పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఆర్ సీ ఎస్ -ఉడాన్ పథకం కింద అభివృద్ధి చేసిన సహరాన్‌పూర్, రేవా, అంబికాపూర్
విమానాశ్రయాలను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
దేశ ప్రజలకు 8 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆర్ సీ ఎస్ - ఉడాన్ పథకం
ఆర్ సీ ఎస్ - ఉడాన్ పథకం కింద ఇప్పటికే 1.44 కోట్ల మందికి విమానయాన సేవలు
ఇంతవరకూ అందుబాటులోకి వచ్చిన 601 ఉడాన్ విమానయాన మార్గాలు
ప్రాంతీయ విమానయాన సౌకర్యాన్ని ప్రోత్సహించే ఎన్ సీ ఏ పి 2016లో కీలక అంశంగా ఆర్ సీ ఎస్
Posted On:
20 OCT 2024 6:17PM by PIB Hyderabad
ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (ఆర్ సీ ఎస్ )- యుడీఏఎన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద అభివృద్ధి చేసిన మూడు విమానాశ్రయాలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇవి మధ్యప్రదేశ్‌లోని రేవా, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ విమానాశ్రయాలు. త్వరలో వీటినుండి విమానయాన సేవలు మొదలవుతాయి.
భారతదేశంలో మౌలిక సదుపాయాలను, కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వ సహకారంతో మొదలైన కార్యక్రమమే ఆర్ సీ ఎస్ -ఉడాన్. ముఖ్యంగా మారుమూల, వెనుకబడిన ప్రాంతాలకు విమాన ప్రయాణ సేవల కోసం దీన్ని రూపొందించారు. ఈ పథకం ఏడేళ్లుగా అమలులో ఉంది. భారత జాతీయ పౌర విమానయాన విధానం (ఎన్ సీ ఏపీ) 2016లో ఈ పథకం కీలక అంశం. 10 సంవత్సరాల దార్శనికతను దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 21, 2016న ఈ పథకాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రారంభించింది.
ఆర్ సీ ఎస్ - ఉడాన్ పథకం కింద ఏప్రిల్ 27, 2017న మొదటి విమానాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది సిమ్లా నుండి ఢిల్లీకి ప్రయాణించింది. విమాన ప్రయాణ సేవలు లేని ప్రాంతాలలో విమానయాన మార్గాలను ఏర్పాటు చేయడం, బలోపేతం చేయడంపైన ఈ పథకం దృష్టి పెట్టింది. తద్వారా సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తోంది.
ఇప్పటివరకు, ఆరసీ ఎస్ - ఉడాన్ పథకాన్ని ఉపయోగించుకొని 144 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇది విమాన ప్రయాణ అందుబాటును పెంపొందించడంలో ఈ పథకం సాధించిన విజయంగా భావించాలి.
గత ఏడేళ్లలో ఉడాన్ పథకానికి సంబంధించిన పురోగతి ఈ విధంగా ఉంది.
ఉడాన్ 1.0: అయిదు ఎయిర్‌లైన్స్ కంపెనీలకు 70 విమానాశ్రయాలకు సంబంధించి 128 విమాన మార్గాలను కేటాయించారు (కొత్తగా అందుబాటులోకి వచ్చిన 36 విమానాశ్రయాలతో సహా).
ఉడాన్ 2.0: తక్కువ సేవలందించిన, అసలు సేవలందించని మొత్తం 73 విమానాశ్రయాల పేర్లను ప్రకటించారు. మొదటిసారిగా హెలిప్యాడ్‌లను కూడా అనుసంధానించారు.
ఉడాన్ 3.0: పర్యాటక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, పర్యాటక మార్గాలను ఈ పథకం కింద చేర్చారు. వాటర్ ఏరోడ్రోమ్‌లను అనుసంధానించడానికి ప్రవేశపెట్టిన సీప్లేన్‌లతో పాటు, ఈశాన్య ప్రాంతంలోని అనేక మార్గాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చారు.
ఉడాన్ 4.0: ఈశాన్య ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, దీవులకు విమానయానం పెరిగేలా ప్రోత్సాహాన్ని అందించింది. హెలికాప్టర్లు , సీప్లేన్ల నిర్వహణను ఏకీకరించారు.
