ఇండియా ప్రచారాన్ని చాలా వరకు విస్తరించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీ మజ్గావ్ డాక్ యార్డ్ సహోద్యోగులందరికీ ఇందులో చాలా పెద్ద పాత్ర ఉంది. గత పదేళ్లలో 33 నౌకలు, 07 జలాంతర్గాములు భారత నౌకాదళంలో చేరాయి. ఈ 40 నౌకాదళ నౌకల్లో 39 నౌకలను భారత షిప్ యార్డుల్లో నిర్మించారు. ఇందులో మన అద్భుతమైన, బ్రహ్మాండమైన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ వంటి అణు జలాంతర్గాములు ఉన్నాయి. మేకిన్ ఇండియాకు ఇంత ఊతమిచ్చినందుకు దేశంలోని త్రివిధ దళాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రస్తుతం భారత రక్షణ ఉత్పత్తి రూ.1.25 లక్షల కోట్లు దాటింది. 100 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నాం. మీ మద్దతుతో భారత్ తన రక్షణ రంగాన్ని వేగంగా మార్పులు సాధించగలదని నేను విశ్వసిస్తున్నాను..
మిత్రులారా!
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత సాయుధ దళాలను మరింత శక్తిమంతం చేయడంతోపాటు ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు కూడా వేస్తోంది. నౌకా నిర్మాణావరణం రూపుదిద్దుకోవడమే ఇందుకు నిదర్శనం. నౌకా నిర్మాణంలో ఎంత ఎక్కువగా పెట్టుబడులు పెడితే, ఆర్థిక వ్యవస్థపై అది అంత ఎక్కువగా సానుకూల ప్రభావం చూపుతుందని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. నిపుణులు కూడా ఇదే మాట చెబుతారు. అంటే- నౌకా నిర్మాణంలో మనం ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే ఆర్థిక వ్యవస్థలో రూ.1.82 వంతున చలామణీలోకి వస్తుంది. ప్రస్తుతం దేశంలో 60 భారీ నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ .1.5 లక్షల కోట్లు. దీన్నిబట్టి ఇంత భారీ పెట్టుబడి వల్ల సుమారు రూ.3 లక్షల కోట్లు చలామణీలోకి వస్తాయి. ఇక ఉపాధి పరంగా ఇది 6 రెట్లదాకా బహుముఖ ప్రభావం చూపుతుంది. ఈ నౌకల నిర్మాణానికి అవసరమైన సరంజామా, పెద్ద సంఖ్యలో ఓడల విడిభాగాలు దేశవ్యాప్తంగాగల ‘ఎంఎస్‌ఎంఇ’ నుంచి సరఫరా అయినవే. అంటే- 2000 మంది కార్మికులు నౌకా నిర్మాణంలో భాగస్వాములైతే, సరఫరాదాలైన ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం సహా ఇతరత్రా పరిశ్రమలలో సుమారు 12 వేల ఉద్యోగాలు అందివచ్చాయన్న మాట!
మిత్రులారా!
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ నేడు శరవేగంగా ముందంజ వేస్తోంది. మన తయారీ రంగంతోపాటు ఎగుమతి సామర్థ్యం కూడా నిరంతరం వృద్ధి చెందుతోంది. అందువల్ల భవిష్యత్తులో దేశానికి వందలాది కొత్త నౌకలు, కంటైనర్లు అవసరం. కాబట్టి, ఓడరేవుల సారథ్యంలో ప్రగతి నమూనా మన ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్తేజమిచ్చి, వేలాది కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
మిత్రులారా!
వివిధ నౌకలలో ప్రస్తుతం పనిచేస్తున్న నావికా సిబ్బంది సంఖ్యే ఈ రంగంలో ఉపాధి పెరుగుదలకు ఒక ఉదాహరణ. ఆ మేరకు 2014లో భారత నావికా సిబ్బంది సంఖ్య 1.25 లక్షలకన్నా తక్కువ కాగా, నేడు రెట్టింపు పెరుగుదలతో దాదాపు 3 లక్షలకు చేరింది. తద్వారా నావికా సిబ్బంది సంఖ్య రీత్యా ప్రపంచంలో తొలి 5 స్థానాల్లోగల దేశాల జాబితాలో చేరింది.
