సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 2

ఇఫీ-2024- ‘ఫిలిమ్ బజార్ వ్యూయింగ్ రూమ్’ లో 208 చిత్రాల ప్రదర్శన

ఈ నెల 20వ తేదీ నుంచీ 28 వరకూ జరగబోయే 55వ అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకల కోసం గోవా ముస్తాబవుతోంది. ఇదే సమయంలో 20-24 తేదీల మధ్య జరిగే 18వ ఫిల్మ్ బజార్ వేదికగా పరిశ్రమకు చెందిన దర్శకులూ, తదితర నిపుణులకు తమ సృజనాత్మతకతను ప్రదర్శించే అవకాశాన్నీ, పరస్పర సహకారం ద్వారా ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్నీ  కల్పిస్తోంది.

మారియట్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన ’వ్యూయింగ్ రూమ్’ (ప్రదర్శన మందిరం) లో ప్రదర్శన నిమిత్తం భారత్, దక్షిణాసియా ప్రాంతాలకు చెందిన అత్యుత్తమ చిత్రాల ఎంపిక పూర్తయ్యింది. చిత్రాల పెట్టుబడి, పంపిణీల కోసం అనేక దర్శక నిర్మాతలు సందర్శించే ఈ మందిరంలో... అటు తయారీ పూర్తయిన చిత్రాలతో పాటూ నిర్మాణాంతర పనుల్లో ఉన్న సినిమాలను కూడా ప్రదర్శిస్తారు. ఈ వేదిక ద్వారా దర్శకులకు ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చే ఫిలిమ్ నిర్వాహకులు, పంపిణీదార్లు, విక్రేతలు, పెట్టుబడిదార్లను కలుసుకునే అవకాశం లభిస్తుంది. ’వ్యూయింగ్ రూమ్’ నవంబర్ 21 నుంచీ 24 వరకూ అందుబాటులో ఉంటుంది.

ఈ ఏటి ప్రదర్శన కోసం ’వ్యూయింగ్ రూమ్’  గ్రంథాలయం 208 చిత్రాలతో సిద్ధంగా ఉంది. 30-70 నిమిషాల నిడివి గల సినిమాలను మిడ్- లెంగ్త్ ఫిలిమ్స్ గానూ, 30 నిమిషాల కన్నా తక్కువ ప్రదర్శన సమయం గల సినిమాలను లఘు చిత్రాలగానూ వర్గీకరించారు.145 ఫీచర్ ఫిలిమ్ లూ, 23 మిడ్-లెంగ్త్  సినిమాలూ, 30 లఘు చిత్రాలూ సినీ అభిమానులను అలరించనున్నాయి. ఇక ఫీచర్ ఫిలిమ్స్, మిడ్-లెంగ్త్  విభాగాల్లో ప్రదర్శించే సినిమాల్లో ‘ఎన్ఎఫ్డీసీ’ (జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ) నిర్మించిన, సహనిర్మాతగా వ్యవహరించిన 12 చిత్రాలు సహా, ‘ఎన్ఎఫ్డీసీ’-‘ఎన్ఎఫ్ఏఐ’ భద్రపరిచిన ‘ఆర్కైవ్స్’ నిధి నుంచీ పునరుద్ధరించిన 10 క్లాసిక్ చిత్రాలను కూడా ప్రదర్శిస్తారన్న వార్త సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

ఫిలిమ్ బజార్ రికమండ్స్ (ఎఫ్ బీ ఆర్)

‘ఫిలిమ్ బజార్ రికమండ్స్’ పేరిట సిద్ధం చేసిన జాబితాలో మొత్తం 208 సినిమాల నుండి ప్రత్యేకంగా ఎంపికైన అత్యుత్తమైన చిత్రాలను  ప్రదర్శిస్తారు. 19 ఫీచర్ ఫిలిమ్ లూ, 3 మిడ్-లెంగ్త్ సినిమాలూ, 2 లఘు చిత్రాలూ, 3 క్లాసిక్ చిత్రాలు సహా మొత్తం 27 సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.  

