ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని కేవడియాలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
Posted On:
31 OCT 2024 3:25PM by PIB Hyderabad
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
సర్దార్ సాహెబ్ చెప్పిన శక్తిమంతమైన మాటలు... ఐక్యతా మూర్తి వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం... ఏక్తా నగర్ విశాల దృశ్యం... ఇక్కడ నిర్వహించిన అద్భుతమైన ప్రదర్శనలు... మినీ ఇండియా గురించిన అవలోకనం... ప్రతీదీ చాలా అద్భుతంగా ఉంది... ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆగస్టు 15, జనవరి 26 తేదీల మాదిరిగానే... అక్టోబరు 31 నాటి ఈ కార్యక్రమం యావద్దేశానికి నూతన శక్తిని అందిస్తుంది. రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా!
ఈసారి, రాష్ట్రీయ ఏక్తా దివస్ అద్భుతమైన యాదృచ్చికతను తీసుకువచ్చింది. ఒకవైపు మనం ఐక్యతా పండుగను జరుపుకొంటుంటే, మరోవైపు శుభప్రదమైన దీపావళి పండుగ కూడా ఇదే సమయంలో వచ్చింది. దీపావళి దీపాల వెలుగులతో మొత్తం దేశాన్ని కలుపుతుంది... మొత్తం దేశానికి వెలుగునిస్తుంది. ఇప్పుడు ఈ దీపావళి పండుగ భారతదేశాన్ని ప్రపంచంతో కలుపుతోంది. అనేక దేశాలు దీపావళిని జాతీయ పండుగగా జరుపుకొంటున్నాయి. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ అలాగే భారత్ శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
మిత్రులారా,
మరో కారణంచేత కూడా ఈ రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రత్యేకమైనది. నేటి నుంచి సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతోంది. రాబోయే రెండేళ్ల పాటు, దేశం సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొంటుది. దేశ ఐక్యత కోసం ఆయన చేసిన అపూర్వ కృషికి ఇది దేశం ఆయనకు అందించే నివాళి. ఈ రెండేళ్ల వేడుకలు ‘ఒన్ ఇండియా, గ్రేట్ ఇండియా’ కోసం మన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయి. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని ఈ సందర్భం మనకు నేర్పుతుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో భారత్ చిన్నభిన్నం అవుతుందని ప్రపంచంలోని కొంతమంది భావించారు. సర్దార్ సాహెబ్ మాటల్లో దీని గురించి ఇప్పుడే మనం వివరంగా విన్నాం. వందలాది సంస్థానాలు ఏకమై మళ్లీ ఒక దేశంగా ఏర్పడగలవన్న ఆశ వారికి లేదు. అయితే అది సాధ్యమేనని సర్దార్ సాహెబ్ నిరూపించారు. ఆచరణలో కార్యశీలత, సంకల్పంలో సత్యనిష్ఠ, పనిలో మానవతా దృక్పథం, ప్రయోజనపరంగా జాతీయవాది అయిన... సర్దార్ సాహెబ్ కారణంగానే ఇది సాధ్యమైంది.
మిత్రులారా,
దురాక్రమణదారులను తరిమికొట్టేందుకు అందరినీ ఏకం చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ సైతం మనందరికీ స్ఫూర్తి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోట ఇప్పటికీ ఆయన కథను చెబుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయ్‌గఢ్ కోటలో ఒక ప్రయోజనం కోసం దేశంలోని విభిన్న ఆలోచనలనూ ఏకం చేశారు. ఈ రోజు ఇక్కడ ఏక్తా నగర్లో, రాయ్‌గఢ్ కోట ఆ మహనీయుని స్ఫూర్తికి ప్రతీకగా మన ముందు నిలిచి ఉంది. రాయ్‌గఢ్ కోట సామాజిక న్యాయం, దేశభక్తి, దేశానికి తొలి ప్రాధాన్యం వంటి విలువలతో కూడిన పుణ్యభూమి.... ఈ నేపథ్యంలో, వికసిత్ భారత్ సంకల్ప సాధన కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం.