ఉడాన్ 5లో వివిధ వర్షన్లు - 5.0, 5.1, 5.2, 5.3 , 5.4
నాలుగు వర్షన్లు విజయం సాధించిన తరువాత, వాటాదారుల అభిప్రాయం ఆధారంగా నూతన అంశాలను చేర్చి ఆర్ సీ ఎస్ - ఉడాన్ 5వ వెర్షన్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
ఉడాన్ 5.0లో కేటగిరీ-2 (20-80 సీట్లు) , కేటగిరీ-3 (80 కంటే ఎక్కువ సీట్లు) విమానయాన సేవలపై దృష్టి సారించారు. అదేవిధంగా, 600 కి.మీ పరిమితిని తొలగించారు. ప్రయాణ ప్రారంభ విమానాశ్రయానికి, గమ్యస్థాన విమానాశ్రయానికి మధ్య దూరంపై ఎటువంటి పరిమితి లేదు. కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్న లేదా త్వరలో అందుబాటులోకి వచ్చే విమానాశ్రయాలను అనుసంధానించే మార్గాలకు అయిదో వెర్షన్లో ప్రాధాన్యతనిచ్చారు. దాంతో అప్పటికే కేటాయించిన మార్గాలలో వెంటనే విమానయాన సేవలకు మార్గం సుగమం అయింది. పర్యవసానంగా, ఆయా ఎయిర్‌లైన్ సంస్థలు తమకు కేటాయించిన మార్గాలలో 4 నెలల్లోపు కార్యకలాపాలను ప్రారంభించవలసి ఉంటుంది. తమ కార్యకలాపాలను మరింత మెరుగ్గా రూపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి వారు ఈ మార్పును స్వాగతిస్తున్నారు.
దీని తర్వాత ఉడాన్ 5.1 వర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్ సీ ఎస్ -ఉడాన్ కు సంబందించిన ఈ వెర్షన్ ను హెలికాప్టర్ మార్గాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. హెలికాప్టర్ నిర్వాహకుల కోసం కార్యకలాపాల పరిధిని పెంచారు. వీజీ ఎఫ్ ను పెంచారు. విమానయాన రేట్ల పరమితులను తగ్గించారు. ఈ పథకం కింద కనీసం ఒక ప్రయాణ ప్రారంభ విమానాశ్రయం లేదా గమ్యస్థాన విమానాశ్రయం ప్రాధాన్యతా ప్రాంతంలో ఉంటుంది. హెలికాప్టర్ ప్రయాణానికి సంబంధించి ప్రారంభంలోగానీ, గమ్యస్థానంగానీ ఒక హెలిపోర్ట్ ఉంటే విమానయాన కనెక్టివిటీ పెరుగుతుంది. నిర్వాహకులకు లాభదాయకంగా ఉండేలా వీజీఎఫ్ పరిమితులను సరళీకరించారు. ప్రయాణికులకు విమానయానమనేది సరసమైన రేట్లకు లభించేలా ఛార్జీల పరిమితులను తగ్గించారు.
దీని తరువాత, దేశంలోని మారుమూల, ప్రాంతీయ ప్రాంతాలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి, సాధించడానికిగాను చిన్న విమానాల (20 సీట్ల లోపు) ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉడాన్ 5.2 అమల్లోకి వచ్చింది. చిన్న విమానాల నిర్వాహకులకు ప్రయోజనకరంగా వుండేలా ఈ పథకాన్ని తయారు చేశారు. ఏ త్రైమాసికంలోనైనా వార్షికంగా కోట్ చేసిన ఆర్‌సీ ఎస్ సీట్లలో గరిష్టంగా 40 శాతం కనిష్టంగా 10 శాతం సీట్లను ఆపరేట్ చేయడానికి అనుమతించారు..
కాలం పూర్తికాకముందే నిలిపివేసిన లేదా బహుళ కారణాల వల్ల రద్దయిన లేదా తొలగించిన విమానమార్గాలను నిర్వహించడానికిగాను ప్రత్యేక బిడ్డింగ్ ను వివిధ దశలుగా కేంద్ర విమానయానశాఖ ప్రారంభించింది. గతంలో గుర్తించిన మార్గాల్లో పాయింట్-టు-పాయింట్ ఎయిర్ కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికిగాను, ఉడాన్ 5.3, ఉడాన్ 5.4 కింద అన్ని వర్గాల ఎయిర్‌లైన్ ఆపరేటర్ల బిడ్ల ద్వారా ఆహ్వానించారు. పర్యవసానంగా ఉడాన్ 5.3ని జనవరి 2024లో ప్రారంబించారు. ఉడాన్ 5.4 రాబోతున్నది.
విమానయాన పరిశ్రమ వృద్ధికి అండదండలు
ఆర్ సీ ఎస్ - ఉడాన్ కింద గత ఏడేళ్లలో అనేక కొత్తవి, విజయం సాధించిన విమానయాన సంస్థలు వచ్చాయి. అవి పౌర విమానయాన పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ పథకం స్థిరమైన వ్యాపార నమూనాను ప్రారంభించడానికి, అభివృద్ధి చేయడానికిగాను ఎయిర్‌లైన్ ఆపరేటర్లకు సహాయపడింది. అంతే కాకుండా ఈ పథకం చిన్న ప్రాంతీయ విమానయాన సంస్థలైన ఫ్లై బిగ్, స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై 91 సంస్థలు వారి వ్యాపారాలను మెరుగుపరుచుకోవడానికి వీలుగా అవకాశాలను అందిస్తోంది. ఎయిర్ లైన్ వ్యాపారరంగంలో అనుకూలమైన వ్యవస్థ ఏర్పడిందనడానికి ఆయా సంస్థలు సాధిస్తున్న విజయాలే నిదర్శనం.