ఎన్ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతుల్ కుమార్ మాట్లాడుతూ... “ఎఫ్బీఆర్  జాబితాను మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.  ఈ జాబితాలోని  సినిమాలు దర్శకుల ప్రతిభకూ, సినిమాల పట్ల వారికి గల అనురక్తికీ అద్దం పడతాయి. ఈ ప్రత్యేక ప్రదర్శనల ద్వారా దర్శకులకు తగిన గుర్తింపూ ప్రోత్సాహం లభించడమే కాక, తమ అభివ్యక్తిని వారు ప్రపంచం ఎదుట సగర్వంగా ప్రదర్శించుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. సినిమాలు ప్రేక్షకులపై తిరుగులేని ప్రభావాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. రాబోయే కాలంలో సినిమా రంగంతో మమేకమయ్యే ఆసక్తి గల కళాకారులకు తగిన స్ఫూర్తినీ  చైతన్యాన్నీ అందించేందుకు మేం సదా సిద్ధం” అన్నారు.  

‘ఫిలిమ్ బజార్’ వేదికగా, ‘ఓపెన్ పిచ్చింగ్’  పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమంలో.. పరిశ్రమ ప్రముఖులూ, నిర్మాతలూ సేల్స్ ఏజెంట్లూ, పంపిణీదారులూ, ఉత్సవ నిర్వాహకులు, భవిష్య పెట్టుబడిదార్ల ఎదుట తమ చిత్రాన్ని ప్రదర్శించి ప్రచారం చేసుకునే ప్రత్యేక అవకాశం కొన్ని చిత్రాలకు లభిస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసిన సినిమాల్లో ఫీచర్, మిడ్ లెంగ్త్, షార్ట్ ఫిలిమ్ లు ఉన్నాయి. 

జాబితాలోని చిత్రాలు

* ప్రత్యేక ప్రదర్శనలో భాగంగా,  ఎఫ్బీఆర్ జాబితా లేదా ’వ్యూయింగ్ రూమ్’ ద్వారా  ప్రదర్శితమయ్యే చిత్రాలు ‘ఫిలిమ్ బజార్ లోగో’ ను ఎక్కడా వాడుకొనరాదు అన్న నిబంధనను విధించారు. చిత్ర ప్రదర్శన సహా ప్రచార సామగ్రికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

ఫిలిమ్ బజార్ నేపథ్యం

జాతీయ, అంతర్జాతీయ సినిమా విపణిలో దక్షియాసియా ప్రాంత సినిమాల ప్రచారం నిమిత్తం ఫిలిమ్ బజార్ ఏర్పాటయ్యింది. ఇందులోని 'వ్యూయింగ్ రూమ్’ సౌలభ్యాన్ని వినియోగించుకుని తగిన రుసుము చెల్లించిన దర్శకులకు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేసుకునే వీలు, ప్రపంచ కొనుగోలుదార్ల ఎదుట తమ చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం కలుగుతాయి.  

వ్యూయింగ్ రూమ్’  అమ్మకందార్లు (ఫిలిమ్ నిర్మాతలు), కొనుగోలుదార్ల (ఫిలిమ్ ప్రోగ్రామర్లు, పంపిణీ దార్లు, సేల్స్ ఏజెంట్లు, పెట్టుబడిదార్లు) వర్గానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదార్ల పనితీరుని అధ్యయనం చేసిన ఫిలిమ్ బజార్ బృందం వారి పేర్లను ఖరారు చేస్తుంది. జాబితాలో చోటు దక్కించుకున్న బయ్యర్లు, వ్యూయింగ్ రూమ్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రత్యేక ప్రదర్శన కోసం ఎంపిక చేసిన చిత్రాల వివరాలను తెలుసుకోగలుగుతారు. ఆయా  ఫిల్మ్ మేకర్ లతో  నేరుగా సంభాషించగలుగుతారు.

ఫిలిమ్ బజారు గురించిన మరిన్ని వివరాలు:

https://filmbazaarindia.com/the-bazaar/about-film-bazaar/

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2068120

 

***

iffi reel

(Release ID: 2071180) Visitor Counter : 43