మిత్రులారా!
మా ప్రభుత్వం మూడోదఫా ఏర్పడిన తర్వాత అత్యంత కీలక నిర్ణయాలతో పరిపాలన మొదలైంది. అంటే సరికొత్త విధానాలను వేగంగా రూపొందించడమే కాకుండా దేశ అవసరాల దృష్ట్యా అనేక కొత్త పనులకు శ్రీకారం చుట్టాం. దేశం నలుమూలలా, ప్రతి రంగం సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంతో కృషి చేస్తున్నాం. ఓడరేవుల రంగం విస్తరణ ఇందులో ఒక భాగం. మహారాష్ట్రలో వడవన్ రేవు విస్తరణకు ఆమోదం తెలపడం మా మూడో పదవీకాలం తొలినాళ్ల భారీ నిర్ణయాల్లో ఒకటి. మొత్తం రూ.75 వేల కోట్ల వ్యయంతో ఈ ఆధునిక రేవు నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇది మహారాష్ట్రలో వేలాది కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.
మిత్రులారా!
దేశ సరిహద్దులు, తీరప్రాంతాల్లో అనుసంధాన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అంతగా శ్రద్ధ చూపలేదు. కానీ, గత పదేళ్లలో ఈ దిశగా అద్భుతంగా కృషి సాగింది. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట జమ్ముకశ్మీర్‌లో సోన్‌మార్గ్ సొరంగాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఇది కార్గిల్, లద్దాఖ్ వంటి మన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే మార్గాన్ని సుగమం చేస్తుంది. దీనికిముందు గత ఏడాది అరుణాచల్ ప్రదేశ్‌లో సెలా సొరంగం ప్రారంభించం. ఇది మన సైన్యాన్ని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్దకు సులువుగా చేరుస్తుంది. ఇప్పడిక ‘షిన్‌కున్ లా, జోజిలా’ వంటి సొరంగాల నిర్మాణంలో భాగంగా అనేక సంక్లిష్ట మౌలిక సదుపాయాల పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే భారత్‌మాల ప్రాజెక్ట్ కింద సరిహద్దు ప్రాంతాల్లో అద్భుతమైన జాతీయ రహదారుల నెట్‌వర్క్ సిద్ధమవుతోంది. అంతేగాక సరిహద్దు గ్రామాల అభివృద్ధిలో ‘వైబ్రంట్ విలేజ్’ కార్యక్రమం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన దశాబ్దంలో మేము మన సుదూర ద్వీపాల ప్రగతిపైనా దృష్టి సారించాం. జన సంచారంలేని ఆ ద్వీపాలను నేడు క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతోపాటు వాటికి కొత్త గుర్తింపును కూడా సృష్టిస్తున్నాం. కొత్త పేర్లు కూడా పెడుతున్నాం. అంతేకాదు... హిందూ మహాసముద్ర జలాంతర పర్వతాలకూ నామకరణం చేశాం. ఈ మేరకు నిరుడు భారత్ చొరవతో ఒక అంతర్జాతీయ సంస్థ అటువంటి 5 ప్రదేశాలకు పేరు పెట్టింది. ఈ మేరకు “అశోక్, హర్షవర్ధన్, రాజరాజ చోళ” సీమౌంట్స్, ‘కల్పతరు రిడ్జ్, చంద్రగుప్త రిడ్జ్’ పేరిట భారత ప్రతిష్ఠను సమున్నతంగా చాటుతున్నాయి.
మిత్రులారా!