అన్ని పరిమాణాల్లో నూతన విమానాల కోసం డిమాండ్
ఈ పథకం విస్తరించేకొద్దీ కొత్త విమానాలకు డిమాండు కూడా పెరుగుతోంది. అంతే కాకుండా అప్పటివరకూ వున్న విమానాల వ్యాపార విస్తృతి కూడా పెరుగుతోంది. ఈ పెరుగుదల విమానాల సమగ్ర శ్రేణికి కారణమైంది. హెలికాప్టర్లు, సీప్లేన్లు, 3-సీట్ ప్రొపెల్లర్ విమానాలు, జెట్ విమానాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం, ఎయిర్‌బస్ 320/321, బోయింగ్ 737, ఏటీఆర్ 42, 72, డిహెచ్ సీ క్యూ400, ట్విన్ ఓటర్, ఎంబ్రేయర్ 145, 175, టెక్నామ్ పీ2006టి, సెస్నా 208బి గ్రాండ్ కారవాన్ ఈఎక్స్, డార్నియర్ 228, ఎయిర్‌బస్ హెచ్ 130, బెల్ 407 మొదలైన విమానాలు ఆయా ఆర్ సీ ఎస్ మార్గాలలో నిత్యం సేవలందిస్తున్నాయి. నూతన విమానాల కోసం భారతదేశ విమానయాన సంస్థలు ఇచ్చిన ఆర్డర్లను చూస్తే దేశంలో నూతన విమానాల కోసం డిమాండు పెరిగిందనే విషయం తెలుస్తోంది. రాబోయే 10-15 సంవత్సరాలలో 1,000 కి పైగా కొత్త విమానాలు రాబోతున్నాయి. ప్రస్తుతం దేశంలో వివిధ విమాన యాన సంస్థలు సుమారు 800 విమానాలను నడుపుతున్నాయి. ఈ సంఖ్యతో పోలిస్తే రాబోయే సంవత్సరాలలో విమానాల సంఖ్య గణనీయంగా పెరగబోతున్నది.
పర్యాటకరంగానికి ప్రోత్సాహం
ఆర్ సీ ఎస్ - ఉడాన్ పథకం అనేది టైర్-2 , టైర్-3 నగరాలకు విమానయాన సేవలను అందించడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా దోహదం చేస్తుంది. ఉడాన్ 3.0 కింద ఈశాన్య ప్రాంతంలోని అనేక గమ్యస్థానాలను కలుపుతూ పర్యాటక మార్గాలను ప్రకటించారు. ఉడాన్ 5.1 అనేది పర్యాటకం, ఆతిథ్య రంగాలను, స్థానిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి , కొండ ప్రాంతాలలో హెలికాప్టర్ సేవలను విస్తరించడానికి ఉద్దేశించిది.
ఈ కార్యక్రమం ఖజురహో, దియోఘర్, అమృత్సర్, కిషన్‌గఢ్ (అజ్మీర్) వంటి గమ్యస్థానాలను విజయవంతంగా కలిపింది. ఈ పర్యాటక కేంద్రాలు ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో కీలకంగా ఉన్నాయి.. పాసిఘాట్, జిరో, హోలోంగి, తేజు విమానాశ్రయాల కారణంగా మొత్తం ఈశాన్య ప్రాంత పర్యాటక పరిశ్రమ గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఆయా ప్రాంతాలకు ప్రయాణం సులభతరమైంది. ఈ పథకం భారతీయ విమానయాన పటంలోకి అగట్టి ద్వీపాన్ని తీసుకురావడం ద్వారా మరో ముఖ్యమైన విషయం. లక్షద్వీప్ లో పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేసింది.
ఎయిర్ కనెక్టివిటీ బలోపేతం
ముంద్రా (గుజరాత్) నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు వరకు, హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుండి తమిళనాడులోని సేలం వరకు, దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆర్ సీఎస్ - ఉడాన్ ద్వారా కనెక్ట్ చేశారు. ఉడాన్ కింద మొత్తం 86 ఏరోడ్రోమ్‌లు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో రెండు హెలిపోర్ట్‌లతో పాటు పది విమానాశ్రయాలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఉడాన్ కింద పని చేస్తున్న దర్భంగా, ప్రయాగ్‌రాజ్, హుబ్లీ, బెల్గాం, కన్నూర్ మొదలైన అనేక విమానాశ్రయాలను ఆర్ సీ ఎస్ కిందకురాని వాణిజ్య విమానాలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. కాబట్టి అవి నేడో రేపో ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి.
***
(Release ID: 2066666)
Visitor Counter : 35