ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో ప్రధానమంత్రి పర్యటన


రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్ 2024ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ప్రధాని చేతుల మీదుగా ఎల్ఐసీ ‘బీమా సఖి యోజన’ ప్రారంభం

కర్‌నాల్ లో మహారాణా ప్రతాప్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ప్రధాన కేంపస్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 08 DEC 2024 9:46AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో పర్యటించనున్నారు. జైపూర్ కు ఆయన ఉదయం సుమారు పదిన్నర గంటలకు  జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (జేఈసీసీ)లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.  ఆ తరువాత ప్రధాని పానిపట్ కు  వెళ్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు, ఆయన ఎల్ఐసీ బీమా సఖి యోజనను ప్రారంభిస్తారు. దీంతో పాటు మహారాణా ప్రతాప్ ఉద్యాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రధాన కేంపస్ నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేస్తారు.

రాజస్థాన్‌లో ప్రధాని

ప్రధాని జైపూర్‌లోని జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (జేఈసీసీ)లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌ను, రాజస్థాన్ గ్లోబల్ బిజినెస్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడ సభకు హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.


డిసెంబరు 9 నుంచి డిసెంబరు 11 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్‌మెంట్ సమిట్‌కు  ‘సంపూర్ణం, బాధ్యతాయుక్తం, సర్వసన్నద్ధం’ అనే విషయం ఇతివృత్తంగా ఉండబోతోంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో జల సురక్ష, గనుల తవ్వకం కార్యకలాపాలను దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే విధంగా నిర్వహించడం, అన్ని వర్గాల వారికి ప్రాముఖ్యాన్నిస్తూ పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడం, వ్యవసాయం, వ్యాపారం.. ఈ రెండు రంగాల్లోనూ నవకల్పన (ఇన్నోవేషన్)లకు పెద్దపీట వేయడం, మహిళల నాయకత్వంలో నడిచే అంకుర సంస్థలు (స్టార్ట్‌అప్స్) వంటి అంశాలపై 12 రంగాల వారీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  శిఖరాగ్ర సమావేశంలో భాగంగా 8 దేశాలకు చెందిన కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తారు. వాటిలో పాలుపంచుకొనే దేశాలు ‘నివాసయోగ్య నగరాలను దృష్టిలో పెట్టుకొని నీటి నిర్వహణ’, ‘పరిశ్రమల్లో వైవిధ్యం- తయారీ, అంతకు మించి’ అనే అంశాలతో పాటు ‘వ్యాపారం & పర్యటన’ అంశంపైన కూడా జరిగే చర్చల్లో పాల్గొంటాయి.

మూడు రోజల్లో ప్రవాసీ రాజస్థానీ కాన్‌క్లేవ్, ఎంఎస్ఎంఈ కాన్‌క్లేవ్ లను కూడా నిర్వహిస్తారు. రాజస్థాన్ గ్లోబల్ బిజినెస్ ఎక్స్‌పోలో రాజస్థాన్ పెవిలియన్, కంట్రీ పెవిలియన్లు, స్టార్ట్‌అప్ పెవిలియన్ వంటి ఇతివృత్త ప్రధాన పెవిలియన్లు ఏర్పాటు కానున్నాయి. శిఖరాగ్ర సమావేశంలో 16 భాగస్వామి దేశాలతోపాటు 20 అంతర్జాతీయ సంస్థలు సహా 32కు పైగా దేశాలు పాలుపంచుకొంటాయి.

హర్యానాలో ప్రధాని

మహిళలకు సాధికారితను కల్పించాలని, ఆర్థిక సేవలను సమాజంలో అన్ని వర్గాల చెంతకు చేర్చాలని ప్రధానమంత్రి తాను పెట్టుకొన్న నిబద్ధతకు అనుగుణంగా, ‘బీమా సఖి యోజన’ను పానీపత్‌లో ప్రారంభించనున్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అమలుచేయనున్న ఈ కార్యక్రమాన్ని 18 నుంచి 70 ఏళ్ల వయసున్న, పదో తరగతి పాసయిన మహిళలకు సాధికారితను కల్పించడానికి రూపొందించారు.

వారు ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అవగాహనతోపాటు బీమా విషయాల్లో చైతన్యాన్ని అందించే ప్రత్యేక శిక్షణను అందుకొంటారు. వారికి మొదటి మూడు సంవత్సరాల్లో స్టయిపండును కూడా ఇస్తారు.  శిక్షణ పొందిన తరువాత, వారు ఎల్ఐజీ ఏజెంట్లుగా పనిచేయవచ్చు; బీమా సఖి పట్టాను పొందినవారికి ఎల్ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతల్ని నెరవేర్చే అర్హతను పొందే అవకాశం లభిస్తుంది. రాబోయే కాలంలో ‘బీమా సఖి’లుగా అవకాశాలను అందుకొనే వారికి సర్టిఫికెట్లను ప్రధాని అందజేయనున్నారు.

ఇదే కార్యక్రమంలో, ప్రధానమంత్రి కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ ఉద్యాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రధాన కేంపస్ నిర్మాణానికి ఉద్దేశించిన శంకుస్థాపనను కూడా చేయనున్నారు. ఈ ప్రధాన కేంపస్ 495 ఎకరాలకు పైగా విస్తరించి ఉంటుంది. దీనిలో భాగంగా ప్రధాన కేంపస్‌తోపాటు ఆరు ప్రాంతీయ పరిశోధన కేంద్రాలను రూ.700 కోట్లకు పైగా ఖర్చుతో ఏర్పాటు చేస్తారు. ఈ విశ్వవిద్యాలయంలో స్నాతక, స్నాతకోత్తర (గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్) అధ్యయనాల కోసం ఏర్పాటు చేసే ఒక ఉద్యాన శాస్త్ర కళాశాలతోపాటు ఉద్యాన శాస్త్రపరమైన విషయాలను బోధించే 5 స్కూల్స్‌ను కూడా ఏర్పాటుచేస్తారు.  ఇది పంటల వివిధీకరణతోపాటు తోటల పెంపకానికి సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి పరచడానికి ప్రపంచ స్థాయి పరిశోధనలను చేపడుతూ ముందుకు సాగనుంది. 

***


(Release ID: 2082206) Visitor Counter : 38