వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రైస్ మిల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌సీఐ తీసుకువచ్చిన ఫిర్యాదుల పరిష్కార ప్రధాన మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ
పారదర్శకత్వాన్ని, జవాబుదారుతనాన్ని పెంచి సుపరిపాలనకు దన్నుగా నిలవనున్న ఎఫ్ సీఐ జీఆర్ఎస్ యాప్
ఫిర్యాదుల దాఖలుతో పాటు ఆ ఫిర్యాదుల పరిష్కారం ఏ దశలో ఉందో రైస్ మిల్లర్లు ఇట్టే తెలుసుకోవచ్చు
Posted On:
28 OCT 2024 4:44PM by PIB Hyderabad
ధాన్యాన్ని మరాడించి బియ్యం గా మార్చే గిర్నిల (రైస్ మిల్లు ల) యజమానులకు అండగా నిలిచే ఉద్దేశంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకు వచ్చిన ఓ ఇబ్బందుల పరిష్కార వ్యవస్థ (ఎఫ్‌సీఐ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్.. ఎఫ్ సీఐ జీఆర్ఎస్)కు సంబంధించిన మొబైల్ సేవ (మొబైల్ అప్లికేషన్)ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం - ప్రజా పంపిణీ, నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ న్యూ ఢిల్లీలో ఈ రోజున ప్రారంభించారు. వ్యవస్థలో పారదర్శకత్వాన్ని, జవాబుదారుతనాన్ని, సంబంధిత వర్గాలలో సంతోషాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యలలో ఈ మొబైల్ యాప్ ఒకటి అని చెప్పాలి. ఈ మొబైల్ యాప్ రైస్ మిల్లర్‌లకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రభావాన్విత, పారదర్శక పద్ధతులలో పరిష్కరించడానికి బాటను పరచనుంది. సుపరిపాలనను అందించడానికి సాంకేతిక విజ్ఞాన పాటవాన్ని వినియోగించుకొనే దిశలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో ఒక చర్యే ఈ ఎఫ్‌సీఐ జీఆర్ఎస్ అప్లికేషన్. ఈ మొబైల్ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
డిజిటల్ ఇండియా కార్యక్రమ లక్ష్యాలతో సరిపోలేదిగా రూపొందించిన ఈ యాప్ ఉద్దేశం బియ్యం మిల్లుల యజమానులకు వారి ఫిర్యాదులను సులభమైన పద్ధతిలో దాఖలు చేయడం తో పాటుగా ఆ యా ఫిర్యాదులు పరిష్కార గమ్యస్థానానికి ఇంకా ఎంత దగ్గరగా ఉన్నాయో తెలుసుకొనేందుకు, అలాగే వారి ఫిర్యాదులకు ప్రతిస్పందనలను వారి మొబైల్ ఫోన్ల లోనే అందుకొనేందుకు వీలును కల్పిస్తుంది. ఈ విషయంలో జవాబుదారుతనాన్ని, ప్రతిస్పందన శీలతను మెరుగుపరచాలన్నదే ఈ యాప్ ధ్యేయం. ఈ యాప్ లోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి..:
ఫిర్యాదును దాఖలు చేయడంలో వినియోగదారులకు సౌలభ్యం: మిల్లర్‌లు వారి సమస్యలను సులభతర శైలిలో వారి మొబైల్ ఫోన్‌లోనే నమోదు చేయవచ్చు. అంటే, ఎఫ్‌సీఐ తో సంప్రదించే ప్రక్రియ సరళతరంగా మారిపోయిందన్న మాట. వారు ఒకసారి ఫిర్యాదును నమోదు చేసుకొంటే చాలు, ఎన్ని ఫిర్యాదులను అయినా సరే ఎఫ్‌సీఐ దృష్టికి తీసుకు పోవచ్చు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు విడిగా ఒక ఐడీ అంటూ ఉంటుంది.
ఫిర్యాదు స్థితిని వాస్తవ కాల ప్రాతిపదికన గుర్తించవచ్చు: మిల్లర్‌లు తెలిపిన ఇబ్బందిని పరిష్కరించడానికి సంబంధించిన ప్రక్రియ పురోగతి ఏ స్థితిలో ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు రియల్ - టైమ్ అప్‌డేట్స్ రూపంలో ఈ యాప్ తెలియజేస్తూ ఉంటుంది.
సమస్యను అధికారులకు వెనువెంటనే (ఆటోమేటిక్ గా) అప్పగించడంతో పాటు సత్వర పరిష్కారానికి కూడా వీలు ఉంటుంది: ఫిర్యాదును ఎఫ్‌సీఐ దృష్టికి తీసుకు పోయిన తరువాత తగిన చర్యల కోసం ఆటోమేటిక్ విధానం ద్వారా సంబంధిత నోడల్ అధికారులకు అప్పగించనున్నారు. అంతేకాదు, ఆ సమస్య విషయంలో శీఘ్ర ప్రతి స్పందన బృందం (క్యూఆర్‌టీ) తో గాని, లేదా సంబంధిత డివిజన్ వద్ద నుంచి గాని ప్రతి చర్యను నోడల్ అధికారి తెలుసుకొనే ఏర్పాటు యాప్‌లో ఉంటుంది.
సత్వర ప్రతి స్పందన బృందాల (క్యూఆర్‌టీస్) కోసం జియో-ఫెన్సింగ్: క్యూఆర్‌టీ బృందం సభ్యులు స్థల పరిశీలనను చేపట్టవలసి వస్తే గనక అందుకు యాప్ లోని జియో- ఫెన్సింగ్ సౌకర్యం సావకాశాన్ని కల్పిస్తుంది.
ఇబ్బందుల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టమైందిగా తీర్చిదిద్ది సంబంధిత వర్గాల వారికి సంతోషాన్ని అందించాలని ప్రభుత్వం తీసుకొన్న దృఢసంకల్పాన్ని ఈ కార్యక్రమం బలపరుస్తున్నది. మెరుగైన సేవలను అందిస్తూ, ధాన్యం సేకరణ కార్యకలాపాలను సులభతరంగా చేయాలన్న ఎఫ్‌సీఐ నిబద్ధతకు ఈ యాప్ అద్దం పడుతోంది.
***
(Release ID: 2069250)
Visitor Counter : 38