హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో 2023 బ్యాచ్ (76 ఆర్ఆర్) ఐపీఎస్ ప్రొబేషనర్లతో సంభాషించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
2047లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో
ఉగ్రవాద రహిత, మాదకద్రవ్యాల రహిత వికసిత్ భారత్
బలమైన అంతర్గత భద్రత, మానవ హక్కులు, పౌర హక్కుల పరిరక్షణకు భరోసా
జమ్మూ కాశ్మీర్, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు,
ఈశాన్య ప్రాంతాల్లో హింసను తగ్గించి పూర్తి ఆధిపత్యం సాధించిన భద్రతా సంస్థలు
అధికారులంతా దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించాలి
సకాలంలో న్యాయం, నేర నిర్ధారణకు తగిన సాక్ష్యం,
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని మూడు క్రిమినల్ చట్టాల్లో పొందుపరిచాం
పౌరుల భద్రతే దేశ భద్రతకు ఆధారం
పౌరుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ కోసం యువ పోలీసు అధికారులు కృషి చేయాలి
పేదలు, పిల్లలు, మహిళల హక్కుల రక్షణ అత్యంత ముఖ్యంకావాలి
జిల్లా నుంచి బదిలీ అయిన తర్వాత కూడా మీ మంచి పనులను
ప్రజలు గుర్తు చేసుకుంటే అదే అతిపెద్ద పతకం
Posted On:
15 OCT 2024 8:17PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో 2023 బ్యాచ్ (76 ఆర్ఆర్) ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్లతో సంభాషించారు. ఈ సందర్భంగా, ట్రైనీ ఐపీఎస్ అధికారులు తమ శిక్షణకు సంబంధించిన అనుభవాలను కేంద్ర హోంమంత్రితో పంచుకున్నారు. కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం సహకార మంత్రి మాట్లాడుతూ 2047లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ ఉగ్రవాద రహిత, మాదకద్రవ్యాల రహిత దేశంగా మారుతుందని, దేశ అంతర్గత భద్రత పూర్తి బలోపేతం అవుతుందన్నారు. మానవ హక్కులు, పౌరుల హక్కుల పరిరక్షణకు పూర్తి భరోసా ఉంటుందని పేర్కొన్నారు. ఐపీఎస్ కావాలని ఎందుకు అనుకున్నదీ గుర్తుంచుకుని, అందుకు అనుగుణంగా ట్రైనీ ఐపీఎస్ అధికారులు బాగా పనిచేయాలని అమిత్ షా సూచించారు. గత 75 బ్యాచ్‌ల కంటే ఈసారి ఐపీఎస్‌లుగా బాధ్యతలు చేపట్టనున్న బ్యాచ్‌పై మరింత పెద్ద బాధ్యత ఉంటుందని ట్రైనీ అధికారులు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుత స్థాయిని మెరుగుపర్చుకుని మన దేశం తదుపరి తరం పోలీసింగ్‌లోకి ప్రవేశిస్తుందా లేదా అనేది పూర్తిగా వారి చేతుల్లో, వారి తర్వాత వచ్చే బ్యాచ్‌ల చేతుల్లోనే ఉందని ట్రైనీ అధికారులు గుర్తించాలని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
మన సరిహద్దులను, మన సైన్యాన్ని అవమానించే ధైర్యం ఇప్పుడు ఎవరికీ లేదని దేశ హోం మంత్రిగా తాను కచ్చితంగా చెప్పగలనని శ్రీ అమిత్ షా అన్నారు. మన సరిహద్దులకు పటిష్టమైన భద్రత కల్పించేందుకు చాలా కృషి చేశామని, ఇంకా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలనే మూడు పుండ్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఈ మూడు ప్రదేశాలలో హింసను 70 శాతం తగ్గించడంలో విజయం సాధించామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఈ మూడు సమస్యాత్మక ప్రాంతాల్లో నేడు భారత భద్రతా సంస్థలు పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఇప్పుడు మార్పు కోసం డిమాండ్లు, ఆకాంక్షలు రెండింటినీ చేసే సంస్కృతి పూర్తిగా తగ్గిపోయిందని, దీని కారణంగా గతంలోలాగా పెద్దఎత్తున నిరసనలు ఇప్పుడు లేవని శ్రీ అమిత్ షా తెలిపారు.
మన పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు పోలీసు వ్యవస్థ ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందనీ, దేశ సరిహద్దుల్లో జరుగుతున్న నేరాలను తగ్గించేందుకు పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి సూచించారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పౌరులకు న్యాయం అందించాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఈరోజు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ద్వారా దేశంలోని 99శాతానికి పైగా పోలీస్ స్టేషన్‌లు ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆన్‌లైన్ డేటా సైతం రూపొందించామనీ, మూడు కొత్త చట్టాల ద్వారా అనేక నిబంధనల్లో సమూల మార్పులు చేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. సకాలంలో న్యాయం అందించడం, నేర నిరూపణకు అవకాశం, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించడం వంటి వాటికి కొత్త చట్టాల్లో ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. శాస్త్రీయ సాక్ష్యాలను తప్పనిసరి చేసినందున, ప్రాసిక్యూషన్ బహుళ సాక్షులను సమర్పించాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు శాస్త్రీయ ఆధారాల ఆధారంగానే నేరాన్ని రుజువు చేయవచ్చని పేర్కొన్నారు.
