సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

‘ఖాదీ మహోత్సవ్’లో భాగంగా ఐఎన్ఏ ఢిల్లీ హాత్‌లో ప్రారంభమైన ప్రత్యేక ఖాదీ ప్రదర్శన


కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్‌తో కలిసి ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రి శ్రీ జీతన్ రామ్ మాంఝీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'వోకల్ ఫర్ లోకల్', 'ఆత్మనిర్భర్ భారత్' (స్వీయ-సమృద్ధి భారత్) కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పండుగ సందర్భంగా ఏర్పాటైన ప్రదర్శన.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఖాదీ సంస్థలు, గ్రామస్థాయి పరిశ్రమల నుంచి 157 స్టాళ్ల ఏర్పాటు.

ఈనెల 31వరకు కొనసాగనున్న ప్రదర్శన.

ఖాదీ ప్రదర్శనను సందర్శించి ఖాదీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఢిల్లీ ప్రజలను కోరిన కేంద్రమంత్రి శ్రీ జీతన్ రామ్ మాంఝీ

Posted On: 19 OCT 2024 9:14AM by PIB Hyderabad

ఐఎన్ఏ ఢిల్లీ హాత్‌లో ఈరోజు ప్రత్యేక ఖాదీ ప్రదర్శనను కేంద్ర ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రి శ్రీ జీతన్ రామ్ మాంఝీ ప్రారంభించారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్‌తో కలిసి ఆయన ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన 'వోకల్ ఫర్ లోకల్', ‘ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, నేతన్నల ఆదాయాన్ని పెంచడం కోసం దేశవ్యాప్త 'ఖాదీ మహోత్సవ్'లో భాగంగా పండుగ సీజన్‌ సందర్భంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని కేవీఐసీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించే ఈ ప్రత్యేక ఖాదీ ప్రదర్శన ఈనెల 31 వరకు కొనసాగనుంది.

ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, మధ్య ప్రదేశ్, బెంగాల్, హర్యానా, జమ్మూతో సహా వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 55 ఖాదీ సంస్థలు, 102 గ్రామీణ పరిశ్రమల యూనిట్ల ఆధ్వర్యంలో 157 స్టాళ్లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. చీరలు, రెడీమేడ్ దుస్తులు, హస్తకళా ఉత్పత్తులు, మూలికలు, ఆయుర్వేద ఉత్పత్తులు, తోలు వస్తువులు, చేతితో తయారు చేసిన కాగితం ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా దినుసులు, సబ్బులు, షాంపూలు, తేనె సహా అనేక రకాల ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న కళాకారులు, హస్తకళా నిపుణులు వారి విభిన్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను గురించి ప్రత్యక్షంగా వివరించనున్నారు.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రి శ్రీ జీతన్ రామ్ మాంఝీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ... ఖాదీ, స్థానికంగా తయారైన ఉత్పత్తులను ప్రజలు విరివిగా కొనుగోలు చేయాలని కోరారు. ఢిల్లీ ప్రజలు తమ పండుగ షాపింగ్ కోసం ఈ ఖాదీ ప్రదర్శనను సందర్శించి, స్వదేశీ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. తద్వారా ప్రధాని దార్శనికతకు అనుగుణంగా 'వోకల్ ఫర్ లోకల్', 'ఆత్మనిర్భర్ భారత్' (స్వీయ-సమృద్ధ భారత్) కార్యక్రమాలకు మద్దతునివ్వాలని అభ్యర్థించారు. గ్రామీణ కళాకారులు, సంప్రదాయ హస్తకళా నిపుణుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, వారికి సాధికారత కల్పించడం అలాగే స్వదేశీ హస్తకళా వారసత్వాన్ని సంరక్షించడం ఈ ప్రదర్శన విస్తృత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని కళాకారులు తమ కళలను ప్రదర్శించేందుకు అద్భుతమైన వేదికగా ఈ ప్రదర్శనను కేంద్ర మంత్రి అభివర్ణించారు.

కేవీఐసీ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ _"మహాత్మా గాంధీ దార్శనిక విధానాన్ని అనుసరిస్తూ "న్యూ ఖాదీ ఫర్ ఎ న్యూ ఇండియా (నూతన భారత్ కోసం నూతన ఖాదీ)" అని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ, గ్రామ పరిశ్రమల రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.55 లక్షల కోట్ల టర్నోవర్‌ను అధిగమించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా నేతన్నలకు నేరుగా ప్రయోజనం చేకూరింది. ఇటీవలే గాంధీ జయంతి రోజున చరఖాపై పనిచేసే కార్మికుల వేతనాలు 25 శాతం, మగ్గంపై పని చేసే నేత కార్మికుల వేతనాలు 7 శాతం పెరగడం దీనికి నిదర్శనం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రముఖ కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా 'భారత్‌లో తయారైన' ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో, గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీ వాసులు స్థానిక 'ఖాదీ గ్రామోద్యోగ్ భవన్'లో ఒకే రోజు రూ. 2 కోట్ల 1 లక్షా 37 వేల విలువైన ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విజయం 'వోకల్ ఫర్ లోకల్', 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాల పట్ల ప్రజల నిబద్ధతకు నిదర్శనం." అన్నారు.

సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని అందించడం కోసం, దేశంలోని గొప్ప సంప్రదాయ కళలు, నైపుణ్యాలను, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించే ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, గ్రామీణ కళాకారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించడం కోసం, మన దేశ హస్తకళల పరిరక్షణ కోసం దోహదపడే ఒక మంచి వేదిక కూడా.

ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ, కేవీఐసీల నుంచి అధికారులు, ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 2066423) Visitor Counter : 7