ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

Posted On: 19 NOV 2024 6:08AM by PIB Hyderabad

బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ అన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ మోంటెనెగ్రో అభినందనలు తెలియజేశారు.

 

వ్యాపారం, పెట్టుబడి, రక్షణ, సైన్స్, టెక్నాలజీ, పర్యటన రంగం, సాంస్కృతిక రంగం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా  వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని గురించి నేతలు చర్చించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ రంగ సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, అంకుర సంస్థలు (స్టార్ట్-అప్స్) నూతన ఆవిష్కరణలు (ఇన్నొవేషన్), ఇరు దేశాల మధ్య వృత్తినిపుణుల,  నైపుణ్యం గల కార్మికుల రాక పోకలు, తదితర నూతన రంగాలతో పాటు కొత్తగా ఉనికిలోకి వస్తున్న రంగాల్లో సహకరించుకొనే అవకాశాలు అంతకంతకు విస్తరిస్తున్నాయని నేతలు గమనించారు. భారతదేశం-యూరోపియన్ యూనియన్ సంబంధాలతో పాటు ప్రాంతీయ సమస్యలపైనా, ఇరు దేశాల ప్రయోజనం ముడిపడిన ప్రపంచ సమస్యలపైనా నేతలిద్దరూ తమ ఆలోచనలను పరస్పరం పంచుకున్నారు. ప్రాంతీయ వేదికలలోనూ, బహు పాక్షిక వేదికలలోనూ ఇప్పుడు కొనసాగిస్తున్న సన్నిహిత సహకారాన్ని ఇక మీదటా కొనసాగించాలని వారు అంగీకరించారు.

భారతదేశం - పోర్చుగల్ దౌత్య సంబంధాలు వచ్చే ఏడాదిలో 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాయన్న విషయాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భాన్ని సముచిత రీతిలో ఒక ఉత్సవంగా జరుపుకోవాలని వారు సమ్మతించారు. పరస్పర సంప్రదింపులను కొనసాగించాలని వారు అంగీకరించారు.

 

***

MJPS/SR


(Release ID: 2074650) Visitor Counter : 20