కొత్త చట్టాల్లో న్యాయ ప్రక్రియను కాలపరిమితితో రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో సాంకేతికత, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, శిక్షణతో సహా దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో కొత్త చట్టాలు పూర్తిగా అమలు అవుతాయన్నారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదైన మూడేళ్లలో న్యాయ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కొత్త చట్టాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచామనీ, రానున్న 100 ఏళ్లలో సాంకేతికతలో వచ్చే మార్పులనూ దృష్టిలో ఉంచుకుని ఈ చట్టాలను రూపొందించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ఇ-సమన్లకు ఉదాహరణ ఇస్తూ.. రాబోయే 100 ఏళ్ల సాంకేతికతను ఇందులో పొందుపరిచేలా నిబంధనలు తెచ్చామని, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కోసం నిబంధనలు రూపొందించామనీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) తప్పనిసరి చేశామన్నారు. ఒక అధికారి తన విధుల విషయంలో రాజీపడినా, శాస్త్రీయ ఆధారాల కారణంగా అతను న్యాయస్థానం ముందు ఏమీ చేయలేనందున ఎవరూ ఎవరికీ అనుకూలంగా వ్యవహరించలేరని పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక నేరుగా న్యాయస్థానానికి చేరుతుందని, దానికి సంబంధించిన ఒక కాపీ పోలీసుల నుంచి కూడా వస్తుందని తెలిపారు.
మూడు కొత్త చట్టాలలో పౌరుల హక్కుల భద్రతకు ప్రాధాన్యమిచ్చినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల సంఖ్యను ఆన్‌లైన్‌లో ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఛార్జిషీట్‌ను 90 రోజుల్లోగా దాఖలు చేయాలనీ, సోదాలు, జప్తుల దృశ్యాలను వీడియో తీయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఎన్ఏఎఫ్ఐఎస్)పై వేలిముద్రల డేటాతో పాటు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల డేటాను విడిగా రూపొందించినట్లు తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సైతం సీసీటీఎన్ఎస్ డేటా మొత్తాన్ని మరో విధంగా నిర్వహిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో డేటా బ్యాంక్‌ను రూపొందించే పని జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు నేరాల విశ్లేషణకు సహాయపడే సాఫ్ట్‌వేర్‌ను కృత్రిమ మేధ సాయంతో రూపొందించి మీ పనిని మరింత సులభతరం చేయడానికి హోం మంత్రిత్వ శాఖ బృందం కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
దేశ భద్రత అంటే సరిహద్దు భద్రత మాత్రమే కాదని కేంద్ర హోంమంత్రి అన్నారు. దేశం దాని పౌరులతో నిర్మితమైందనీ, పౌరుల భద్రతే దేశ భద్రతకు ఆధారం అవుతుందని పేర్కొన్నారు. తాను భద్రత గురించి మాట్లాడేటప్పుడు అది ప్రాణ, ఆస్తుల భద్రతే కాదనీ, మన రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల భద్రత కూడా ఇందులోకి వస్తుందన్నారు. రాజ్యాంగంలో దేశ ప్రధానితో సమానంగా పేదలకు హక్కులున్నాయనీ, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపైనే ఉంటుందని శ్రీ అమిత్ షా తెలిపారు.
75 ఏళ్ల తరువాత, మన ప్రధాన బాధ్యతపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పుడు పౌర హక్కులను పరిరక్షించడానికి, వారిపై అఘాయిత్యాలను నివారించడానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పేదలు, పిల్లలు, మహిళల హక్కులను పరిరక్షించడం ప్రధానమని కేంద్ర హోంమంత్రి తెలిపారు.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రోబేషనర్లతో మాట్లాడుతూ మెరుగుపరచలేని పని ఏదీ లేదనీ, అలాగే తక్కువ ప్రాధాన్యం గల పని సైతం ఏదీ లేదన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే జీవితంలో నిరాశకు దూరంగా ఉండవచ్చన్నారు. జిల్లా స్థాయిలో పని చేస్తున్నపుడు చేసిన మంచి పనులకు ప్రజలు నుంచి లభించే అభిమానానికి మించిన పతకం ఏదీ ఉండదని, చిన్న వయస్సులోనే ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన పోలీసు అధికారికి ఇది ఓ గొప్ప అనుభవంగా గుర్తుండిపోతుందన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించేందుకు యువ అధికారులంతా శక్తివంచనలేకుండా పని చేయాలని శ్రీ అమిత్ షా సూచించారు. పోలీసుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో దేశ భద్రత ఎల్లప్పుడూ మన మనస్సులో ఉండాలనీ, దేశ రక్షణ కోసం సదా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి సూచించారు.
***
(Release ID: 2065193)
Visitor Counter : 36