సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఉత్తమ వెబ్ సిరీస్ పురస్కారం: సినిమా అభివృద్ధి యాత్ర యాదిలో ఐఎఫ్ఎఫ్ఐ చేస్తున్న ఓ ప్రయత్నమిది
ఐఎఫ్ఎఫ్ఐ 2024లో పురస్కారానికి పోటీ పడుతున్న అయిదు వెబ్ సిరీస్ లు
ఐఎఫ్ఎఫ్ఐ 2024లో ప్రత్యేక ఆకర్షణ కానున్న ఓవర్- ది- టాప్ (ఓటీటీ) విప్లవం
వినోద పరిశ్రమ అభివృద్ధి యాత్రను స్మరించుకొంటూ, సినిమా రంగంలో చోటుచేసుకొంటున్న శ్రేష్ఠత్వాన్ని పండుగ చేసుకొనే సంప్రదాయాన్ని భారత 55వ అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇండియా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ –‘ఐఎఫ్ఎఫ్ఐ’) మునుముందుకు తీసుకుపోతోంది. డిజిటల్ కంటెంట్ లో వర్ధిల్లుతున్న సృజనాత్మకతను సత్కరిస్తూ అత్యుత్తమ వెబ్ సిరీస్ (ఓవర్ - ది - టాప్.. ‘ఓటీటీ’) పురస్కారాన్ని ఐఎఫ్ఎఫ్ఐ 54వ సంచికలోనే మొదలుపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫారాల్లో కథను చెప్పడంలో అత్యుత్తమంగా నిలిచిన వారిని గౌరవించే సన్నివేశానికి ప్రతీకే ఈ పురస్కారం.
ఈ పురస్కార విభాగం ఈ సంవత్సరం మరింతగా జోరందుకొంటోంది; 10 ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫారాలలో ఆవిష్కృతమైన వెబ్ సిరీస్ లలో 40 శాతానికి పైగా వృద్ధి నమోదు అవడమే కాకుండా, ఆ వెబ్ సిరీస్ లను ఆదరిస్తున్న ప్రేక్షకవర్గాలు రోజు రోజుకూ అధికం అవుతున్నారు. ఈ సరళి భారతీయ వినోద పరిశ్రమలో వెబ్-ఆధారిత కంటెంట్ కు పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది. ఈ ఏడాది 5 వెబ్ సిరీస్ లను వాటి కళాత్మక ప్రతిభ, కథను చెప్పిన తీరు, సాంకేతిక శ్రేష్ఠత్వం, ప్రసరించిన సాంస్కృతిక ప్రభావాలకు గాను ఎంపిక చేశారు. ఆ 5 వెబ్ సిరీస్ లు ఏవేవంటే:
- కోటా ఫ్యాక్టరీ: ఇది వాస్తవిక జీవనంలోని ఒక భాగాన్ని కళ్లకు కడుతుంది. దీనిలో, రాజస్థాన్ లోని కోటా అనే నగరంలో అత్యధిక ఒత్తిడితో కూడిన కోచింగ్ వాతావరణాన్ని ఆవిష్కరించారు. కోటా భారతదేశంలో పోటీ పరీక్షలకు ఒక కూడలి (హబ్)గా ప్రసిద్ధికెక్కింది. ఈ వెబ్ సిరీస్ విద్యకు సంబంధించిన సవాళ్లతో సతమతం అవుతున్న విద్యార్థుల సంఘర్షణను, ఆకాంక్షలను, పుంజుకొనే శక్తిని మనసుకు హత్తుకొనే తీరున చిత్రీకరించింది.
o క్రియేటెడ్ బై: సౌరభ్ ఖన్నా
o ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్
- కాలాపానీ: ప్రకృతి శోభతో అలరారే అండమాన్ దీవుల్లో చిత్రీకరించిన ఈ అత్యంత రోమాంచిత వెబ్ సిరీస్, ప్రేక్షకవర్గాలను తన వైపునకు తిప్పేసుకొంటుంది. కుటుంబం, చరిత్ర, వ్యక్తిగత వెతుకులాట.. ఈ అంశాలను ఒకదానితో మరొక దానిని పరస్పరం పెనవేస్తూ, భావావేశభరిత గాఢతను రేకెత్తించడంతో పాటు సమ్మోహన భరిత కథాసంవిధానాన్ని కళ్లెదుట నిలిపి చూపరులపైన ఎంతో ప్రభావవంతమైన ముద్రను వేస్తుంది.
