సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 2

ఇఫీ 2024 సంబరాలు ఇక షురూ – పాత్రికేయ సమావేశం


గోవా సంస్కృతి, సినిమా అనుభూతులను పంచే వేడుక: ఇఫీ 2024 వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్

స్కై లాంతర్లతో గోవా ఆకాశంలో వెలుగుజిలుగులు: ప్రమోద్ సావంత్

‘యువ చిత్ర దర్శకులు – భవిష్యత్తు ఇప్పుడే’ అంశంపై ప్రధాన దృష్టి సారించిన ఇఫీ 2024
19 అంతర్జాతీయ ప్రీమియర్లు, 43 ఆసియా ప్రీమియర్లు, 109 ఇండియన్ ప్రీమియర్లు

ఉత్తమ భారతీయ డెబ్యూ డైరెక్టర్ పురస్కారం: దేశంలో యువ దర్శకులకు ప్రతిభను గుర్తించనున్న ఇఫీ
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో వేదిక ద్వారా 100 మంది ఔత్సాహిక యువదర్శకులకు తోడ్పాటు

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు (ఇఫీ) ఈ నెల 20 నుంచి 28 వరకు ప్రకృతి అందాల నడుమ గోవాలో జరుగుతాయి. ఈ ఏడాది నిర్వహిస్తున్నఈ వేడుక సినిమాల ఆడంబరం, విభిన్నమైన కథనాలు, వినూత్న స్వరాలకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే పరస్పర సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహిస్తుంది.

 

ఇఫీ ఉత్సవాలు ప్రారంభమవడానికి ముందుగా ఈ రోజు గోవాలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మాట్లాడారు. ఇఫీ 55వ ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడానికి, అంగరంగ వైభవంగా జరిగే ఈ సినీ వేడుకలకు హాజరయ్యే ప్రతినిధులను  స్వాగతించడానికి గోవా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో 81 దేశాలకు చెందిన 180 అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలు జరిగే వేదికల వద్దకు  చేరుకోవడానికి వీలుగా ఉచిత రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రతిభ, సంస్కృతిని చాటిచెప్పే 14 గోవా చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారని శ్రీ సావంత్ తెలిపారు. ఇఫీ పరేడ్ మార్గంలో 'స్కై లాంతర్' పోటీలు నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనేవారికి నగదు బహుమతులు అందిస్తారు. ఈ నెల 22న ఈఎస్‌జీ కార్యాలయం నుంచి కళా అకాడమీ వరకు ఇఫీ పరేడ్ నిర్వహిస్తున్నట్లు శ్రీ సావంత్ తెలిపారు.

 

గోవాలోని ఎంటర్టైన్‌మెంట్ సొసైటీ వైస్ ఛైర్మన్ శ్రీమతి డెలియాలా లోబో మీడియాతో మాట్లాడుతూ, ఈ వేడుకలను పర్యావరణ హితంగా, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో  ఉండేలా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

 

ఈ ఏడాది 6,500 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని, గతేడాదితో పోలిస్తే ఇది 25 శాతం పెరిగిందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథుల్ కుమార్ తెలిపారు. సినిమా ప్రేమికులకు ఈ పండగను మరింత చేరువ చేసేందుకు ఈ ఏడాది 6 స్క్రీన్లు అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే స్క్రీనింగ్ థియేటర్లను 45 శాతం పెంచారు. ఈ ఉత్సవంలో సినీ ప్రముఖులు పాల్గొంటారని శ్రీ కుమార్ తెలిపారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ నాయకత్వంలో ఈ ఉత్సవాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని, వారికి అందించే నాణ్యమైన అనుభవాలను కొత్త శిఖరాలకు చేర్చేలా ఎన్ఎఫ్‌డీసీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని శ్రీ కుమార్ పేర్కొన్నారు. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఉత్సవాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సమర్థ మార్గదర్శకత్వంలో ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటూ, పనులు సకాలంలో పూర్తి చేసి సినీ ప్రేమికులు అందరినీ ఒకచోట చేర్చడానికి పండుగ ప్రయత్నిస్తుంది.