మిత్రులారా,
గత దశాబ్ద కాలంలో ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడంలో భారత్ అద్భుతమైన విజయాలను సాధించింది. నేడు ప్రభుత్వం చేసే ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన ఉదాహరణ.. మన ఏక్తా నగర్లో, ఇక్కడ ఉన్న ఐక్యతా మూర్తి.. ఈ స్మారక చిహ్నం పేరులోనే కాకుండా దాని నిర్మాణంలో కూడా ఐక్యతను సూచిస్తుంది. ఉక్కు మనిషి, రైతు బిడ్డ అయిన సర్దార్ సాహెబ్ విగ్రహ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా రైతుల నుంచి పొలాల్లో వాడే పనిముట్ల నుంచి లోహాన్ని సేకరించి ఇక్కడికి తీసుకొచ్చాం. దేశంలోని ప్రతిమూల నుంచీ ఇక్కడికి మట్టిని తీసుకొచ్చాం. అందుకే ఈ నిర్మాణం ఐక్యతా స్ఫూర్తికి ప్రతీకగా ఉంది. ఇక్కడ ఏక్తా నర్సీరీ ఉంది.. విశ్వవనం ఉంది.. దీనిలో ప్రపంచంలోని చాలా అడవుల నుంచి తెచ్చిన మొక్కలున్నాయి. దేశవ్యాప్తంగా గల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఒకే చోట ప్రదర్శించే 'చిల్డ్రన్స్ న్యూట్రిషన్ పార్క్' ఇక్కడ ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆయుర్వేద సంప్రదాయాలు, మొక్కలు గల 'ఆరోగ్య వన్' కూడా ఇక్కడ ఉంది. సందర్శకుల కోసం దేశవ్యాప్తంగా తయారైన హస్త కళలను ప్రదర్శించే 'ఏక్తా మాల్' కూడా ఇక్కడ ఉంది.
మిత్రులారా,
'ఏక్తా మాల్' ఇక్కడే కాదు, మేం ప్రతి రాష్ట్ర రాజధానిలో 'ఏక్తా మాల్స్' నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రతియేటా నిర్వహిస్తున్న 'యూనిటీ రన్' ద్వారా ఐక్యతా సందేశం మరింత బలపడుతుంది.
మిత్రులారా,
నిజమైన భారతీయులుగా, దేశ ఐక్యత కోసం ప్రతి ప్రయత్నాన్నీ ఆనందోత్సాహాలతో వేడుకలా జరుపుకోవడం మన కర్తవ్యం. ప్రతి క్షణంలో శక్తి, ఆత్మవిశ్వాసం, కొత్త తీర్మానాలు, ఆశలు నిండిన వేడుక ఇది. మేం భారతదేశ భాషలను ప్రస్తావించినప్పుడు, మేం వాటితో ఐక్యతకు బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తాం. నూతన జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషల్లో విద్యా బోధనకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం. మీ అందరికీ తెలిసినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇటీవలి నిర్ణయాలతో దేశం గర్వపడింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఇటీవలే, ప్రభుత్వం మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృత భాషలకు ప్రాచీన భాష హోదాను ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. మనం మాతృభాషలుగా మన భాషలను గౌరవించినప్పుడు... అది మన తల్లినీ, మన మాతృభూమినీ, భరతమాతనూ గౌరవించడం అవుతుంది. భాషలాగే... దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అనుసంధాన కార్యక్రమాలు సైతం దేశ ఐక్యతను బలోపేతం చేస్తున్నాయి. రైల్వేలు, రోడ్లు, హైవేలు, ఇంటర్నెట్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు గ్రామాలను నగరాలతో అనుసంధానించాయి. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైలు మార్గంతో అనుసంధానం చేసినప్పుడు... లక్షద్వీప్, అండమాన్-నికోబార్‌దీవులను సముద్ర గర్భంలో ఉండే కేబుళ్ల ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్‌కు అనుసంధానించినప్పుడు.. పర్వత ప్రాంతాల్లోని ప్రజలు మొబైల్ నెట్‌వర్కులకు కనెక్ట్ అయినప్పుడు... అభివృద్ధి రేసులో వెనుకబడి ఉన్నామనే భావన అదృశ్యమవుతుంది. ముందుకు సాగడానికి అది కొత్త శక్తిని ఇస్తుంది. జాతీయ సమైక్యతా స్ఫూర్తికి బలం చేకూరుతుంది.
