యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 ఏడాదికి క్రీడా పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Posted On: 24 OCT 2024 6:25PM by PIB Hyderabad

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తిస్తూ ప్రభుత్వం ప్రతీ ఏటా క్రీడా పురస్కారాలను అందజేస్తోంది. ఇందులో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని క్రీడారంగంలో అద్భుతమైన, అత్యుత్తమ పనితీరు కనబరిచిన క్రీడాకారులకు ఇస్తున్నారు. క్రీడల్లో నిలకడ ప్రదర్శించే క్రీడాకారులకు అర్జున పురస్కారాన్ని ఇస్తారు. క్రీడాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన వారికి అర్జున పురస్కారాన్ని(జీవన సాఫల్య) ప్రవేశపెట్టారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడా పోటీల్లో విజేతలుగా  నిలిపిన శిక్షకులను (కోచ్) ద్రోణాచార్య పురస్కారంతో సత్కరిస్తారు. దేశంలో క్రీడల ప్రోత్సాహం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్పొరేట్ సంస్థలు (ప్రభుత్వ/ప్రైవేటు), ప్రభుత్వేతర సంస్థలకు (ఎన్జీఓ) రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని (ఆర్కేపీపీ) అందజేస్తారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దేశంలోని విశ్వవిద్యాలయాలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని అందజేస్తారు.

క్రీడా పురస్కారాల కోసం ఇదివరకు ఉన్న వివిధ పథకాలను హేతుబద్ధీకరించారు. ఇందులో భాగంగా ధ్యాన్ చంద్ పురస్కారం స్థానంలో అర్జున పురస్కారాన్ని (జీవన సాఫల్యం) ప్రవేశపెట్టారు. కిందిస్థాయి లేదా అభివృద్ధి స్థాయిలో శిక్షకుల కృషిని గుర్తించి, వారిని సత్కరించుకునేందుకు ద్రోణాచార్య పురస్కారాలకు వారిని అర్హులుగా చేర్చారు. ఖేలో ఇండియా పథకానికి గుర్తింపుగా ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో అన్ని క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని అందజేయనున్నారు. తాజా పథకాల జాబితాను www.yas.nic.in వెబ్‌సైట్‌ లో  చూడవచ్చు.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది క్రీడా పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2024 సంవత్సరానికి గాను ఈ క్రీడా పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను www.yas.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

వివిధ క్రీడా పురస్కారాల కోసం అర్హులైన క్రీడాకారులు, శిక్షకులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కేవలం పోర్టల్ నుండి మాత్రమే స్వీకరిస్తున్నారు. పురస్కారాల మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులు dbtyas-sports.gov.in పోర్టల్ లో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే, వారు sportsawards-moyas[at]gov[dot]in లేదా 011-23387432 ఫోన్ నంబర్ ( ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పనిదినాలలో) లేదా టోల్ ఫ్రీ నెంబరు 1800-202-5155, 1800-258-5155 (పనిదినాలలో) సంప్రదించవచ్చు. అర్హులైన క్రీడాకారులు, శిక్షకులు, సంస్థలు వారి దరఖాస్తులను dbtyas-sports.gov.in ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 14 నవంబర్ 2024 (గురువారం) రాత్రి 11.59 గంటల్లోగా సమర్పించాలి.  చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

 

***




(Release ID: 2067989) Visitor Counter : 13