పాత్రికేయులకు సినీ రంగానికి సంబంధించిన అన్ని విభాగాలతో పాటు సినిమా వ్యాపారాంశాలపై లోతైన అవగాహన పెంపొందించేలా ప్రెస్ టూర్ నిర్వహించనున్నట్టు శ్రీ కుమార్ తెలియజేశారు.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమత్రి వృందా దేశాయ్,  పీఐబీ డైరెక్టర్ జనరల్ స్మితా వత్స్ శర్మ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, పీఐబీ, ఈఎస్‌జీకి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సమావేశంలో ఇఫీ 2024లో నిర్వహించే ప్రధాన కార్యక్రమాలను మీడియాకు వివరించారు. అవి:

·         యువ చిత్ర దర్శకులపై దృష్టి సారించిన ఇఫీకి ఈ ఏడాది సీఎంవోటీ విభాగం ద్వారా రికార్డు స్థాయిలో 1032 ఎంట్రీలు వచ్చాయి. గతేడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్య 550.

·         సమాచార, ప్రసార శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో ఇఫీ 2024 యువ దర్శకులపై దృష్టి సారిస్తుంది. "క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో" కార్యక్రమం 100 మంది యువ ప్రతిభావంతులకు (మునుపటి ఎడిషన్‌లో 75 మంది మాత్రమే పాల్గొన్నారు) తోడ్పాటు అందించేలా విస్తరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన యువ సినీ విద్యార్థులను ఆహ్వానించారు.

·         దేశంలో వెలుగులోకకి వస్తున్న యువ చిత్ర దర్శకుల ప్రతిభను గుర్తించేందుకు మొదటి సారిగా నూతన పురస్కార విభాగాన్ని పరిచయం చేశారు. అదే ఉత్తమ భారతీయ డెబ్యూ డైరెక్టర్. యువ దర్శకులకు ప్రత్యేక శిక్షణా తరగతులు, చర్చా వేదికలు, సినిమా స్క్రీనింగులను ఏర్పాటు చేశారు. ఎంటర్‌టైన్మెంట్ జోన్ ఇఫీయెస్టాలో సంగీతం, నృత్యం ఇతర సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా యువత భాగస్వామ్యాన్ని పెంచుతారు.

·         ఇఫీ 2024కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 101 దేశాల నుంచి  1,676 దరఖాస్తులు వచ్చాయి. అంతర్జాతీయంగా ఇఫీకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం. ఈ వేడుకల్లో 16 గ్లోబల్ ప్రీమియర్లు, 3 అంతర్జాతీయ ప్రీమియర్లు, 43 ఆసియా ప్రీమియర్లు, 109 ఇండియన్ ప్రీమియర్లతో సహా 81 దేశాలకు చెందిన 180 చలనచిత్రాలను ప్రదర్శిస్తారు. అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన సినిమాలు, అవార్డులు గెలుచుకున్న చిత్రాల ప్రదర్శనతో ఈ ఏడాది ఉత్సవాలు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి.

·         ఈ చిత్రోత్సవాల్లో ఆస్ట్రేలియా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. స్క్రీన్ ఆస్ట్రేలియా, ఎన్ఎఫ్‌డీసీ మధ్య జరిగిన ఒప్పందం ద్వారా ప్రత్యేకంగా చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇది రెండు దేశాల మధ్య మైత్రిని పెంపొందిస్తుంది. మైఖేల్ గ్రేసీ రూపొందించిన ఆస్ట్రేలియన్ చిత్రం బెటర్ మ్యాన్‌తో ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఈ చిత్రం, దిగ్గజ బ్రిటీష్ పాప్‌స్టార్ రాబీ విలియమ్స్ జీవిత విశేషాలతో తెరకెక్కింది.

·          సత్యజిత్ రే జీవన సాఫల్య పురస్కారాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ దర్శకుడు 'ఫిలిప్ నోయ్స్'కి అందజేస్తారు. ఆయన  అసాధారణమైన కథనం, ఉత్కంఠభరితమైన, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచారు. నోయిస్ తెరకెక్కించిన చిత్రాల్లో పేట్రియాట్ గేమ్స్, క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్, సాల్ట్, ది సెయింట్, ది బోన్ కలెక్టర్ తదితర ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలున్నాయి. హారిసన్ ఫోర్డ్, నికోల్ కిడ్‌మాన్, ఏంజెలీనా జోలీ, డెన్జెల్ వాషింగ్టన్, మైఖేల్ కెయిన్ లాంటి ప్రముఖ నటులతో చిత్రాలను తెరకెక్కించి వెండితెరపై చెరగని ముద్ర వేశారు.

·         అంతర్జాతీయ విభాగంలో 15 చలనచిత్రాలు (12 అంతర్జాతీయ, 3 భారతీయ చిత్రాలు) పోటీపడతాయి. గెలుపొందిన చిత్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ చలనచిత్ర పురస్కారం గోల్డెన్ పీకాక్‌తో పాటు 40 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, స్పెషల్ జ్యూరీ విభాగంలో విజేతలను జ్యూరీ నిర్ణయిస్తుంది.

·         ఉత్తమ ఫీచర్ చిత్రం డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ కేటగిరీలో, 5 అంతర్జాతీయ, 2 భారతీయ సినిమాలు పోటీ పడతాయి. విజేతకు సిల్వర్ పీకాక్, రూ 10 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తారు.

·          అంతర్జాతీయ జ్యూరీకి ప్రఖ్యాత భారతీయ చిత్ర దర్శకుడు శ్రీ అశుతోష్ గోవారికర్ (ఛైర్‌పర్సన్) నేతృత్వం వహిస్తారు. ప్రసిద్ధ సింగపూర్ రచయిత, దర్శకుడు, నిర్మాత ఎలిజబెత్ కార్ల్సన్, బ్రిటన్ నిర్మాత ఫ్రాన్ బోర్జియా, ఆసియాలో ప్రముఖ నిర్మాత ఆంథోనీ చెన్ ఈ జ్యూరీలో ఉంటారు.

·         భారతీయ పనోరమా విభాగంలో దేశ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని తెలియజేసే 25 ఫీచర్ చిత్రాలు, 20 నాన్-ఫీచర్ సినిమాలను ప్రదర్శిస్తారు. ఫీచర్ విభాగంలో రణదీప్ హుడా దర్శకత్వం వహించిన స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), నాన్ ఫీచర్ విభాగంలో ఘర్ జైసా కుచ్ (లద్ధాఖీ)తో ఈ ప్రదర్శనలు ప్రారంభమవుతాయి.

·         ఈ ఏడాది ఇఫీ ఇతివృత్తం ‘యువ దర్శకులు’ ఆధారంగా వెలుగులోకి వస్తున్న దర్శకుల ప్రతిభను గుర్తించడానికి నూతన పురస్కార విభాగం ‘ఉత్తమ భారతీయ డెబ్యూ డైరెక్టర్’ను ప్రారంభించారు. ఈ విభాగంలో మొత్తం 102 చిత్రాల నుంచి ఎంపిక చేసిన 5 చిత్రాలు పోటీపడతాయి. విజేతకు వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

·         ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డుకు గతేడాది 32 ఎంట్రీలు వస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్య 42కు పెరిగింది. పురస్కారం గెలుచుకున్న సిరీస్‌కు ప్రశంసాపత్రం, రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. విజేతను ముగింపు వేడుకల్లో ప్రకటిస్తారు.

·         శతాబ్ది ఉత్సవాలు: ఇఫీ 2024 ఉత్సవాల్లో రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు లాంటి భారతీయ సినీ దిగ్గజాలకు నివాళిగా ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభ, ముగింపు వేడుకల్లో ప్రదర్శిస్తారు. అలాగే ఇఫీయెస్టాలో ఇమర్సివ్ ఎగ్జిబిషన్లు, ఇండియా పోస్ట్ ద్వారా స్మారక స్టాంపుల సిరీస్ ను విడుదల చేస్తారు. ఈ దిగ్గజాలు ఒక్కొక్కరికీ చెందిన ఒక్కో క్లాసిక్ చిత్రాన్ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిలిం హెరిటేజ్ మిషన్ (ఎన్‌హెచ్ఎఫ్ఎం) ద్వారా ఎన్ఎఫ్‌డీసీ, ఎన్ఎఫ్ఏఐ పునరుద్దరించాయి. రాజ్ కపూర్ ఆవారా, అక్కినేని నాగేశ్వర రావు దేవదాసు(1953), మహ్మద్ రఫీ హమ్ దోనో, తపన్ సిన్హా హర్మోనియంలను ఇఫీలో ప్రదర్శిస్తారు.

