ప్రధాన మంత్రి కార్యాలయం
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ
దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాలలో జరగనున్న ఎస్ఐహెచ్ 2024 గ్రాండ్ ఫినాలేలో పాల్గొననున్న 1300కు పైగా విద్యార్థి బృందాలు
సంస్థల స్థాయిలో ఈ ఏడాది నిర్వహించిన అంతర్గత హ్యాకథాన్లలో 150 శాతం వృద్ధి;
దీంతో ఇంతవరకు నిర్వహించిన సంచికల్లో అతి పెద్ద సంచిక ఇదే కానుంది
Posted On:
09 DEC 2024 7:38PM by PIB Hyderabad
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్)లో ఏడో సంచికను 2024 డిసెంబర్ 11న ఏకకాలంలో దేశమంతటా 51 నోడల్ కేంద్రాలలో మొదలుపెడతారు. దీనిలో భాగంగా సాఫ్ట్‌వేర్ ఎడిషన్‌ను 36 గంటలపాటు ఎలాంటి విరామాన్నీ ఇవ్వకుండానే నిర్వహిస్తూ, హార్డ్‌వేర్ ఎడిషన్ మాత్రం 2024ను డిసెంబరు 11 మొదలు 15 వరకు కొనసాగించనున్నారు. ఇదివరకు నిర్వహించిన సంచికల్లో మాదిరిగానే విద్యార్థి బృందాలు మంత్రిత్వ శాఖలుగానీ, విభాగాలుగానీ, పరిశ్రమలుగానీ ఇచ్చిన సమస్యలపై కసరత్తు చేయడమో లేదా జాతీయ ప్రాముఖ్యమున్న రంగాలకు సంబంధించిన 17 ఇతివృత్తాల్లో ఏ ఒక్క ఇతివృత్తంపైన అయినా తమ ఆలోచనలను ‘స్టూడెంట్ ఇనొవేషన్ కేటగిరీ’ కింద సమర్పిస్తాయి. జాతీయ ప్రాముఖ్యమున్న రంగాల్లో.. ఆరోగ్య సంరక్షణ, వస్తు సరఫరా యాజమాన్యం- ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ, స్మార్ట్ టెక్నాలజీలు, సంస్కృతి-సంప్రదాయాలు, సుస్థిరత, విద్య-నైపుణ్యాభివృద్ధి, నీరు, వ్యవసాయం-ఆహారం, కొత్తగా వృద్ధిలోకి వస్తున్న టెక్నాలజీలు, విపత్తు నిర్వహణ.. ఉన్నాయి.
ఈ సంవత్సరం పరిష్కరించడానికి ఇచ్చిన సమస్యలలో ఆసక్తిదాయకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో.. ఇస్రో ఇచ్చిన ‘చంద్ర గ్రహంలో చీకటి నిండి ఉన్న ప్రాంతాల చిత్రాల్లో స్పష్టతను పెంచడం’, జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘గంగానదిలో నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థకు కృత్రిమ మేధ (ఏఐ), ఉపగ్రహం అందించే సమాచారం, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)తో పాటు డైనమిక్ మోడల్స్‌ను ఉపయోగించుకొంటూ వాస్తవ కాల ప్రాతిపదికన పనిచేసే ఒక వ్యవస్థను అభివృద్ధి చేయడం’తో పాటు ఆయుష్ శాఖ ఇచ్చిన ‘కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఒక స్మార్ట్ యోగ మ్యాట్‌ను అభివృద్ధిపరచడం’ వంటివి భాగంగా ఉన్నాయి.
ఈ సంవత్సరం మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు.. ఇవన్నీ కలిసి మొత్తం 54కి పైగా విభాగాలు 250 కన్నా ఎక్కువ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరాయి. సంస్థల స్థాయిలో నిర్వహించిన అంతర్గత హ్యాకథాన్ లలో 150 శాతం వృద్ధి నమోదైంది. ఎస్ఐహెచ్ 2023లో 900 అంతర్గత హ్యాకథాన్లు 900కు పైగా ఉంటే, ఎస్ఐహెచ్ 2024లో సుమారు 2,247కు చేరాయి. అంటే అంతర్గత హ్యాకథాన్ ల పరంగా ఎస్ఐహెచ్ 2024 అతి భారీ స్థాయి సంచికన్నమాట. ఎస్ఐహెచ్ 2024లో సంస్థల స్థాయిలో 86,000కన్నా ఎక్కువ బృందాలు పాల్గొన్నాయి. ఈ సంస్థలు దాదాపు 49,000 విద్యార్థి బృందాలను (ఒక్కొక్క బృందంలో ఆరుగురు విద్యార్థులతోపాటు ఇద్దరు గురువులు కూడా ఉన్నారు) జాతీయ స్థాయి పోటీకి సిఫార్సు చేశాయి.
***
(Release ID: 2082980)
Visitor Counter : 37
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada