కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
‘ఈ- శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్’ను ప్రారంభించిన డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ; అసంఘటిత శ్రామికుల సంక్షేమం దీని ధ్యేయం
ఈ-శ్రమ్ లో నమోదైన అసంఘటిత శ్రామికులకు, విభిన్న సామాజిక భద్రత పథకాలను ఎలాంటి అంతరాయానికి తావీయకుండా ‘ఈ–శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్’ అందిస్తుంది: కేంద్ర మంత్రి
Posted On:
21 OCT 2024 4:44PM by PIB Hyderabad
‘ఈ-శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్’ ను కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ న్యూ ఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభ కరంద్ లాజే, కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ‘ఈ-శ్రమ్’ పోర్టల్ అంటే నమ్మకం రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. ‘‘ప్రతి రోజు దాదాపు అరవై వేల నుంచి తొంభై వేల మంది శ్రామికులు ఈ-శ్రమ్ ప్లాట్‌ఫామ్ లో చేరుతున్నారంటేనే వారు ఈ కార్యక్రమాన్ని ఎంతగా నమ్ముతున్నారో తెలుస్తోంద’’ అని ఆయన అన్నారు. ‘ఈ-శ్రమ్’ లో నమోదైన అసంఘటిత శ్రామికులకు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోనక్కరలేకుండా విభిన్న సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు ‘ఈ-శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్’ అందిస్తుందని ఆయన అన్నారు.
అసంఘటిత శ్రామికులకు నమోదు ప్రక్రియను సరళతరం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల చెంతకు వారు చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడం ‘ఈ-శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్’ ప్రాథమిక ఉద్దేశమని కూడా మంత్రి డాక్టర్ మాండవీయ అన్నారు. ‘‘ప్రభుత్వం ఇవ్వజూపుతున్న అనేక లాభాల దరికి చేర్చే ఒక వంతెన మాదిరిగా ఈ ప్లాట్ ఫామ్ పని చేస్తుంది. దీనికోసం నమోదు ప్రక్రియను మరింత సులభంగాను, పారదర్శకంగాను తీర్చిదిద్దారు’’ అని ఆయన అన్నారు.
‘ఈ-శ్రమ్’ పోర్టల్ లో పేర్లను నమోదు చేసుకొని, వారి మేలు కోసం రూపొందించిన వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని పొందవలసిందిగా అసంఘటిత శ్రామికులందరిని డాక్టర్ మాండవీయ కోరారు. ఈ ప్లాట్ ఫామ్ లో చేరినట్లయితే ప్రభుత్వం ప్రారంభించిన అనేక సామాజిక భద్రత పథకాల విస్తృత లాభాలను అందుకోవడంలో శ్రామికులకు తోడ్పాటు లభిస్తుందని, వారి బతుకుదెరువును మెరుగు పరచి, వారి సంక్షేమానికి పూచీ పడడమే దీని ఉద్దేశమని ఆయన అన్నారు.
సమాజంలో చివరి వ్యక్తికి కూడా ‘ఈ-శ్రమ్’ లబ్ధి దక్కేటట్లుగా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పోర్టల్స్‌ను ‘ఈ-శ్రమ్’తో జత పరచుకోవాలని సహాయ మంత్రి శోభ కరంద్ లాజే నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్రాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో లబ్ధిదారులుగా అర్హత ఉన్న వారు ఇప్పటికీ ఇంకా మిగిలిపోయి ఉన్న పక్షంలో వారిని గుర్తించి, వారు కూడా పథకాల ప్రయోజనాలను అందుకొనేటట్లు తోడ్పడుతుందని ఆమె అన్నారు.
వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, విభాగాల వద్ద ఉన్న సమాచారాన్ని కలిపి సమన్వయం చేసి ఒకే రిపోజిటరీని తీసుకు రానున్నట్లు ఇటీవల బడ్జెటులో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ‘వన్ స్టాప్ సొల్యూషన్’ను రూపొందించారు. కార్మిక- ఉపాధి శాఖ వంద రోజుల కార్యక్రమాల పట్టికలోనూ ఈ ప్రతిపాదనకు స్థానాన్ని కల్పించారు. ‘వన్ నేషన్ - వన్ రేషన్ కార్డ్’, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం, నేషనల్ కెరియర్ సర్వీస్, ‘ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్’ మొదలైన కీలక సంక్షేమ పథకాలను ‘ఈ-శ్రమ్’తో జోడించడంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను కూడా దీనిలో భాగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసంఘటిత శ్రామికుల చెంతకు ప్రభుత్వ వివిధ పథకాలను ఎటువంటి ఆటంకాలకు తావు లేకుండా చేర్చడంలో ‘ఈ-శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్’ సహాయకారి పాత్రను పోషించనుంది అని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత డావ్ రా అన్నారు. వన్ స్టాప్ సొల్యూషన్ తాలూకు ప్రస్తుతం కొనసాగుతున్న కసరత్తు అన్ని సామాజిక భద్రత పథకాలను, సంక్షేమ పథకాలను ఈ-శ్రమ్ పోర్టల్ తో విలీన పరచడాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఆమె తెలిపారు.
ప్రభుత్వ తొలి వంద రోజుల కాలంలో సంబంధిత మంత్రిత్వ శాఖల, విభాగాల సామాజిక సురక్ష, సంక్షేమ పథకాలను ‘ఈ-శ్రమ్’ తో ఏకీకృత పరచడానికి అనేక సమావేశాలను నిర్వహించారు. ఇది అసంఘటిత శ్రామికుల సంక్షేమం కోసం సమస్త ప్రభుత్వం ఒకే తాటి మీదకు వస్తోందనడానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.
‘ఈ-శ్రమ్ పోర్టల్’ను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 26న ప్రారంభించింది. ఈ మూడు సంవత్సరాల్లో ముప్ఫయ్ కోట్ల మందికి పైగా శ్రమికులు వారి పేరులను ‘ఈ-శ్రమ్’లో నమోదు చేయించుకొన్నారు.
***
(Release ID: 2066907)
Visitor Counter : 67