రాష్ట్రపతి సచివాలయం
కొత్త నేర విచారణ చట్టాల్లో మూక దాడికీ, స్నాచింగ్‌కూ సంబంధించిన నిబంధనలు
Posted On:
04 DEC 2024 4:45PM by PIB Hyderabad
మూక దాడి, స్నాచింగ్.. ఈ కొత్త నేరాలు శిక్షించదగ్గ నేరాలని భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 103(2), సెక్షన్ 304లలో పేర్కొన్నారు. ఈ నేరాలను శిక్షార్హమైనవిగా సూచించడం ఇదే మొట్టమొదటి సారి. అయిదు మంది గుంపు, లేదా అంతకన్నా ఎక్కువ మంది తో కూడిన గుంపు జాతి, కులం లేదా సముదాయం, స్త్రీ పురుష బేధం, జన్మ స్థలం, భాష, వ్యక్తిగత విశ్వాసం లేదా ఇదే కోవకు చెందిన మరే ఇతర అంశాన్ని కారణంగా తీసుకొని కలిసికట్టుగా దాడికి తెగబడి ఆ క్రమంలో హత్య చేస్తే, ఆ గుంపులోని ప్రతి ఒక్కరికి మరణశిక్షగానీ లేదా యావజ్జీవ కారాగార శిక్షగానీ విధించడానికి, అంతేకాకుండా జరిమానాను సైతం విధించడానికి బీఎన్ఎస్‌లోని సెక్షన్ 103(2)లో వెసులుబాటు కల్పించారు.
బీఎన్ఎస్‌లో సెక్షన్ 304 దొంగతనం అంటే స్నాచింగ్ కూడానని చెబుతోంది. చోరీ చేయడానికి అపరాధి ఏ వ్యక్తి వద్ద నుంచైనా ఏదైనా చరాస్తిని రెప్పపాటులో, చాలా వేగంగా, బలవంతంగా లాక్కొన్నా, లేక గుంజుకొన్నా, లేక ఆ చరాస్తిని లాగేసుకొని ఆ చోటులో నుంచి పరారైనా ఈ చర్యను దొంగతనంగా ఈ నిబంధన గుర్తిస్తుంది. స్నాచింగ్‌కు పాల్పడిన ఎవరికైనా జైలు శిక్షను విధించవచ్చు; ఈ జైలు శిక్షను మూడేళ్ళ దాకా పొడిగించేందుకు కూడా వీలు ఉంటుంది. దీంతోపాటు స్నాచింగుకు పాల్పడ్డ వ్యక్తిని జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించవచ్చని ఈ సెక్షన్ చెబుతోంది.
ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2080942)
Visitor Counter : 96