సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
విమర్శ నుంచి అర్థం వరకూ... సినిమాలను సమీక్షించడం ఎలా..?
ఇఫీ-2024లో కళాత్మక తూకంపై మీడియా ప్రతినిధులకు శిక్షణ
గోవాలో ఈరోజు ప్రారంభమయ్యే 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-ఇఫీ వేడుకల నేపథ్యంలో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విభాగం ‘పత్రికా సమాచార కార్యాలయం’ (పిఐబి), పూణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీటీఐ) సంయుక్త భాగస్వామ్యంలో నిన్న మీడియా ప్రతినిధుల కోసం ఆసక్తికరమైన సదస్సు ఏర్పాటయ్యింది. ‘రివ్యూయింగ్ ఫిలిమ్స్, ఫ్రమ్ క్రిటికింగ్ టు రీడింగ్ సినిమా’ పేరిట ఏర్పాటైన ఈ సదస్సును ఇఫీ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సినిమా కళకు చెందిన వివిధ అంశాల పట్ల అవగాహన పెంపు, సినిమాను సంపూర్ణంగా అవగాహన చేసుకుని అందులోని అనుభూతిని, లోటుపాట్లను గ్రహించడం ఎందుకు ముఖ్యమో కోర్సు తెలియజెప్పింది. ఎఫ్టిటిఐకు చెందిన మాలినీ దేశాయ్, డాక్టర్ ఇంద్రనీల్ భట్టాచార్య, ప్రొఫెసర్ అమ్లాన్ చక్రవర్తి వంటి సినీ పరిశ్రమ ప్రముఖులు కోర్సుకి నేతృత్వం వహించారు.
‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఫిల్మ్ అనాలసిస్’ ప్రసంగం ద్వారా సినిమా విమర్శలో పాటించవలసిన సూత్రాలను ప్రొఫెసర్ డాక్టర్ ఇంద్రనీల్ భట్టాచార్య ప్రతినిధులకు పరిచయం చేశారు. ‘ఎడిటింగ్ యాజ్ ఎన్ ఆర్టిస్టిక్ టూల్’ అన్న అంశంపై ప్రసంగించిన ప్రొఫెసర్ అమ్లాన్ చక్రవర్తి, సినిమా నిర్మాణంలో ‘కూర్పు’ కళాత్మక సాధనంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ‘లైటింగ్ యాజ్ ఎ డ్రమాటిక్ టూల్’ అనే ఆసక్తికర ప్రసంగంలో ప్రొఫెసర్ మాలినీ దేశాయ్ ఛాయాగ్రహణంలో భాగమైన లైటింగ్ (వెలుగు నీడల కూర్పు) ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు.
‘‘సినిమాలోని కళాత్మకతను అంచనా వేయడం అంటే సినిమాని ఆరాధించడమే కాదు..అది అర్థం చేసుకోవడానికి సంబంధించినది. ప్రతి సినిమానీ ప్రేక్షకుడిని మెప్పించడం కోసమే తీస్తారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే జీవితాంతం మీతో ఉంటాయి. అలా ఎందుకన్నది తెలుసుకోవాల్సింది మీరే’’ అని ప్రొఫెసర్ అమ్లాన్ చక్రవర్తి విశ్లేషించారు. 2025 ఆస్కార్ పోటీలకు అధికారికంగా వెళ్లిన ‘‘లాపతా లేడీస్’’ సినిమాను ఉదాహరణగా తీసుకుని, సినిమాలో అంతర్లీనంగా దాగివుండే సామాజిక దృక్కోణాల గురించి విశ్లేషించారు. లఘుచిత్రాల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, కథా సంవిధానాన్ని తెలియజేసే విభిన్న పద్ధతుల గురించీ ప్రొఫెసర్ భట్టాచార్య వివరించారు.
ఇఫీలో పాల్గొంటున్న పాత్రికేయులకు ఎన్నెఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతుల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ప్రచారంలో మీడియా భాగ్యస్వామ్యం ఎంతో ముఖ్యమైందనీ, ఫిలిమ్ అప్రీసియేషన్ కోర్స్ సినిమాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకూ, సినిమా గురించి చక్కని అవగాహనతో విమర్శనాత్మకంగా రాసేందుకు దోహదపడుతుందనీ చెప్పారు.
అనంతరం సమాచార ప్రసార శాఖ పశ్చిమ జోన్ డైరెక్టర్ జనరల్ స్మితా వత్స్ శర్మ ప్రసంగిస్తూ.... ఈ సదస్సు గోవా ప్రతినిధులకు మాత్రమే పరిమితం కాదని, అఖిల భారత మీడియా ప్రతినిధులందరూ ఆహ్వానితులేనని చెప్పారు. మన సినిమాల గురించి సినీ పాత్రికేయులు దేశంలోనే కాక విదేశాల్లో సైతం ప్రచారాన్ని సమర్ధంగా నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ, వారి అవగాహనను మరింత పెంపొందించేందుకు ఇఫీ ఈ కోర్సును పరిచయం చేసిందన్నారు. సదస్సును ఏర్పాటు చేయడంలో సహకరించిన ఎఫ్టిటిఏకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
పిఐబి ముంబయి శాఖ జాయింట్ డైరెక్టర్ సయ్యద్ రబీహాష్మీ మాట్లాడుతూ.... సినిమాలను కేవలం వేడుక చేసుకోవడమే కాకుండా వాటిలోని సూక్ష్మమైన అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రొఫెసర్ మాలినీ దేశాయ్ సదస్సు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, సినిమాలకు సంబంధించిన చర్చ సహా కళాత్మక మాధ్యమంగా సినిమా ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో మీడియా పోషిస్తున్న పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. “దర్శకులుగా మేం సినిమా ద్వారా ప్రేక్షకులకు మా దృష్టి కోణాన్ని చేరవేస్తుంటే, పాత్రికేయులు దానిని మీడియా ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నారు. భిన్నమైన మాధ్యమాలకు చెందిన వీరిరువురి మధ్య ఏర్పాటైన ఈ సదస్సు ఇరువర్గాల వారి దృష్టి కోణాలను సుసంపన్నం చేస్తోంది” అని మాలినీ దేశాయ్ అన్నారు.
“సినీ జర్నలిస్టుల అవగాహనను పెంపొందించేందుకు మంత్రిత్వశాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ఆకాంక్షిస్తున్నాను” అని స్క్రీన్ గ్రాఫియా’ మీడియా ప్రతినిధి హర్షిత వ్యాఖ్యానించారు. 1999 నుంచి ఆమె ఇఫీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా ఇఫీలో పాల్గొంటున్న సీనియర్ జర్నలిస్టు సత్యేంద్ర మోహన్ మాట్లాడుతూ.... “1983 నుంచి ఇఫీలో పాల్గొంటున్నాను. నేటి సదస్సు ఎంతో ఆసక్తికరంగా కొనసాగి విలువైన సమాచారాన్ని అందించింది. సినిమాలని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో జర్నలిస్టులకు ఈ సదస్సు ఉపకరిస్తుంది. 55వ ఇఫీ స్థాయిని పెంచిన కార్యక్రమమిది” అన్నారు.
ముగింపు సమావేశంలో 30కి పైగా మీడియా ప్రతినిధులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
***
(Release ID: 2075130)
Visitor Counter : 14
Read this release in:
Punjabi
,
Assamese
,
Tamil
,
English
,
Marathi
,
Urdu
,
Hindi
,
Konkani
,
Bengali-TR
,
Gujarati
,
Kannada
,
Malayalam