ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన చెస్ ఛాంపియన్ గుకేశ్. డి

Posted On: 28 DEC 2024 6:34PM by PIB Hyderabad

చెస్ ఛాంపియన్ గుకేశ్. డి ఆదివారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. గుకేశ్ దృఢ సంకల్పం, అంకితభావాలను శ్రీ మోదీ ప్రశంసించారు. ఆయన సంకల్పం స్ఫూర్తిదాయకమన్నారు.

యోగా, ధ్యానం మనలో ఎలాంటి పరివర్తన కలిగించగలవన్న అంశాలపై ఈరోజు తమ సంభాషణ జరిగిందని ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ థ్రెడ్ పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“చెస్ ఛాంపియన్, భారత్ కు గర్వకారణమైన @DGukeshతో అద్భుతమైన సంభాషణ జరిగింది. నేను కొన్నేళ్లుగా సన్నిహితంగా ఆయనతో మాట్లాడుతున్నాను.. ఆయనలో ఎక్కువగా ఆకట్టుకునేవి సంక్పం, అంకితభావం. ఆయన సంకల్పం నిజంగా స్ఫూర్తిదాయకం. కొన్నేళ్ల కిందటి ఆయన వీడియో ఒకటి నాకు గుర్తొచ్చింది. తాను అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ అవుతానని అందులో ఆయన చెప్పారు – ఆయన కృషి వల్ల ఇప్పుడది స్పష్టంగా నిజమైంది.”

“సంకల్పానికి తోడు ప్రశాంత చిత్తం, వినయం గుకేశ్ ను తీర్చిదిద్దాయి. కష్టపడి సాధించిన ఈ విజయాన్నెలా చాటుకోవాలో ఆయనకు తెలుసు. విజయం సొంతమైన తర్వాత ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉన్నారు. యోగా, ధ్యానం మనలో ఏ విధమైన పరివర్తన కలిగించగలవన్న అంశాలపై ఈరోజు మాట్లాడుకున్నాం.”

“ప్రతి క్రీడాకారుడి విజయంలో వారి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. గుకేశ్ కు అన్నివిధాలా సహకరించిన ఆయన తల్లిదండ్రులను నేను అభినందించాను. క్రీడలను కెరీర్‌గా కొనసాగించాలని కలలు గనే అసంఖ్యాకులైన యువ ఔత్సాహికుల తల్లిదండ్రులకు వారి అంకితభావం స్ఫూర్తినిస్తుంది.”

“ఆయన ఆడి గెలిచిన ఒరిజినల్ చెస్ బోర్డును స్వీకరించడమూ నాకు సంతోషం కలిగిస్తోంది. గుకేశ్, డింగ్ లీరెన్ ఇద్దరి ఆటోగ్రాఫ్ లతో కూడిన ఆ చెస్ బోర్డు ఓ గొప్ప జ్ఞాపకం.” 

***

MJPS/SR


(Release ID: 2088775) Visitor Counter : 23