మిత్రులారా,
గత ప్రభుత్వాలు తీసుకున్న వివక్షాపూరిత నిర్ణయాలూ, విధానాల వల్ల దేశ సమైక్యత దెబ్బతిన్నది. గత పదేళ్లలో సుపరిపాలన ద్వారా వివక్షను పూర్తిగా తొలగించాం... మేం 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' మార్గాన్ని ఎంచుకున్నాం. నేడు, 'హర్‌ఘర్ జల్' పథకంతో వివక్ష లేకుండా ప్రతి ఇంటికి నీళ్లు అందించాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ అందుతోంది. నేడు ప్రధానమంత్రి ఆవాస్ పథకం కింద వివక్ష లేకుండా అందరికీ సొంతిళ్లను అందిస్తునాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరింది... ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం దశాబ్దాలపాటు సమాజంలో నెలకొన్న అసంతృప్తిని తొలగించింది. ఫలితంగా ప్రభుత్వంపైనా, వ్యవస్థలపైనా ప్రజల్లో నమ్మకం పెరిగింది. 'వికాస్' (అభివృద్ధి), 'విశ్వాస్' (విశ్వాసం) ల ఈ ఐక్యత 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. మా ప్రతి పథకంలో, ప్రతి విధానంలో, ప్రతి నిబద్ధతలో ఐకమత్యమే ప్రాణశక్తి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దీనిని చూసి, వినీ... సర్దార్ సాహెబ్ ఆత్మ తప్పక మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
“భిన్నత్వంలో ఏకత్వంతో జీవించే మన సామర్థ్యానికి నిరంతరం సవాళ్లు ఎదురవుతుంటాయి”.. “మనం ఈ సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాలి” అని బాపూజీ చెప్పేవారు. గత పదేళ్లలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో జీవించే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించింది. ప్రభుత్వం తన విధానాలు, నిర్ణయాల్లో “ఒకే భారత్” స్ఫూర్తిని నిరంతరం బలోపేతం చేస్తోంది. ఈరోజు ఆధార్ ద్వారా “ఒక దేశం, ఒకే గుర్తింపు” విజయాన్ని మనం చూస్తున్నాం.. ప్రపంచమంతా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతోంది. గతంలో భారత్‌లో వివిధ పన్నుల వ్యవస్థలు ఉండేవి. మేం 'ఒక దేశం, ఒకే పన్ను' వ్యవస్థ-జీఎస్‌టీని రూపొందించాం. 'ఒకే దేశం, ఒకే పవర్ గ్రిడ్'తో దేశంలోని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశాం. ఒకప్పుడు కొన్ని చోట్ల కరెంటు ఉంటే మరికొన్ని ప్రాంతాలు అంధకారంలో ఉండేవి. పవర్ గ్రిడ్ చిన్నభిన్నమై ఉండేది. మేం 'ఒకే దేశం, ఒకే గ్రిడ్' తీర్మానాన్ని నెరవేర్చాం. 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్'తో మేం పేదలకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలను ఏకీకృతం చేశాం. మేం ఆయుష్మాన్ భారత్ ద్వారా 'ఒన్ నేషన్, ఒన్ హెల్త్ ఇన్సూరెన్స్' అందించాం. ప్రతి పౌరుడికీ ప్రయోజనాన్ని చేకూర్చాం.
మిత్రులారా,
ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగా మేం ఇప్పుడు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' కోసం పని చేస్తున్నాం, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, దేశ వనరుల ఫలితాలను అనుకూలపరుస్తుంది. అలాగే 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని నూతన పురోగతి, దేశ అభ్యున్నతి వైపు నడిపిస్తుంది. భారత్ ' ఒక దేశం, ఒకే పౌర స్మృతి '... అంటే లౌకిక పౌరస్మృతి దిశగా పయనిస్తోంది. నేను ఎర్రకోట నుండి ఈ విషయాన్ని ప్రస్తావించాను. దీని సారాంశం సర్దార్ సాహెబ్ చెప్పిన సామాజిక ఐక్యతను సూచిస్తుంది. ఇది వివిధ సామాజిక వర్గాల మధ్య వివక్షను తొలగించడానికీ, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికీ అలాగే దేశాభివృద్ధికి సహాయపడుతుంది. దేశం ఐకమత్యంతో తన లక్ష్యాలను సాధిస్తుంది.
