బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్ ఇండియా 50వ వ్యవస్థాపక దినోత్సవం: వికసిత భారత్ దిశగా సంకల్పం


సీఐఎల్ ప్రారంభించిన సిబ్బంది కేంద్రీకృత పీఎల్ఐ పథకాన్ని అభినందించిన బొగ్గు శాఖ మంత్రి

Posted On: 04 NOV 2024 11:01AM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కలకత్తాలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అయిదు దశాబ్దాలుగా దేశ ఇంధన రంగానికి సీఐఎల్ అందించిన విశేష సేవలను గుర్తు చేసుకోవడమే కాకుండా, భవిష్యత్ కార్యక్రమాలు, వ్యూహాత్మక నిర్దేశాలకు ఈ కార్యక్రమం వేదికైంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గోల్డెన్ జూబ్లీ లోగోను, ‘అంగార’ చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత ఇంధన రంగానికి వెన్నెముకగా సీఐఎల్ కీలక పాత్రను సూచించేలా ఉన్న లోగో-  సృజనాత్మకత, పురోగతి, సుస్థిరతల్లో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మరోవైపు, బొగ్గుగని కార్మికుల ధైర్యసాహసాలు, అంకిత భావాన్ని వెల్లడిస్తూ, వారి శక్తియుక్తులను చిహ్నం ప్రతిబింబిస్తుంది. రాయల్ బెంగాల్ టైగర్ స్ఫూర్తితో ఆ చిహ్నాన్ని రూపొందించారు.

శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ కార్యాచరణలో 50 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అధికారులు, సిబ్బంది, కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బొగ్గు ఉత్పత్తిని పెంచడం, సరఫరాను మెరుగుపరచడం ద్వారా దిగుమతులను తగ్గించడంపై సీఐఎల్ ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. గని కార్మికుల సంక్షేమం, గనుల మూసివేతతో ప్రభావితులైన వారి పునరావాసం ప్రాధాన్యాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘కోల్ ఇండియా ఉత్పత్తుల్లో ఒప్పంద కార్మికులది కీలక పాత్ర. వారి కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అమలవుతుంది’’ అని ఆయన అన్నారు.

వేలం ద్వారా బొగ్గు గనులను పారదర్శకంగా కేటాయించి, బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో 2015లో బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల (సిఎంఎస్పీ) చట్టం రూపొందించడాన్ని మంత్రి ప్రస్తావించారు. ఉక్కు, సిమెంట్, విద్యుత్ సంస్థల వంటి రంగాలకు తగినంత బొగ్గును అందించడంలో ఇది కీలకమవుతోంది. 2020లో వాణిజ్యపరంగా బొగ్గుగనుల తవ్వకాన్ని ప్రారంభించడం ద్వారా పారదర్శకత, సులభతర వాణిజ్యం, పెట్టుబడి అవకాశాలను కల్పించడంతో పాటు బొగ్గు రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని కూడా మంత్రి చెప్పారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్ పరిస్థితుల్లో పోటీ సామర్థ్యం, నిబద్ధత కంపెనీకి ఉందని ధీమా వ్యక్తంచేశారు.

వచ్చే దశాబ్దాల్లో భారత ఇంధన రంగంలో బొగ్గు ప్రధాన భాగంగా ఉంటుందని పునరుద్ఘాటించిన శ్రీ కిషన్ రెడ్డి పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, కీలకమైన ఖనిజాల సేకరణకు శ్రీకారం చుట్టడం సహా సీఐఎల్ పనితీరును ఆయన అభినందించారు. వికసిత భారత్ కార్యక్రమంలో కోల్ ఇండియాది కీలక పాత్ర అని, సంస్థ తన బాధ్యతను భుజానికెత్తుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ప్రసంగిస్తూ దిగుమతి చేసుకున్న బొగ్గుతో పోలిస్తే తక్కువ ధరలకే భారతీయ వినియోగదారులకు సీఐఎల్ బొగ్గును అందిస్తోందన్నారు. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు 2024 అక్టోబర్ 28 నాటికి 31.6 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని, గతేడాది ఇదే సమయానికి అవి 18.8 మిలియన్ టన్నులుగా ఉన్నాయని తెలిపారు. సీఐఎల్ కృషి కారణంగా 68 శాతం వృద్ధి నమోదైందన్నారు. వాణిజ్య ధోరణుల్లో మార్పులకు అనుగుణంగా కోల్ ఇండియా తన ప్రక్రియలు, నిర్వహణ, వ్యయ సామర్థ్యాన్ని పునర్వ్యవస్థీకరించాలని కూడా బొగ్గు శాఖ కార్యదర్శి అన్నారు.

బొగ్గు, లిగ్నైట్ అన్వేషణపై వ్యూహాత్మక నివేదికను కూడా శ్రీ కిషన్ రెడ్డి విడుదల చేశారు. గనుల మూసివేత వెబ్ సైటును ప్రారంభించడంతోపాటు, నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కు చెందిన నిగాహి ప్రాజెక్టు వద్ద రూ. 250 కోట్ల పెట్టుబడితో 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సౌర ప్రాజెక్టు ద్వారా 49 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. సంస్థాగత, వ్యక్తిగత విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందించడం ద్వారా కార్యక్రమం ముగిసింది. సీఐఎల్ విజయంలో వారి కృషి విశేషమైనదన్నారు.

కీలక ఘట్టానికి చేరిన ఈ సందర్భంగా... దేశానికి సుస్థిర వృద్ధి, ఇంధన భద్రతను అందించడంలో తన నిబద్ధతను కోల్ ఇండియా పునరుద్ఘాటించింది. మున్ముందు భారత ఇంధన రంగానికి మూలాధారంగా తన పాత్ర కొనసాగిస్తూనే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సీఐఎల్ సిద్ధంగా ఉంది.


(Release ID: 2070648) Visitor Counter : 59