వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ పథకం... ‘‘నమో డ్రోన్ దీదీ’’ నిర్వహణ మార్గదర్శకాలను


విడుదల చేసిన వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం

డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద స్వయం సహాయక సంఘ మహిళలకు డ్రోన్లను...

నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా అందించేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
మొత్తం వ్యయం రూ.1261 కోట్లు

2024-25 నుంచి 2025-2026 మధ్య స్వయం సహాయక సంఘాల నుంచి
ఎంపిక చేసిన14,500 మహిళలకు డ్రోన్లను అందించాలన్నది లక్ష్యం

వ్యవసాయ నిమిత్తం రైతులకు మాత్రమే అద్దె ప్రాతిపదికన సేవలు

Posted On: 01 NOV 2024 12:04PM by PIB Hyderabad

స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు డ్రోన్లను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.1261 కోట్ల వ్యయంతో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద దీనిని అమలు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల నుంచి ఎంపిక చేసిన 14500 మంది మహిళల ద్వారా 2024-25 నుంచి 2025-2026 మధ్యకాలంలో దీనిని అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అద్దె ప్రాతిపదికన- రైతుల వ్యవసాయ ప్రయోజనాలకు మాత్రమే డ్రోన్లను అందించాల్సి ఉంటుంది. (ప్రస్తుతం ద్రవరూప ఎరువులనూ, క్రిమి సంహారకాలను పిచికారీ చేయవచ్చు). దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం విడుదల చేసింది. నమో డ్రోన్ దీదీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలను అర్థవంతమైన రీతిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది.

మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి:

కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యున్నత స్థాయి కమిటీ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. వ్యవసాయ రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఎరువులు, పౌర విమానయానం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు చెందిన ఆయా విభాగాల కార్యదర్శులు ఈ కేంద్ర స్థాయి కమిటీలో సభ్యులుగా ఉంటారు.

- కార్యాచరణ, పర్యవేక్షణ కమిటీకి గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. పథకానికి సంబంధించి ఆచరణాత్మకమైన ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అంశాల్లో ఇతర భాగస్వాములు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పథకాన్ని అమలు చేయడానికి సంబంధించిన సాంకేతిక సలహాలను ఈ కమిటీ అందించాలి.

- స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్లు కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చులో అంటే డ్రోన్, అనుబంధ పరికరాలతో- ఒక ప్యాకేజీగా కలిపి గరిష్ఠంగా 80 శాతాన్ని కేంద్రం ఆర్థికసాయంగా అందిస్తుంది. గరిష్ఠ పరిమితి రూ.8 లక్షలకు మించరాదు.

- స్వయం సహాయక సంఘాలకు చెందిన క్లస్టర్ స్థాయి సమాఖ్య (సీఎల్ఎఫ్)లు మిగిలిన సొమ్మును (మొత్తం పరికరాల ఖరీదులో సబ్సిడీ పోను...) నేషనల్ అగ్రికల్చర్ ఇన్ ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (ఏఐఎఫ్) నుంచి రుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. కనిష్ఠంగా 3 శాతం వడ్డీకి ఈ రుణాన్ని స్వయం సహాయక సంఘాలు లేదా సీఎల్ఎఫ్ లకు అందిస్తారు.

- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన పథకాలు, కార్యక్రమాలు, ఇతర మార్గాల ద్వారా కూడా స్వయం సహాయక సంఘాలు లేదా సీఎల్ఎఫ్ లు రుణం పొందవచ్చు.

ఈ పథకం కింద డ్రోన్లు అనే కాకుండా, డ్రోన్లను ఒక ప్యాకేజీ రూపంలో సరఫరా చేస్తారు. డ్రోన్ తోపాటు, ద్రవరూప ఎరువులు, క్రిమిసంహారకాలను స్ప్రే చేయడానికి- అవసరమైన స్ప్రే పరికరాలు, డ్రోన్ ను ఉంచేందుకు అవసరమైన బాక్సు, బ్యాటరీలు, అధోముఖ కెమేరా, రెండు ఛానెళ్లున్న బ్యాటరీ చార్జర్, బ్యాటరీ చార్జర్ హబ్, ఏనిమో మీటర్, పీహెచ్ మీటర్, అన్ని పరికరాలపైనా ఏడాది పాటు వారంటీ- ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

- ప్యాకేజీలో ఇంకా - 04 అదనపు బ్యాటరీ సెట్లు, ఒక అదనపు ప్రొపెల్లర్ సెట్టు (ఒక్కో సెట్టులో 6 ప్రొపెల్లర్లు ఉంటాయి), నాజిల్ సెట్టు, రెండు ఛానెళ్లతో కూడిన బ్యాటరీ చార్జర్, బ్యాటరీ చార్జర్ హబ్ ఉంటాయి. వీటితోపాటు డ్రోన్ పైలెట్, డ్రోన్ అసిస్టెంటుకు 15 రోజులపాటు శిక్షణ అందిస్తారు. ఏడాది పాటు బీమా కూడా ఉంటుంది. 2 ఏళ్లపాటు వార్షిక మెయింటినెన్స్, జీఎస్టీ పన్నులు కూడా ఉంటాయి.

