సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

ఇండియన్ పనోరమా వేదికపై ప్రత్యక్షమైన ‘హనుమాన్’ సూపర్ హీరో

అర్ధవంతమైన కథలను అందించడం కేవలం లక్ష్యమే కాదు, బాధ్యత

కథల పట్ల ప్రేక్షకులకు గల అభిరుచే మన సినిమా విజయానికి దన్ను

హనుమంతుడిని పోలిన అనేక పాత్రలకు ప్రపంచవ్యాప్త ఆదరణ

ఇప్పుడు కథనాన్ని ముందుకు నడిపే అవకాశం మనదే

హనుమాన్ ను కేవలం సినిమాగా చూడలేం...ఈ చిత్రం మన సాంస్కృతిక వారసత్వానికీ, ఆచార్య వ్యవహారాలకు అందించిన గౌరవం: తేజా సజ్జా

#ఇఫీవుడ్, నవంబర్ 23, 2024

గోవా వేదికగా కొనసాగుతున్న ఇఫీ చిత్రోత్సవ ఇండియన్ పనోరమా విభాగంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన అద్భుత చిత్రం ‘హనుమాన్’ ప్రేక్షకుల మనసులను చూరగొంది. అంజనాద్రి అనే కాల్పనిక గ్రామంలో జరిగే కథలో హనుమంతు అనే దొంగకు గడ్డకట్టిన ఆంజనేయ స్వామి రక్తపు బొట్టు నుంచి దైవిక శక్తులు సిద్ధిస్తాయి. తనను తాను సూపర్ హీరోగా చెప్పుకునే మరొక పాత్రతో హనుమంతు పోరాటం ఇతివృత్తంగా కల సినిమాను పౌరాణిక అంశాలు, శౌర్యం, కష్టాలకు వెరవని మనిషి స్థైర్యం నేపథ్యంలో చిత్రీకరించారు.

భారతీయ పురాణాల్లో కీలకమైన హనుమంతుడి ప్రస్తావన గల కథను చెప్పడం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని హనుమంతు పాత్రధారి తేజ సజ్జా అన్నారు. చిన్న బడ్జెట్ పరిమితులని అధిగమించి సినిమాలోని విజువల్స్ ను సాంకేతిక బృందం భారతీయ ప్రేక్షకుల ఆకాంక్షలకు తగ్గట్టుగా రూపొందించిందని వెల్లడించారు. రమణీయ కాల్పనిక గ్రామం అంజనాద్రి దృశ్యాలను హైదరాబాద్ లో వేసిన సెట్ లో రూపొందంచడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.

మూడేళ్ల కిందట చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించినా.. దర్శకుడు ప్రశాంత్ వర్మ పట్టుదల కోల్పోకుండా చిత్రాన్ని పూర్తి చేశారని ప్రశంసించిన సజ్జా... ప్రేక్షకులకి పౌరాణికాలని పునః పరిచయం చేయడమే కాక, వాటికి మరింత విస్తృతమైన ప్రపంచ వేదికను కల్పిస్తున్నామన్నారు.

భారతీయ సంస్కృతిలో బలమైన పౌరాణిక పాత్రను పోషించే అవకాశం కలగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సజ్జా.. పురాణ పాత్రల సినిమాలతో పరిచయం ఉన్న ప్రపంచ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆస్వాదించగలరన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. హనుమాన్ ఫ్రాంచైజ్ ను విస్తరించాలన్న ఆలోచనను పంచుకున్న తేజ, రానున్న సీక్వెల్ ను మరింత భారీగా నిర్మిస్తామని చెప్పారు. తాను నటించే సినిమాల్లో మహిళా పాత్రలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని, వారి పాత్రలు కథను ముందుకు నడిపించడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు.

భారతీయ సినిమాకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉందన్న తేజ... చక్కని కథల పట్ల ప్రేక్షకులకు గల అభిరుచే ఇందుకు కారణమన్నారు. ఊపు మీదున్న తెలుగు చిత్ర పరిశ్రమ మూసకు భిన్నమైన కథలు, అద్వితీయ ప్రతిభా పాటవాలతో  ముందుకు దూసుకువెళుతోందన్నారు. ఈ ధోరణి మరింత అంతర్జాతీయ గుర్తింపు తేగలదన్న ఆశాభావాన్ని తేజ వ్యక్తం చేశారు.

పౌరాణిక పాత్రకు చోటు గల అధునాతన కథా సంవిధానంతో, పాతకొత్తల మేలుకలయికగా తెరకెక్కిన హనుమాన్ చిత్రం, దేశవిదేశాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తోంది. ఇఫీ ఇండియన్ పనోరమాకు ‘హనుమాన్’ ఎంపిక సినిమా కళాత్మక సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని చాటింది.

పాత్రికేయ సమావేశానికి మహేష్ చోపాడే సమన్వయకర్తగా వ్యవహరించారు.

పూర్తిగా విలేకరుల సమావేశాన్ని ఇక్కడ చూడచ్చు:

iffi reel

(Release ID: 2077278) Visitor Counter : 29