సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రముఖ ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్ కు సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారం
భారతీయుల వంటి ప్రేక్షకులు ఇంకెక్కడా ఉండరు.. భారతీయ సినిమా అంతర్జాతీయ ప్రభావాన్ని ప్రముఖంగా పేర్కొన్న ఫిలిప్ నోయిస్
సినిమా భవితకు సత్యజిత్ రే తాత్వికతే ఆధారం: పరిమాణం కన్నా ప్రమాణాలకే ప్రాధాన్యం.. సినిమాలు చిన్నవైనా ఆలోచింపజేయాలి: నోయిస్
ప్రముఖ ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్ నోయిస్ కు ప్రతిష్ఠాత్మక సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారం లభించింది. చలనచిత్ర రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు గోవాలో జరుగుతున్న 54వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ (ఇఫీ) ముగింపు వేడుకలో ఈ పురస్కారాన్ని అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ ప్రేక్షకులకు ఈ దిగ్గజ దర్శకుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 1978లో ముంబైలో సినిమా చూసిన తన తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. “ఎంత అద్భుతమైన అనుభవమది! మొదటిసారి సినిమాలు చూస్తున్నానా అన్న అనుభూతి కలిగింది. భారతీయ ప్రేక్షకుల వంటి వారిని మరెక్కడా చూడలేం – సినిమాలో తామూ భాగమే అన్నట్టుగా, అందులోని భావోద్వేగాల్లో పూర్తిగా లీనమవుతారు. అలాంటి వారు మరెక్కడా ఉండరు” అని నోయిస్ ఆనందంగా చెప్పారు. ప్రతి సంవత్సరం కథాచిత్రాల నిర్మాణంలో భారత్ ముందుంటోందన్న నోయిస్.. భారతీయ సినిమా అపారమైన ప్రభావాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు.
దిగ్గజ సినీ దర్శకుడు సత్యజిత్ రేను స్మరించుకుంటూ.. “ఆస్ట్రేలియాలో పెరిగిన మా అందరికీ సత్యజిత్ రే సినిమాలు ప్రేరణగా నిలిచాయి. నా సొంత సినిమాల విషయంలో, ముఖ్యంగా పాత్రచిత్రణలో ఆయన నుంచి నేనెంతో నేర్చుకున్నాను. దేశీయ ఆస్ట్రేలియా చిత్రాల కోసం నటులు దొరకనప్పుడు నేను కూడా ఆయన లాగానే.. తమలాగా తాముండగల అలాంటి వ్యక్తులనే నటింపజేసేలా చూశాను’’ అని నోయిస్ అన్నారు .
“ఆస్ట్రేలియా సినీ ప్రపంచంలో సినీ రూపకర్తలం సత్యజిత్ రేకు రుణపడి ఉంటాం. అది పురస్కారాలకు అతీతమైనది. ఆయన ప్రభావం మాకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు.
సినిమా రంగ భవిష్యత్తును వ్యాఖ్యానిస్తూ.. చిత్ర నిర్మాణంలో అధునాతన ధోరణులపై తన ఆలోచనలను నోయిస్ పంచుకున్నారు. “మనం మరోసారి సత్యజిత్ రే సినీ తాత్వికత వైపు మరలాలి: చిన్నవైనా చాలు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటే మనం కూడా అభివృద్ధి చెందాలి. సినిమాలు చిన్నవే అయినా, ఆలోచనాత్మకత పెద్దగా ఉండాలి. సినిమా రంగ భవిష్యత్తు అలాగే ఉండబోతోందని నా విశ్వాసం” అని ఆయన స్పష్టంచేశారు.
ఇఫీ చిత్రోత్సవ డైరెక్టర్ శేఖర్ కపూర్ పై ఈ సందర్భంగా నోయిస్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ సినిమాకు ఆయన ఎనలేని సేవలందించారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా రూపకర్తలకు ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఫిలిప్ నోయిస్ ప్రముఖ ఆస్ట్రేలియా దర్శకుడు, అనేక పురస్కారాల గ్రహీత. అసాధారణమైన కథనంతోపాటు ఉత్కంఠతో కూడిన, సంస్కృతిని కళ్లకు కట్టేలా సినిమాలు తీయడంలో ఆయనది అందెవేసిన చేయి. పేట్రియాట్ గేమ్స్, క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్, సాల్ట్, ది సెయింట్, ది బోన్ కలెక్టర్, మరెన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలను నోయిస్ తెరకెక్కించారు. హారిసన్ ఫోర్డ్, నికోల్ కిడ్మన్, ఏంజెలినా జోలీ, డెంజెల్ వాషింగ్టన్, మైఖేల్ కెయిన్ వంటి ప్రముఖ నటులతో ఆయన తీసిన చిత్రాలతో సినీ రంగంపై ఆయన తనదైన ముద్ర వేశారు.
ఆస్ట్రేలియా సినిమాతోపాటు అంతర్జాతీయ సినిమాపైనా అమితమైన ప్రభావాన్ని చూపిన నోయిస్.. ఏఏసీటీఏ పురస్కారాలు, ప్రతిష్ఠాత్మక లాంగ్ ఫోర్డ్ లయెల్ జీవిత సాఫల్య పురస్కారం సహా అనేక పురస్కారాలను అందుకున్నారు. హారిసన్ ఫోర్డ్, నికోల్ కిడ్మన్, ఏంజెలినా జోలీ, డెంజెల్ వాషింగ్టన్, మైఖేల్ కెయిన్ వంటి ప్రముఖ నటులతో రూపొందించిన చిత్రాలతో సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు.
ఇఫీ నెలకొల్పిన అంతర్జాతీయ పురస్కారమైన సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని గతంలో మార్టిన్ స్కోర్సెసీ, బెర్నార్డో బెర్టోలూచి, దిలీప్ కుమార్, కార్లోస్ సౌరా, క్రిజ్టోఫ్ జానుస్సీ, వాంగ్ కార్-వై, మైఖేల్ డగ్లస్ వంటి ప్రముఖులకు అందించారు.
(Release ID: 2079288)
Visitor Counter : 31