ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీలంక అధ్యక్షుడితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన

Posted On: 16 DEC 2024 6:15PM by PIB Hyderabad

గౌరవనీయ అధ్యక్షుడు అనూర కుమార దిసనాయక గారికీ,
ఇరు దేశాల ప్రతినిధులకూ,
మీడియా మిత్రులకూ శుభాకాంక్షలు!

అధ్యక్షుడు దిసనాయకను హృదయపూర్వకంగా భారత్ కు స్వాగతిస్తున్నాను. అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన కోసం మీరు భారత్ ను ఎంచుకోవడం సంతోషాన్నిస్తోంది. అధ్యక్షుడు దిసనాయక పర్యటన మన సంబంధాల్లో పునరుత్తేజాన్ని, శక్తిని నింపింది. మా భాగస్వామ్యం విషయంలో మేం భవిష్యత్ దార్శనికతను అవలంబించాం. మా ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడుల ఆధారిత వృద్ధి, అనుసంధానతకు ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాకుండా ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ అనుసంధానత మా భాగస్వామ్యంలో ముఖ్యమైన మూలాధారాలుగా ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య విద్యుత్-గ్రిడ్ అనుసంధానత, బహుళ-ఉత్పత్తి పెట్రోలియం పైప్‌లైన్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తాం. శాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం. దానితోపాటు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్ జీని సరఫరా చేస్తాం. ఈటీసీఏను త్వరలోనే పూర్తిచేసి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇరువైపులా కృషి జరుగుతుంది.


మిత్రులారా,
ఇప్పటి వరకు భారతదేశం ఆర్థిక చేయూతనూ, 5 బిలియన్ డాలర్ల విలువైన రుణ భరోసానూ అందించింది. శ్రీలంకలోని మొత్తం 25 జిల్లాలకు చేయూతనిస్తున్నాం. మా భాగస్వామ్య దేశాల అభివృద్ధి ప్రాధాన్యాల ఆధారంగానే ఎల్లప్పుడూ మా ప్రాజెక్టుల ఎంపిక ఉంటుంది. మాహో నుంచి అనురాధపుర రైలు విభాగం, కంకేసంతురై ఓడరేవు వరకు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఆర్థిక చేయూతను అందించడం ద్వారా ఈ అభివృద్ధి సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని మేం నిర్ణయించాం. మా విద్యాపరమైన సహకారంలో భాగంగా జాఫ్నాతోపాటు శ్రీలంక తూర్పు ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించబోతున్నాం. వచ్చే ఐదేళ్లలో శ్రీలంకకు చెందిన 1500 మంది సివిల్ సర్వెంట్లు భారత్ లో శిక్షణ పొందుతారు. గృహనిర్మాణం, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలతోపాటు వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో శ్రీలంకకు భారత్ చేయూతనిస్తోంది. శ్రీలంకలో విశిష్ట డిజిటల్ గుర్తింపు ప్రాజెక్టులో భారత్ భాగస్వామి కానున్నది.


మిత్రులారా,

మా భద్రతా ప్రయోజనాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని అధ్యక్షుడు దిసనాయక, నేను పూర్తిగా విశ్వసిస్తున్నాం. భద్రతా సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని నిర్ణయించాం. సముద్ర అధ్యయనంలోనూ సహకారం కోసం అంగీకారం కుదిరింది. ప్రాంతీయ శాంతి, భద్రత, అభివృద్ధి కోసం కొలంబో భద్రతా సదస్సు ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని మేం విశ్వసిస్తున్నాం. ఇందులో భాగంగా సముద్ర భద్రత, ఉగ్రవాద ప్రతిఘటన, సైబర్ భద్రత, అక్రమ రవాణా- వ్యవస్థీకృత నేరాలను అరికట్టడం, మానవతా సాయం, విపత్తు ఉపశమనం అంశాల్లో సహకారం లభిస్తుంది.

మిత్రులారా,
మన నాగరికతల్లోనే భారత్- శ్రీలంక మధ్య ప్రజా సంబంధాల మూలాలున్నాయి. భారత్ పాళీని ప్రాచీన భాషగా ప్రకటించిన వేళ, శ్రీలంక కూడా ఆ వేడుకలో భాగమైంది. జల రవాణా సేవలు, చెన్నై-జఫ్నా వైమానిక పర్యాటకానికి ఊతమివ్వడమే కాక, సాంస్కృతిక సంబంధాలను కూడా బలోపేతం చేశాయి. నాగపట్టణం – కంకేసంతురై జల రవాణా సేవలను విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, మేం రామేశ్వరం - తలైమన్నార్ మధ్య కూడా అలాంటి సేవలను ప్రారంభించాలని సంయుక్తంగా నిర్ణయించాం. బౌద్ధ పర్యాటకం, శ్రీలంకలోని రామాయణ పథం ద్వారా పర్యాటక రంగాన్ని విశేషంగా అభివృద్ధి చేసే చర్యలు కూడా మొదలవుతాయి.


 

మిత్రులారా,
మన మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశాలపై కూడా మేం సుదీర్ఘంగా చర్చించాం. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడంపై మేమిద్దరం అంగీకారానికి వచ్చాం. శ్రీలంకలో పునర్నిర్మాణం, సమన్వయం అంశాలపైనా మేం చర్చించాం. అందరినీ కలుపుకునిపోయే దృక్పథంతో తాను వ్యవహరించాలనుకుంటున్నట్టు అధ్యక్షుడు దిసనాయక తెలియజేశారు. తమిళ ప్రజల ఆకాంక్షలను శ్రీలంక ప్రభుత్వం నెరవేరుస్తుందని మేం ఆశిస్తున్నాం. అంతేకాకుండా, శ్రీలంక రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడం, ప్రాంతీయ మండలి ఎన్నికల నిర్వహణపై చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని భావిస్తున్నాం.

మిత్రులారా,
దేశ నిర్మాణం కోసం చేస్తున్న కృషిలో భారత్ విశ్వసనీయమైన భాగస్వామిగా నిలుస్తుందని అధ్యక్షుడు దిసనాయకకు నేను హామీ ఇచ్చాను. అధ్యక్షుడు దిసనాయక, ఆయన ప్రతినిధులకు మరోసారి భారత్ కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. బోధగయ సందర్శన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.. అది ఆధ్యాత్మిక శక్తినీ, స్ఫూర్తినీ నింపుతుందని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు.

గమనిక – ఇది ప్రధాని వ్యాఖ్యలకు ఇంచుమించు అనువాదం. అసలైన వ్యాఖ్యలు హిందీలో ఉన్నాయి.  

 

***


(Release ID: 2085138) Visitor Counter : 22