రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబరులో రూ. 1,000 కోట్ల విలువైన అమ్మకాలను సాధించిన ప్రధాన మంత్రి భారతీయ జన్ఔ‌షధి పరియోజన


జన్ ఔషధి కేంద్రాల సంఖ్యలో గత పదేళ్లలో 170 రెట్లకు పైగా వృద్ధి; ప్రస్తుతం 14,000 కు పైగా జన్ ఔషధి కేంద్రాలు దేశంలో దాదాపు అన్ని జిల్లాలకు విస్తరణ

Posted On: 21 OCT 2024 4:46PM by PIB Hyderabad

‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పిఎమ్‌బీజేపీ)’ ఈ ఏడాది అక్టోబరులో రూ. 1,000 కోట్ల విలువైన విక్రయాలను నమోదు చేసి, ఒక ప్రశంసయోగ్య విజయాన్ని సాధించింది.  క్రితం సంవత్సరం ఇదే లక్ష్యాన్ని డిసెంబరులో గానీ చేరుకోలేదు.   నిరుటితో పోలిస్తే ఈసారి చక్కని పురోగతి ఉంది.  తక్కువ ఖర్చులో దొరుకుతున్న, నాణ్యత కలిగిన మందులపై ప్రజలలో విశ్వాసం పెరుగుతుండడం, ఆ మందులు వారికి ఆసరాగా ఉంటున్నాయనడానికి ఈ కార్యసాధన ఒక ముఖ్య సూచికగా ఉంటోంది.  దేశం నలుమూలలా 14,000కు పైగా జన్ ఔషధి కేంద్రాల నుంచి మందులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్న పౌరుల వల్ల ఇది సాధ్యమైంది.  ఆరోగ్య సంరక్షణ సేవలను తక్కువ ఖర్చులో, అందరి అందుబాటులో ఉంచాలని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ( పీఎమ్‌బీఐ) కంకణం కట్టుకొందని ఈ గణనీయ వృద్ధి సూచిస్తున్నది.  కొద్ది రోజుల కిందటే, పీఎమ్‌బీఐ 200 కోట్ల విలువైన మందులను సెప్టెంబర్ నెలలో విక్రయించడం గమనించతగ్గ విషయం.


గత పది సంవత్సరాలలో గమనిస్తే, జన్ ఔషధి కేంద్రాల సంఖ్యలో 170 రెట్లకు పైచిలుకు వృద్ధి ఉంది.  2014లో ఎనభై జన్ ఔషధి కేంద్రాలు ఉంటే, అవి ప్రస్తుతం 14,000కు పైగా ఉన్నాయి. జన్ ఔషధి కేంద్రాలు దేశంలో ఇంచుమించు ప్రతి జిల్లాలో వెలిశాయన్న మాట.

రాబోయే రెండు సంవత్సరాలలో, జన్ ఔషధి కేంద్రాలు 25,000కు చేరుకొనే అవకాశం ఉంది. పీఎమ్‌బీజేపీ లో దొరుకుతున్న మందులను పరిశీలిస్తే 2047 రకాలైన ఔషధాలు, 300 శస్త్రచికిత్స సంబంధిత పరికరాలు ఉన్నట్లు తేలింది.  హృదయనాళికా వ్యాధులతో బాధ పడే వారు వాడవలసిన మందులు, కేన్సర్ వ్యాధిగ్రస్తులకు వాడవలసిందంటూ సూచించిన మందులు, మధుమేహ రోగులకు పనికి వచ్చే మందులు, ఏంటి-ఇన్‌ఫెక్టివ్స్, అలెర్జీ నిరోధక మందులు, ఉదరకోశం-పేగుల రుగ్మతలకు సంబంధించిన మందులు, న్యూట్రస్యూటికల్స్ వగైరా ప్రధాన ఔషధాలు జన్ ఔషధి కేంద్రాలలో దొరుకుతున్నాయి.  ప్రతి రోజు సుమారు పది లక్షల మంది ఈ కేంద్రాలకు వచ్చి, వారికి కావలసిన మందులను కొనుగోలు చేస్తున్నారు.

పీఎమ్‌బీజేపీ కార్యక్రమం వివిధ సముదాయాలకు సాధికారితను కల్పిస్తోంది.  దీంతో మన నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ దేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటోంది.  అమ్మకాలలో నమోదు అవుతున్న సరికొత్త రికార్డులు ఈ కార్యక్రమం సాఫల్యాన్ని ప్రముఖంగా చాటిచెప్పడం ఒక్కటే కాకుండా దేశంలో ఆరోగ్య సమానత్వాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్రను కూడా పోషిస్తున్నాయి.


 

***


(Release ID: 2066895) Visitor Counter : 66