అదనపు బ్యాటరీ సెట్లు ఉండటం వల్ల నిరంతరాయంగా డ్రోన్లను నడిపించడడం సాధ్యం అవుతుంది. అందించిన పరికరాల సాయంతో రోజుకు 20 ఎకరాల్లో పిచికారీ చేయవచ్చు.

- స్వయం సహాయక సంఘం నుంచి ముఖ్యంగా ఒక మహిళకు డ్రోన్ పైలెట్ గా శిక్షణ అందిస్తారు. దీంతోపాటు వ్యవసాయపరంగా పోషకాలు, క్రిమిసంహారకాలను ఎలా పిచికారీ చేయాలన్న అంశాల్లో కూడా 15 రోజులపాటు శిక్షణ అందిస్తారు. స్వయం సహాయక సంఘం- మహిళకు చెందిన కుటుంబ సభ్యుడికి ఎలక్ట్రికల్ వస్తువులను రిపేరు చేయడంలోనూ, యాంత్రిక వస్తువుల్ని ఎలా బిగించాలన్న కోణంలోనూ తర్ఫీదు ఇస్తారు. వీళ్లను డ్రోన్ అసిస్టెంటుగా పిలుస్తారు. మార్గదర్శకాలకు అనుగుణంగా సమయానుకూలంగా ప్యాకేజీలో భాగంగా డ్రోను కంపెనీలు ఈ శిక్షణ కార్యక్రమాలను అందించడంతోపాటు డ్రోన్లను సరఫరా చేస్తాయి.

- రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న ఎరువుల కంపెనీలు రాష్ట్రాల స్థాయిలో ఈ ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలూ, డ్రోను తయారీదారులు, స్వయం సహాయక సంఘాల క్లస్టర్ స్థాయి సమాఖ్యలు, రైతులు, లబ్దిదారులతో అనుసంధానాన్ని కూడా ఎరువుల కంపెనీలే చూసుకుంటాయి. డ్రోన్లను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఎల్ ఎఫ్ సీలదే. డ్రోన్ల యాజమాన్య హక్కులను కూడా ఈ ఎల్ ఎఫ్ సీలు లేదా దాని పరిధిలోకి వచ్చే స్వయం సహాయక సంఘాలకు ఉంటుంది.

- డ్రోన్ సేవలకు ఉన్న డిమాండు, వ్యవసాయ సేవలకు ఉన్న డిమాండు ఆధారంగా ప్రాజెక్టును అమలు అన్నది క్లస్టర్లు లేదా స్వయం సహాయక సంఘాల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయంలో డ్రోన్ల వాడకం ప్రాథమిక దశలో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అవసరమైతే, స్వయం సహాయక సంఘాలకు అవి చేయూతను అందించాల్సి ఉంటుంది. వ్యాపారం సజావుగా సాగేందుకు వీలుగా ఏడాదికి 2000 నుంచి 2500 ఎకరాలకు డ్రోన్ సేవలు అందించేలా చూస్తాయి. రాష్ట్ర స్థాయి కమిటీల సాయంతో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు- డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం- పథకానికి అనుబంధంగా ఉన్న వ్యవసాయ శాఖ, రాష్ట్రాల మిషన్ డైరెక్టర్లు- క్షేత్రస్థాయిలో పూర్తి బాధ్యత వహించడంతోపాటు, దీనిని విజయవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది.

- ప్రాజెక్టు అమలు కోసం ఐటీ ఆధారిత ‘మేనేజ్ మెంట్ సమాచార వ్యవస్థ’ కలిగిన సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఒక డ్రోను పోర్టల్ ను అందుబాటులో ఉంచుతారు. సాఫ్ట్ వేర్ ను కూడా దీని ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తారు. పర్యవేక్షణతోపాటు, నిధుల లభ్యత, విడుదల సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. డ్రోన్ కార్యకలాపాలను కూడా ఈ పోర్టల్ నమోదు చేస్తుంది. ఎప్పటికప్పుడు (లైవ్) సమాచారం కూడా లభిస్తుంది.

- స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు జీవనోపాధితోపాటు వ్యాపారావకాశాలను కల్పించడంలో భాగంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. మహిళలకు అదనపు ఆదాయ మార్గాలను కల్పించడం ఇందులోని ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదనలను మెరుగుపరుస్తారు. పంట దిగుబడులను పెంచడానికీ, రైతులకు చౌకగా సేవలను అందించడం వంటి లక్ష్యాలెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి.

 

***


(Release ID: 2070266) Visitor Counter : 189