·         రైజింగ్ స్టార్స్ (నూతన దర్శకుల ప్రతిభను ప్రోత్సహించడం), మిషన్ లైఫ్ (పర్యావరణ స్పృహను పెంచే సినిమాలకు ప్రాధాన్యం), ఆస్ట్రేలియా: ప్రధాన ఆకర్షణగా నిలవనున్న దేశం, ఒప్పంద దేశ ప్యాకేజీ పేరుతో నాలుగు కొత్త అంతర్జాతీయ ప్రోగ్రామింగ్ విభాగాలతో పాటు బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంపిక చేసిన చిత్రాలు ప్రదర్శిస్తారు.

·         వైవిధ్యం, సమ్మిళిత భావాన్ని ప్రోత్సహించేందుకు మహిళలు దర్శకత్వం వహించిన 47 చలనచిత్రాలతో పాటు యువమహిళా దర్శకులు తెరకెక్కించిన 66 డెబ్యూ సినిమాలను సైతం ప్రదర్శిస్తారు. ఇది ఈ రంగంలో ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న వారి వాణిని విస్తరించే దిశగా ఉత్సవాలకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ‘సినిమాల్లో మహిళలు’ విభాగం వెలుగులోకి వస్తున్న మహిళా దర్శకుల ప్రతిభను చాటిచెబుతుంది.

·         ఈ ఏడాది అదనంగా ఆరు థియేటర్లలో స్క్రీనింగులు ఏర్పాటు చేస్తారు. అందులో ఐనాక్స్ మడ్‌గోవాకు చెందిన నాలుగు థియేటర్లు, ఐనాక్స్ పొండాకు చెందిన 2 థియేటర్లు ఉన్నాయి. చలన చిత్రోత్సవాల్లో 270 చిత్రాలను ఐదు వేదికల్లో ప్రదర్శిస్తారు. ఐనాక్స్ పాంజిమ్ (4), మాక్వినెజ్ ప్యాలెస్ (1), ఐనాక్స్ పోర్వోరిమ్ (4), ఐనాక్స్ మడ్‌గోవా(4), ఐనాక్స్ పొండా(2), జెడ్ స్క్వేర్ సామ్రాట్ అశోక్ (2) ఇవి కాకుండా అదనంగా మరో 5 ఇన్ఫ్లేటబుల్ థియేటర్ను ఏర్పాటు చేశారు.

·         సీఎంవోటీ కార్యక్రమానికి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1,032 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య 2023తో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఈ కార్యక్రమం 13 సినిమా విభాగాల్లో యువ ప్రతిభను ప్రోత్సహిస్తుంది. అలాగే మొదటిసారిగా 100 మంది ఔత్సాహిక చిత్ర దర్శకులను  ఎంపిక చేసి వారి ప్రతిభను మెరుగులద్దుకునేందుకు వేదిక కల్పిస్తారు.

·         ప్రత్యేక శిక్షణా తరగగతులు, చర్చా కార్యక్రమాలు, పరిశ్రమతో మమేకం: ఔత్సాహిక చిత్ర దర్శకులకు కళా అకాడమీలో ఏఆర్ రెహమాన్, ప్రసూన్ జోషి, షబానా అజ్మీ, మణిరత్నం, విధు వినోద్ చోప్రా, ఇతర అంతర్జాతీయ సినీ నిపుణుల నేతృత్వంలోని 25 కంటే ఎక్కువ శిక్షణ కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఫిలిప్ నోయ్స్, జాన్ సీల్ లాంటి దిగ్గజాలు సౌండ్ డిజైన్‌, డిజిటల్ యుగంలో నటన, చిత్ర నిర్మాణ భవిష్యత్తు గురించి కూలంకషంగా చర్చిస్తారు.

