ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ లో ఈశాన్య ప్రాంత వాణిజ్య, పెట్టుబడుల (నార్త్ ఈస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్) రోడ్ షోలో పాల్గొన్న డాక్టర్ సుకాంత మజుందార్
Posted On:
13 NOV 2024 8:10PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం డి ఒ ఎన్ ఇ ఆర్) ఈరోజు హైదరాబాద్ లో ఈశాన్య ప్రాంత వాణిజ్య, పెట్టుబడుల (నార్త్ ఈస్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్) రోడ్ షో నిర్వహించింది. నగరంలో గతంలో నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఈ రోడ్ షో ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను అన్వేషిస్తున్న పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షించింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యా శాఖల సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ఇంకా మంత్రిత్వ శాఖకూ, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖకూ చెందిన సీనియర్ అధికారులు, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈశాన్య ప్రాంత సుసంపన్న వారసత్వాన్ని ప్రముఖంగా వివరించిన సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, "భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా కాలం ముందే, ఈశాన్య ప్రాంతం అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా ఉంది" అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన చమురు బావి డిగ్ బోయ్ ఆయిల్ ఫీల్డ్, తేనీరు వంటి అంశాలతో అస్సోం ప్రాముఖ్యతను ఆయన ఈసందర్భంగా వివరించారు. ఈ ప్రాంతంలో టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ రంగాలకు ఉన్న అపారమైన అవకాశాలను అన్వేషించకపోవడాన్ని ప్రస్తావిస్తూ... హైదరాబాద్ హెల్త్ కేర్, ఐటీ రంగాలు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాలని, అక్కడి యువత, విద్యావంతులైన శ్రామిక శక్తిని, ప్రత్యేక సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను అందిపుచ్చుకోవాలని కోరారు. హైదరాబాదీ సుగంధ ద్రవ్యాలు, ఈశాన్య రుచులను మేళవించిన ఫ్యూజన్ వంటకాలతో ఫుడ్ టూరిజానికి ఉన్న అపార సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారు. ప్రభుత్వం 100 రోజుల విజయాలలో భాగంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన పీఎం-డీవైఎన్ఇ, ఎన్ఇఎస్ఐడిఎస్ వంటి పలు ప్రభావవంతమైన ప్రాజెక్టులు మంజూరు అయినట్టు తెలిపారు. రహదారి మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ , వెదురు ప్రాసెసింగ్ పై దృష్టి సారించే ఈ ప్రాజెక్టులు ఈశాన్య భారతదేశం అంతటా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. ఈశాన్య రాష్ట్రాల సామర్థ్యాన్ని అన్వేషించి, దాని అద్భుతమైన గాధలో భాగస్వాములు కావాలని డాక్టర్ సుకాంత మజుందార్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తన ప్రసంగంలో... ఈశాన్య ప్రాంతం ఆసియాన్ ఆర్థిక వ్యవస్థలకు సులభంగా చేరుకోగలిగే వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉందని, వ్యాపారాలకు లాభదాయకమైన అవకాశాలను అందిస్తుందని చెప్పారు. ఈశాన్య ప్రాంత కనెక్టివిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. విస్తృతమైన రహదారి నెట్వర్క్, విస్తరిస్తున్న రైల్వే మార్గాలు, 17 విమానాశ్రయాలు ఈ ప్రాంత వ్యాపార సామర్థ్యాన్ని పెంచాయి. ఈశాన్య ప్రాంతం చరిత్ర, సంస్కృతి, సహజ సౌందర్యంతో సుసంపన్నమైన ప్రాంతం. ఇది చాలా కాలంగా మరుగున పడింది. కానీ ఇప్పుడు భారతదేశ గొప్ప ఆర్థిక చోదకాలలో ఒకటిగా తన సముచిత స్థానాన్ని పొందడానికి సిద్ధంగా ఉంది. ఈశాన్య ప్రాంతంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు.
‘అడ్వాంటేజ్ నార్త్ ఈస్ట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ట్రేడ్ ఆపర్ట్యునిటీస్’ అనే అంశంపై ఎండీఓఈఆర్ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మొనాలిసా దాస్ మాట్లాడుతూ...ఈశాన్య ప్రాంతంలో అన్వేషించని అనేక గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత దశాబ్దంలో, ప్రభుత్వం అనేక పెండింగ్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. వివిధ పథకాలు / కార్యక్రమాల ద్వారా స్థానిక సమాజాలకు, మిలియన్ల మందికి ప్రయోజనం చేకూర్చింది. ఐటీ అండ్ ఐటీఈఎస్, హెల్త్ కేర్, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, వినోదం, పర్యాటకం, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా, ఇంధనం వంటి వివిధ రంగాల్లో ఈ ప్రాంతంలో ఉన్న అవకాశాలను ఆమె వివరించారు. ఈ ప్రాంతంలో పెట్టుబడుల అవకాశాలను సులభతరం చేయడానికి, పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని పెంచడానికి ఎండిఒఎన్ఇఆర్ నిబద్ధతతో ఉందని ఆమె పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులతో ఈశాన్య ప్రాంతం వృద్ధి సాధిస్తుందని, వివిధ రంగాల్లో అగ్రగామిగా ఎదగగలదని, స్థానిక ప్రజలకు, మొత్తం దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) డైరెక్టర్ డాక్టర్ కాజల్ ఉన్నతి పథకాన్ని గురించి వివరించారు. దాని ప్రయోజనాలు, అనుబంధ ప్రోత్సాహకాల గురించి సమగ్ర అవగాహన కల్పించారు. ఈశాన్య భారతదేశంలో పారిశ్రామికీకరణ, ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే ఉన్నతి పథకం లక్ష్యం. పెట్టుబడిదారులు, తయారీ కంపెనీలను ఆకర్షించడానికి, 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి మద్దతు ఇవ్వడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఎగుమతులను పెంచడానికి దేశీయ తయారీ, సేవలను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఫిక్కీ ప్రతినిధులు వివిధ రంగాల్లో అవకాశాలపై విలువైన అవగాహనను పంచుకున్నారు. ప్రతి రాష్ట్రం తమ ప్రత్యేక పెట్టుబడి అవకాశాలపై సమగ్ర అవలోకనాలను సమర్పించింది. ఈ కార్యక్రమం బహుళ ప్రముఖ వ్యాపారాల నుండి క్రియాశీల భాగస్వామ్యాన్ని ఆకర్షించింది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడంపై బలమైన ఆసక్తిని ప్రతిబింబించింది.
ఈశాన్య రాష్ట్రాల పెట్టుబడిదారుల సదస్సుకు ముందు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్ సహా వివిధ రాష్ట్రాలతో విజయవంతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. గతంలో ముంబయి, హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరుల్లో జరిగిన రోడ్ షోలకు విశేష స్పందన లభించగా, వైబ్రంట్ గుజరాత్లో జరిగిన స్టేట్ సెమినార్...పెట్టుబడిదారులను గణనీయంగా ఆకర్షించింది.
హైదరాబాద్ రోడ్ షో... పెట్టుబడిదారుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మార్పుకు సంకేతంగా భావించిన హైదరాబాద్ రోడ్ షోలో ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి అవకాశాలపై ఆసక్తిని రేకెత్తించే అనేక బి 2 జి సమావేశాలు జరిగాయి.
****
(Release ID: 2073187)
Visitor Counter : 26