ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

Posted On: 19 NOV 2024 8:34AM by PIB Hyderabad

రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన  జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.

పూలీయా చర్చలకు కొనసాగింపుగా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ఇందుకు అనుగుణంగా, రానున్న అయిదేళ్ళకు సంబంధించి ‘2025-29 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ’ను ప్రకటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతికతలు, హరిత ఇంధనం, అంతరిక్షం, రక్షణ, అనుసంధాన వ్యవస్థలు, అత్యాధునిక సాంకేతికతల వంటి కీలక రంగాలే కాక, ఇరుదేశాల పౌరుల మధ్య స్నేహ సంబంధాలను మెరుగు పరిచేందుకు అవసరమైన ఉమ్మడి సహకారం, కార్యక్రమాలు, పథకాలను ఈ కార్యాచరణ అమల్లో పెడుతుంది.

వివిధ రంగాలకు సంబంధించి మంత్రుల స్థాయి, అధికారుల స్థాయి సమావేశాలు ఏర్పాటవుతాయి. ఉమ్మడి-ఉత్పత్తి, పరిశ్రమలూ సంస్థల మధ్య సహకారం, ఇరుదేశాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసి, ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలూ ప్రజలకు లాభాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నారు.

ప్రజాస్వామ్య విలువలు, న్యాయం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్ల ఇరుదేశాలకు గల  నిబద్ధత దృష్ట్యా వివిధ ప్రపంచ వేదికలు, బహుళపక్ష వేదికలపై కలిసి పనిచేయాలని, చర్చలు కొనసాగించాలని ఇరువురు దేశనాయకులూ నిర్ణయించారు. గ్లోబల్ బయో ఫ్యుయల్స్ అలయన్స్(ప్రపంచ జీవ ఇంధన సహకార వేదిక), భారత- తూర్పు ఐరోపా ఆర్ధిక కారిడార్ వంటి సంస్థలను ప్రారంభించిన ఇరుదేశాలూ, బహుళపక్ష వ్యూహాత్మక పథకాల అమలు దిశగా కృషిని కొనసాగించాలని నిర్ణయించాయి.

 

***


(Release ID: 2074615) Visitor Counter : 21