·         ఫిల్మ్ బజార్ 2024: దక్షిణాసియాలో అతిపెద్ద సినిమా మార్కెట్:  18వ ఫిలిం బజార్ ను గతంలో కంటే ఎక్కువగా విస్తరించారు. సినిమా రంగంలో వివిధ జోనర్లకు చెందిన 350 కంటే ఎక్కువ చిత్రాలను ప్రదర్శిస్తారు. ఫిలిం బజార్ సలహాదారుగా  'మార్చ్ డె కేన్స్'  మాజీ మార్కెట్ హెడ్‌ శ్రీ జెరోమ్ పిల్లర్డ్ ఫిల్మ్ బాధ్యతలు స్వీకరించారు. చలనచిత్ర నిర్మాణం, పంపిణీ, అంతర్జాతీయ భాగస్వామ్యంపై అవగాహన పెంచేలా వర్క్ షాపులు నిర్వహిస్తారు. 2007లో ప్రారంభమైన నాటి నుంచి దక్షిణాసియాలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన సినిమా మార్కెట్‌గా ఫిలిం బజార్ మారింది. ఈ ఏడాది సముద్ర తీరంలో పెవిలియన్లు, ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేస్తారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన చిత్ర పరిశ్రమ, టెక్ అండ్ వీఎఫ్ఎక్స్ పరిశ్రమ నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. చిత్ర పరిశ్రమను మరింత మెరుగుపరచడానికి ఫిక్కీ సహకారంతో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఫిల్మ్ బజార్‌లో ‘బయ్యర్స్-సెల్లర్స్’  మీట్ నిర్వహిస్తారు. దీనికి అందరూ ఆహ్వానితులే. ఇక్కడ చిత్ర దర్శకులు, ఇతర నిపుణులను కలుసుకోవచ్చు.

·          ‘ఇఫీయెస్టా’ సాంస్కృతిక ఉత్సవాలతో గొప్ప అనుభూతి: ఇఫీ 2024లో మొదటి సారిగా ఏర్పాటు చేసిన ఇఫీయెస్టా సినిమా, సంగీతం, నృత్యం, ఆహారం, కళ, అనుభవాల మాయాజాలం ద్వారా సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించేలా ఈ వినోద మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. దీనిని డిస్ట్రిక్ట్ బై  జొమాటో నిర్వహిస్తుంది. ప్రత్యక్ష ప్రదర్శనలు, ఆహారం, సరదా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వేదికే ఇఫీయెస్టా. కళా అకాడమీ, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు యువతను ఆకర్షించేలా ఉంటాయి. వీటిలో భారతీయ సినిమా ప్రయాణంపై ఎగ్జిబిషన్‌తో పాటు మంత్రముగ్ఢులను చేసే 4 శతాబ్ది ఉత్సవాల చిత్రాల ప్రదర్శన ఉంటుంది. నవంబర్ 22నఇఫీయోస్టాలో 'జర్నీ ఆఫ్ ఇండియన్ సినిమా' కార్నివాల్ పరేడ్ నిర్వహిస్తారు.

·         ప్రజలను మమేకం చేసేలా వేడుకల నిర్వహణ: ఇఫీ వేడుకల చరిత్రలోనే తొలిసారిగా, 55వ ఇఫీ ఉత్సవాలు ప్రజలందరికీ చేరువలో ఉంటాయి. ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొనేందుకు ప్రత్యకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దివ్యాంగులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ‘స్వయం’ అనే సంస్థను భాగస్వామిగా ఇఫీ ప్రకటించింది. ఇఫీ 2024 వేడుకలు జరిగే అన్ని వేదికలు వారికి అనువుగా తయారుచేయడంతో పాటు ప్రత్యేకావసరాలు కలిగిన వారి గురించి వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. తద్వారా దివ్యాంగులను ఈ వేడుకల్లో భాగస్వాములను చేసేందుకు ఇఫీ కట్టుబడి ఉంది. ఇఫీలో ప్రదర్శించే చలనచిత్రాలు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఆడియో, సంకేత భాషలో వివరించేందుకు మొబైల్ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. ప్రధానమంత్రి సూచించిన ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ స్ఫూర్తిని పెంపొందించేలా అందరినీ మమేకం చేసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఎన్ఎఫ్‌డీసీ ఎండీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో గురించి మరిన్ని వివరాలకు:

iffi reel

(Release ID: 2074949) Visitor Counter : 9