రైల్వే మంత్రిత్వ శాఖ
బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్ లో పాల్గొననున్న రైల్వే రక్షక దళం
Posted On:
19 OCT 2024 3:23PM by PIB Hyderabad
2024 అక్టోబర్ 20 న వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్ లో పాల్గొంటున్నట్లు రైల్వే రక్షక దళం (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్- ఆర్పీఎఫ్) ప్రకటించింది. రైల్వే ద్వారా... పిల్లల అక్రమ రవాణా నిరోధక చర్యలపై అవగాహన పెంచడానికి ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనోజ్ యాదవ నేతృత్వంలో 26 మంది ఆర్ పి ఎఫ్ సభ్యుల బృందం హాఫ్ మారథాన్ లో పాల్గొంటుంది.
పిల్లల అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకున్న చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ ముప్పుపై పోరాటంలో భాగస్వాములు కావాలని పౌరులకు విజ్ఞప్తి చేయడం, ఈ మారథాన్ ప్రధాన ఉద్దేశం. “మన లక్ష్యం: రైళ్లలో పిల్లల అక్రమ రవాణాను నిరోధించాలి” అనే నినాదంతో, పిల్లలను దోపిడీ, వేధింపుల నుండి రక్షించడానికి సకాలంలో, సమష్టి చర్యల అవసరాన్ని, ఆవశ్యకతను చాటి చెప్పేందుకు రైల్వే రక్షక దళం కృషి చేస్తోంది.
ఈ ఉదాత్త లక్ష్యం పట్ల ఆర్పీఎఫ్ సామర్ధ్యం, ఐక్యత, నిబద్ధతకు నిదర్శనంగా ఈ పరుగు కార్యక్రమంలో టీమ్ సభ్యులందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా ప్రోత్సహించడానికి, పరుగులో పాల్గొనే వారిని ఉత్సాహ పరచడానికి ఆర్పీఎఫ్... రైల్ భవన్ సమీపంలో పరుగు నిర్వహించే మార్గం వెంబడి ఆర్పీఎఫ్ బ్యాండ్ తన ప్రదర్శనను ఇస్తుంది.
***
(Release ID: 2066424)
Visitor Counter : 52