మిత్రులారా,
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' అనే లక్ష్యం నెరవేరినందుకు నేడు దేశం మొత్తం సంతోషిస్తోంది. ఇది సర్దార్ సాహెబ్ ఆత్మ శాంతి కోసం నేను అందించే గొప్ప నివాళి. దేశవ్యాప్తంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 70 ఏళ్లుగా పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే విషయం ప్రజలకు తెలియకపోవచ్చు. నిత్యం రాజ్యాంగం పేరు జపించే వారే దానిని చాలా అవమానించారు... కారణం ఏమై ఉంటుంది? జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్టికల్ 370 దేశ ప్రగతికి అవరోధంగా ఉండి, అక్కడి ప్రజల హక్కులను హరించింది. ఆ ఆర్టికల్ 370 ఇప్పుడు శాశ్వతంగా సమాధి అయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో వివక్ష లేకుండా ఓట్లు పోలయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. ఈ దృశ్యం భారత రాజ్యాంగ నిర్మాతలకు ఎంతో సంతృప్తిని కలిగించి, వారి ఆత్మలకు శాంతి చేకూర్చి ఉంటుంది. ఇది వారికి మా వినయపూర్వక నివాళి. భారత్ ఐక్యతకు ఇది ఒక ముఖ్యమైన, బలమైన నిదర్శమని నేను భావిస్తున్నాను. వేర్పాటువాదుల, ఉగ్రవాదుల మూలనపడిన ఎజెండాను జమ్మూ కాశ్మీర్‌లోని దేశభక్తి గల ప్రజలు తిరస్కరించారు. దశాబ్దాలుగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని పక్కనబెట్టి, తమ ఓట్లతో భారత రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ గెలిపించారు. ఈ జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని దేశభక్తులకు, భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలకు నేను నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
గడిచిన పదేళ్లలో జాతీయ ఐక్యతకు ముప్పుగా ఉన్న అనేక సమస్యలను భారత్ పరిష్కరించింది. భారత్‌కు హాని చేస్తే.. భారత్ వారిని విడిచిపెట్టదని ఈరోజు ఉగ్రవాద సూత్రధారులకు తెలుసు. అనేక సంక్షోభాలు ఉన్న ఈశాన్య ప్రాంతాలను చూడండి. మేం చర్చలు, అభివృద్ధి, విశ్వాసం ద్వారా వేర్పాటువాద అగ్గిని చల్లార్చాం. బోడో ఒప్పందంతో అస్సాంలో 50 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది.. బ్రూ-రియాంగ్ ఒప్పందం వేలాది మంది నిర్వాసితులను దశాబ్దాల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసింది. త్రిపుర నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తో చాలా కాలంగా కొనసాగుతున్న అశాంతికి తెరపడింది. అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు వివాదాన్ని మేం చాలా వరకూ పరిష్కరించాం.
మిత్రులారా,
21వ శతాబ్దపు చరిత్రను లిఖిస్తే.. దానిలో రెండో, మూడో దశాబ్దాల్లో నక్సలిజం అనే భయంకరమైన వ్యాధిని భారత్ నిర్మూలించిన విధానం సువర్ణాధ్యాయంగా ఉంటుంది. నేపాల్‌లోని పశుపతి నుంచి భారత్‌లోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ విస్తరణను గుర్తుంచుకోండి. స్వాతంత్య్ర పోరాటంలో మనకున్న వనరులు అంతంత మాత్రమే అయినా, బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడిన భగవాన్ బిర్సా ముండా లాంటి దేశభక్తులను అందించిన ఆదివాసీ సమాజంలో కొందరు కుట్రలతో నక్సలిజం బీజాలు నాటారు. నక్సలిజం పెరిగిపోయి, భారతదేశ ఐక్యత, సమగ్రతకు పెను సవాలుగా మారింది. పదేళ్ల అలుపెరగని ప్రయత్నాల తర్వాత, ఇప్పుడు భారత్‌లో నక్సలిజం అంపశయ్యపై ఉండడం నాకు సంతృప్తి కలిగించింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభివృద్ధి నేడు నా ఆదివాసీల కుటుంబాలను చేరి మంచి భవిష్యత్తుపై వారిలో ఆశల్ని నింపుతోంది.