భవిష్యత్తులో అంతరిక్షం, సముద్ర గర్భం రెండూ ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. అందుకే, నేడు ఈ రెండు రంగాల్లోనూ భారత్ తన సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇప్పటిదాకా సముద్రగర్భంలో అత్యంత లోతుకు చేరిన ఘనత కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం. అయితే, భారత సముద్రయాన్ ప్రాజెక్ట్ మన శాస్త్రవేత్తలను 6 వేల మీటర్ల లోతుకు తీసుకెళ్లగలదు. భవిష్యత్ అవకాశాల సద్వినియోగంలో మా ప్రభుత్వం ఏమాత్రం చేజారనివ్వదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
మిత్రులారా!
ఈ 21వ శతాబ్దపు భారత్ సంపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేయాలంటే బానిసత్వ కాలపు చిహ్నాల నుంచి మనం విముక్తి పొందడం ఎంతో ముఖ్యం. ఈ దిశగా మన నావికాదళం తన నాయకత్వ పటిమను చాటుకుంది. ఆ మేరకు తన జెండాను ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుత సంప్రదాయంతో అనుసంధానించింది. దాని ప్రకారం అడ్మిరల్ ర్యాంక్ ఎపాలెట్లకు కూడా పునఃరూపకల్పన చేసింది. మరోవైపు దేశ స్వావలంబనకు ఉద్దేశించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కూడా బానిస మనస్తత్వం నుంచి స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో మీరంతా ఇలాగే దేశం గర్వించేలా కృషి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. దేశాభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమాన్ని మనం సమష్టిగా విజయవంతం చేయాలి. మన బాధ్యతలు భిన్నమైనవి కావచ్చు... కానీ, ప్రతి ఒక్కరి ఏకైక లక్ష్యం- ‘వికసిత భారత్’ నిర్మాణమే. ఈ రోజు దేశానికి లభించిన ఈ కొత్త సరిహద్దు వేదికలు మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
మిత్రులారా!
ఇక సరదాగా ఏదైనా చెప్పాలంటే- మన సాయుధ దళాలు నిర్వహించే దాదాపు అన్ని కార్యక్రమాలకూ నేను హాజరవుతుంటాను. ఆ సందర్భాల్లో ఆహార పదార్థాల విషయంలో నా అనుభవం చెబుతాను. అత్యుత్తమ విందు ఏర్పాట్లు ఏవైనా ఉన్నాయంటే అది నావికాదళం కార్యక్రమాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు సూరత్ పేరు దీనికి తోడైంది. మనందరికీ తెలిసిన, అందరి నోళ్లలో నానుతుండే ఒక నానుడి చెబుతాను... కెప్టెన్ సందీప్.. మీరు జాగ్రత్తగా వినండి. “సూరత్‌లో భోజనం-కాశీలో కన్నుమూత రెండూ సమానం” అంటారు. ఈ నేపథ్యంలో ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక ప్రారంభం సందర్భంగా కెప్టెన్ సందీప్ అందరికీ ‘సూరత్’ రుచులు తప్పకుండా చూపగలరని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా!
ఇదెంతో శుభ సందర్భం... యావద్దేశం మీకు శుభాకాంక్షలు చెబుతోంది. ప్రజానీకం హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. అందుకే సరికొత్త విశ్వాసంతో, నవ్యోత్సాహంతో ఉత్తేజంతో, నవ సంకల్పంతో ‘వికసిత భారత్’ గమ్యం చేరాలంటే మనమంతా సమష్టి శక్తితో ముందడుగు వేయాలి. ఈ సందర్భంగా మూడంచెలలో నాకు దక్కిన గొప్ప సత్కారానికిగాను మిమ్మల్నందర్నీ అభినందిస్తూ నా ప్రసంగం ముగిస్తాను. మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. ఇప్పుడు మీ శక్తినింతా గొంతులోకి తెచ్చుకుని నినదించండి-
భారత్ మాతా కీ జై!
కనీసం ఈ కార్యక్రమంలోనైనా దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తండి.
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ధన్యవాదాలు...
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సమీప స్వేచ్ఛానువాదం.
****
(Release ID: 2093592)
Visitor Counter : 35
Read this release in:
Odia
,
English
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Tamil
,
Kannada