o క్రియేటెడ్ బై: సమీర్ సక్సేనా
o ఓటీటీ ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్
- లంపన్: భారతదేశంలో పల్లెపట్టుల్లో సాగే గుండెను తాకే కథనాన్ని ఈ వెబ్ సిరీస్ వివరిస్తుంది. ఓ చిన్న పిల్లవాడికి సమాజంలో ఎదురైన సవాళ్లు, అప్పుడు ఆ బాలుడిలో కలిగే భావోద్వేగాలు ఈ వెబ్ సిరీస్ కు ప్రధాన ఇతివృత్తం. సముదాయం, అస్తిత్వం, స్వీయ-సాధికారిత లాంటి విషయాలున్న సజీవ గాథను కళ్లెదుట నిలుపుతుంది లంపన్.
o క్రియేటెడ్ బై: నిపుణ్ ధర్మాధికారి
o ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్: సోనీ లివ్ (Sony Liv)
4. అయాలీ: సామాజిక స్పృహను కలిగి ఉన్న నాటకం ఇది. మార్పునకు అంగీకరించని సమాజంలో మహిళల జీవన స్థితిగతుల లోతుపాతులను శోధించి మరీ ప్రేక్షక లోకం ముందుకు తీసుకువస్తుంది. ఓ శక్తిమంతమైన కథను వినిపించే మాధ్యమం అండతో, ఇది సంప్రదాయం, సమాజం పెట్టుకొనే ఆశలు, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం తపించిపోవడం.. ఈ అంశాలన్నిటి మధ్య గల అంతరాన్ని ఈ వెబ్ సిరీస్ అన్వేషిస్తుంది.
o దర్శకత్వం: ముత్తుకుమార్
o ఓటీటీ ప్లాట్ ఫార్మ్ : జీ5 (Zee5)
- జూబిలీ: ఇది ఒక విశేష చరిత్రాత్మక కాలం మీద ఆధారపడ్డ డ్రామా. భారతీయ చలనచిత్ర స్వర్ణ యుగానికి జోహారు పలికే వెబ్ సిరీస్. స్వాతంత్ర్యం తరువాత కాలానికి చెందిన ఇతివృత్తం ప్రధానమైంది ఇది. అప్పటి కాలపు చిత్ర నిర్మాతలు- దర్శకులు, తారల ఆకాంక్షలు, సంఘర్షణలు, వారు కన్న కలలను కలగలిపిన ఈ వెబ్ సిరీస్ ఆకర్షణీయ, విశ్వసనీయ కథగా చెప్పడంతో పాటు ఆలోచనలను రేకెత్తిస్తుంది.
o దర్శకత్వం: విక్రమాదిత్య మోట్ వానీ
o ఓటీటీ ప్లాట్ ఫార్మ్: అమెజన్ ప్రైమ్ వీడియో
పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో, విజేత గా నిలిచిన సిరీస్ డైరెక్టరు, రూపకర్త, నిర్మాతలతో పాటు సంబంధిత ఓటీటీ ప్లాట్ పార్మ్ ను కూడా సన్మానించనున్నారు. విజేతలకు వారి ప్రశంసనీయ తోడ్పాటులకు గాను రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని, సర్టిఫికెట్లను ఇస్తారు.
భారత ఓటీటీ విప్లవానికి ఓ ఉత్ప్రేరకం
ఈ పురస్కారం ప్రధానంగా వినోద రంగంలో సృజనశీలత్వాన్ని, నూతన ఆవిష్కరణలను పెంపొందింపచేస్తూ ఉండాలన్న ఐఎఫ్ఎఫ్ఐ ఆశయాన్ని చెబుతోంది. భారతీయ భాషలలో గొప్ప నాణ్యత కలిగిన కంటెంట్ ను ఆవిష్కరించడాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్లోబల్ క్రియేటర్లు, ఫ్లాట్ ఫార్మ్ ల మధ్య సహకారాన్ని పెంచి డిజిటల్ మాధ్యమంలో కథ చెప్పే కళ కు మన దేశాన్ని కూడలిగా తీర్చిదిద్దాలన్నది ఐఎఫ్ఎఫ్ఐ లక్ష్యం.
ఉత్తమ వెబ్ సిరీస్ విజేతను 55వ ఐఎఫ్ఎఫ్ఐ ను నిర్వహించే రోజులలో ప్రకటించనున్నారు. దీనితో సాంప్రదాయిక చలనచిత్రాల మొదలు చైతన్యభరిత ఓటీటీ విభాగం వరకు సినిమా రంగంలోని వివిధ అభివ్యక్తులకు మద్దతుదారుగా ఐఎఫ్ఎఫ్ఐ పోషిస్తున్న పాత్ర మరింత బలపడనుంది.
***
(Release ID: 2073992)
Visitor Counter : 25