రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

హర్యానాలోని అంబాలలో ప్రారంభమైన భారత్-వియత్నాం సంయుక్త సైనిక విన్యాసాలు – ‘విన్బాక్స్ 2024’

Posted On: 04 NOV 2024 2:29PM by PIB Hyderabad

భారత్-వియత్నాం సంయుక్త సైనిక విన్యాసాలు – ‘విన్బాక్స్ 2024’, అయిదో సంచిక  కార్యక్రమాలు ఈ రోజు హర్యానాలోని అంబాలాలో ప్రారంభమయ్యాయి. 2023లో వియత్నాంలో జరిగిన విన్యాసాలకు కొనసాగింపుగా ‘విన్బాక్స్ 2024’ - అంబాలా, చండీమందిర్- రెండు ప్రాంతాల్లో నవంబర్ 04 నుంచీ 23వ తేదీ వరకూ జరుగుతాయి. భారత్–వియత్నాంల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా ఈ విన్యాసాలు కీలకంగా మారాయి.

ఈ సంచికలో ఇరుదేశాల ఆర్మీతోపాటు వాయుసేన కూడా పాల్గొనడంతో కార్యక్రమం మరింత విస్తృమైంది. భారత సైన్యం తరఫున ‘రెజిమెంట్ కోర్ ఇంజనీర్లు’ 47 మంది సహా ఇతర విభాగాల సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. వియత్నాం పీపుల్స్ ఆర్మీ బలగాలు సమాన సంఖ్యలో పాల్గొంటున్నాయి.

విన్బాక్స్-24- సహకార సైనిక పటిమను పటిష్ఠపరిచేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. ఐక్యరాజ్య సమితి ప్రణాళికా పత్రం- ఏడో అధ్యాయంలో భాగమైన ‘ఐరాస శాంతి సంరక్షణ’ కార్యకలాపాల్లో ఇంజనీరింగ్ సేవలందించేందుకు, ఇరుదేశాల ఇంజనీర్ల, వైద్య సేవల బృందాలను ఈ కసరత్తులు సిద్ధం చేస్తాయి.

గతంలో జరిపిన విన్యాసాల పరిధిని విస్తృతపరుస్తూ, క్షేత్రస్థాయిలో శిక్షణను అందించే విన్బాక్స్-2024, ఇరుదేశాల దళాలను మరింత పటిష్ఠ పరుస్తుంది. తద్వారా, పరస్పర విశ్వాసం పెంపు, సహ నిర్వహణ, ఉత్తమ పద్ధతుల వినిమయం సాధ్యమవుతుంది. ఇదే సమయంలో సైనిక ఉత్పత్తుల ప్రదర్శనలు కూడా ఏర్పాటయ్యాయి. మానవతా సహాయం, విపత్తు నిర్వహణ అంశాల్లో దళాల సంసిద్ధతను 48 గంటల పాటు నిర్వహించే పరీక్ష ఆధారంగా తెలుసుకొంటారు. గతంలో సాంకేతికపరమైన సైనిక చర్యల్లో ఐరాస దళాలు చూపిన పాటవం నేపథ్యంలో ఇరుదేశ దళాల ప్రస్తుత స్థాయిని అంచనా వేస్తారు. సంయుక్త విన్యాసాల ద్వారా భాగస్వామి దేశం సాంఘిక, సాంస్కృతిక వారసత్వాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఇరుదళాలకూ కలుగుతుంది.  

 

****


(Release ID: 2070651) Visitor Counter : 71