మిత్రులారా,
నేడు దూరదృష్టి, దిశ, దృఢ సంకల్పం గల భారతదేశాన్ని మనం చూస్తున్నాం. భారత్ నేడు దూరదృష్టి, దిశ, బలమైన సంకల్పం కలిగి ఉంది. సాధికారత, సమగ్రత, సున్నితత్వం, అప్రమత్తత, వినయంతో భారత్ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు శక్తి, శాంతి- ఈ రెండింటి ప్రాముఖ్యత భారత్‌కు తెలుసు. ప్రపంచ సంక్షోభాల మధ్య, వేగవంతమైన అభివృద్ధిని సాధించడం చిన్న విజయం కాదు. వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్న సమయంలో... అదీ యుద్ధం మధ్యలో... బుద్ధుని సందేశాలను ప్రచారం చేయడం సాధారణ విషయమేం కాదు. వివిధ దేశాల మధ్య సంబంధాల్లో సంక్షోభాలు ఏర్పడినప్పుడు భారత్ ప్రపంచానికే మిత్రదేశంగా వెలుగొందడం చిన్నదేమీ కాదు. దేశాల మధ్య దూరాలు పెరుగుతున్న కొద్దీ, ఆ దేశాలు భారత్‌కు దగ్గరవుతున్నాయి. ఇది అసాధారణం. భారత్ కొత్త చరిత్ర లిఖిస్తోంది. దీన్ని సాధించడానికి భారత్ ఏం చేసింది?
మిత్రులారా,
భారత్ తన సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటుందో నేడు ప్రపంచం చూస్తోంది. దశాబ్దాల నాటి సవాళ్లను అధిగమించేందుకు భారత్ ఎలా ఏకమవుతోందో ప్రపంచం చూస్తోంది... అందుకే... ఈ కీలక సమయంలో మనం మన ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యంగా ముందుకుసాగాలి... మనం చేసిన ఐక్యతా ప్రమాణాన్ని పదే పదే స్మరించుకోవాలి. ప్రమాణానికి కట్టుబడి ఉండాలి, అవసరమైతే, ఆ ప్రమాణం కోసం పోరాడాలి. ప్రతి క్షణాన్ని మనం ఈ ప్రమాణ స్ఫూర్తితో నింపాలి.
మిత్రులారా,
దురాలోచనలు, చెడు మనస్తత్వాలు గల కొన్ని శక్తులు పెరుగుతున్న భారత్ బలాన్ని, దేశంలోని ఐక్యతా భావాలను చూసి చాలా ఇబ్బంది పడుతున్నాయి. భారతదేశం లోపలా, వెలుపలా ఉన్న శక్తులు దేశంలో అస్థిరతనీ, గందరగోళాన్నీ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ శక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు తప్పుడు సందేశాన్ని పంపాలనుకుంటున్నాయి. భారత్ పట్ల ప్రతికూలతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అవి మన సాయుధ దళాలను కూడా లక్ష్యంగా చేసుకుని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వారు సైన్యంలో చీలికలను సృష్టించాలని చూస్తున్నారు. ఈ వ్యక్తులు కులం, వర్గం పేరుతో భారత్‌ను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతీయ సమాజాన్ని, దాని ఐక్యతను బలహీనపరచడమే వారి ఏకైక లక్ష్యం. భారతదేశం అభివృద్ధి చెందాలని వారు ఎప్పుడూ కోరుకోరు. ఎందుకంటే బలహీనమైన భారత్, పేద భారత్ వారి రాజకీయాలకు సరిపోతాయి. అయిదు దశాబ్దాలుగా ఈ నీచమైన, జుగుప్సాకరమైన రాజకీయాలు దేశాన్ని బలహీనపరిచేందుకే ఉపయోగపడ్డాయి. అందువల్ల, వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రస్తావిస్తూనే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తారు. ఈ అర్బన్ నక్సలైట్ల కూటమిని మనం గుర్తించి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కలలు కనేవారినీ, విధ్వంసక ఆలోచనలను కలిగిన వారినీ మనం తెలివిగా ఎదుర్కోవాలి. అడవుల్లో పెరిగి, బాంబులు, తుపాకీలతో గిరిజన యువతను తప్పుదోవ పట్టించిన నక్సలిజం మరుగున పడిపోవడంతో అర్బన్ నక్సలిజం పేరుతో కొత్త మూక ఆవిర్భవించింది.
