ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్లో జరిగే డైరెక్టర్ జనరల్స్/ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సదస్సుకు హాజరు కానున్న ప్రధాని

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదం, తీరప్రాంత భద్రత తదితర కీలకమైన జాతీయ భద్రతా అంశాలపై చర్చ

పోలీసింగ్, అంతర్గత భద్రతా వ్యవహారాల్లో అవలంబించాల్సిన వృత్తిపరమైన పద్ధతులు, విధానాలపై చర్చ

Posted On: 29 NOV 2024 9:54AM by PIB Hyderabad

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు ఒడిశాలో జరిగే డైరెక్టర్ జనరల్స్/ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అఖిల భారత కాన్ఫరెన్స్ 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. భువనేశ్వర్లో ఉన్న లోక్ సేవాభవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

 

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 1 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత భద్రత, నూతన నేర చట్టాలు, మాదకద్రవ్యాలు సహా జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చలు ఉంటాయి. విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి పోలీసు పతకం ప్రదానం చేస్తారు.

 

ఈ సదస్సు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ సంబంధిత అంశాల్లో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వేచ్ఛగా చర్చించేందుకు అనువైన వేదికను పోలీసు ఉన్నతాధికారులు, భద్రతా నిర్వాహకులకు అందిస్తుంది. అంతర్గత భద్రతా సమస్యలు, నేరాల అదుపు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వృత్తిపరమైన పద్ధతులు, విధానాలను సూత్రీకరించి, వాటిని పంచుకుంటారు.

 

 

డీజీపీ కాన్ఫరెన్స్‌పై ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అంత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో జరిగే చర్చలను ప్రధానమంత్రి శ్రద్ధగా వినడంతో పాటు అనధికారికమైన, బహిరంగ చర్చల వాతావరణాన్ని ప్రోత్సహించి కొత్త ఆలోచనలు వెలికితీసే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది జరిగే ఈ కాన్ఫరెన్స్‌కు కొన్ని ప్రత్యేకతలను జోడించారు. యోగా, బిజినెస్, బ్రేక్ అవుట్ సెషన్లు, థిమాటిక్ డైనింగ్ టేబుళ్లతో ప్రారంభించి రోజంతా సమర్థంగా వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే దేశాన్ని ప్రభావితం చేసే క్లిష్టమైన పోలీసింగ్, అంతర్గత భద్రతా వ్యవహారాలపై తమ ఆలోచనలు, సూచనలను ప్రధానమంత్రితో నేరుగా పంచుకునే విలువైన అవకాశం పోలీసు ఉన్నతాధికారులకు ఈ కార్యక్రమం ద్వారా లభిస్తుంది.

 

ఏటా జరిగే పోలీసు శాఖ డీజీలు/ఐజీల సదస్సును 2014 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగేలా ప్రధానమంత్రి ప్రోత్సహిస్తున్నారు. గువాహటి (అస్సాం), రణ్ ఆఫ్ కచ్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), టేకన్పూర్ (గ్వాలియర్, మధ్యప్రదేశ్), ఏకతా విగ్రహం (కేవడియా, గుజరాత్), పుణె (మహారాష్ట్ర), లక్నో (ఉత్తర ప్రదేశ్), న్యూఢిల్లీ, జైపూర్ (రాజస్థాన్) తదితర ప్రాంతాల్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది.

 

 

కేంద్ర హోం మంత్రి, పీఎం కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, సహాయ మంత్రి (హోం వ్యవహారాలు), రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు వ్యవస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

 

***


(Release ID: 2079285) Visitor Counter : 62