మిత్రులారా,
నేడు సమైక్యత గురించి మాట్లాడడం కూడా నేరంగా మారే పరిస్థితి ఉంది. పాఠశాలల్లో, కళాశాలల్లో, ఇళ్లలో, బయట మనం సమైక్యత గురించి పాటలు పాడుకునే కాలం ఉండేది. మనం పాడుకున్న... "భారతీయులంతా ఒక్కటే. మన రంగు, రూపం, భాష వేరైనా మనమంతా ఒక్కటే" అంటూ మనం బహిరంగంగా పాడిన పాటలు పెద్దవారికి గుర్తుండే ఉంటాయి. ఈరోజు ఎవరైనా అలాంటి పాట పాడితే వారిని అర్బన్ నక్సల్ గ్రూపు టార్గెట్ చేస్తోంది. ఇంకా ఎవరైనా "ఐక్యత అంటే భద్రత" అని చెబితే, ఈ వ్యక్తులు దానిని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, సమాజాన్ని విభజించాలని కోరుకునే వారు జాతీయ సమైక్యతను చూసి బాధపడతారు. నా తోటి దేశప్రజలారా, ఇలాంటి వ్యక్తులు, ఆలోచనలు, ధోరణులు, వైఖరుల పట్ల మనం గతంలో కంటే మరింత అప్రమత్తంగా ఉండాలి.
మిత్రులారా,
మనం సర్దార్ సాహెబ్ ఆదర్శాలకు అనుగుణంగా జీవిస్తున్నాం. ఐక్యంగా, బలమైన అనుసంధానం గల శక్తిగా మారాలన్నదే భారతదేశపు అతి పెద్ద లక్ష్యంగా ఉండాలని సర్దార్ సాహెబ్ చెప్పేవారు. భారతదేశం వైవిధ్యభరితమైన దేశమని మనం గుర్తుంచుకోవాలి. మనం భిన్నత్వాన్ని ఐకమత్యంతో వేడుకలా జరుపుకోవడం ద్వారానే ఏకత్వం బలపడుతుంది. ఐక్యత కోసం రానున్న 25 ఏళ్లు కీలకం. అందువల్ల, మనం ఈ ఐక్యతా మంత్రాన్ని బలహీనపరచకూడదు. ప్రతి అబద్ధాన్ని ఎదుర్కోవాలి, ఐక్యత మంత్రాన్ని అనుసరించాలి... వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి, 'వికసిత్', 'సమృద్ధి' కలిగిన భారతదేశపు లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ ఐక్యత చాలా అవసరం. ఈ ఐక్యత సామాజిక సామరస్యానికి జీవనాధారం. సామాజిక శాంతికి కీలకం. మనం నిజమైన సామాజిక న్యాయం కోసం అంకితభావంతో ఉంటే, సామాజిక న్యాయమే మన ప్రాధాన్యం అయితే, ఐకమత్యమే ముందు మనకు అవసరం... మనం ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత లేకుండా అభివృద్ధి ముందుకు సాగదు. ఉద్యోగాలు, పెట్టుబడులకు ఐక్యత చాలా అవసరం. ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం. మరోసారి, జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
నేను సర్దార్ సాహెబ్ అన్నప్పుడు మీరంతా – అమర్ రహే... అమర్ రహే! అనండి.
సర్దార్ సాహెబ్ -- అమర్ రహే... అమర్ రహే!
సర్దార్ సాహెబ్ -- అమర్ రహే... అమర్ రహే!
సర్దార్ సాహెబ్ -- అమర్ రహే... అమర్ రహే!
సర్దార్ సాహెబ్ -- అమర్ రహే... అమర్ రహే!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
***
(Release ID: 2070254)
Visitor Counter : 37