ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ విద్యుత్ (ప్రసార) ప్రణాళికను ప్రారంభించిన విద్యుత్-గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖల మంత్రి మనోహర్ లాల్

Posted On: 14 OCT 2024 6:10PM by PIB Hyderabad

   కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) రూపొందించిన జాతీయ విద్యుత్ (ప్రసార) ప్రణాళికను విద్యుత్-గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖల మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించారు. దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం-ప్రసారం సాధించడంతోపాటు 2032 నాటికి దీన్ని 600 గిగావాట్లకు పెంచడం లక్ష్యంగా వివిధ భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపుల అనంతరం ‘సిఇఎ’ ఈ సమగ్ర జాతీయ ప్రణాళికను రూపొందించింది. న్యూఢిల్లీలో ‘సిఇఎ’ రెండు రోజులపాటు (14-15 తేదీల్లో) నిర్వహిస్తున్న మేధా మథన సదస్సులో భాగంగా పలువురు ప్రముఖల సమక్షంలో కేంద్ర మంత్రి ఇవాళ ఈ ప్రణాళికను ప్రారంభించారు.

   ఈ ప్రణాళిక రూపకల్పనలో పునరుత్పాదక విద్యుదుత్పాదనతోపాటు  47 గిగావాట్ల విద్యుత్ స్టోరేజీ బ్యాటరీ వ్యవస్థల అవసరాన్ని, 31 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటును కూడా ‘సిఇఎ’ పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా ముంద్రా, కాండ్లా, గోపాల్‌పూర్, పరదీప్, టుటికోరిన్, విశాఖపట్నం, మంగళూరు వంటి తీర ప్రాంతాల్లో గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిమిత్తం ప్రసార వ్యవస్థను కూడా ఇందులో చేర్చింది.

   దేశవ్యాప్తంగా 2022-23 నుంచి 2031-32 వరకు (220 కె.వి. అంతకుమించి వోల్టేజ్ స్థాయివద్ద) పదేళ్ల కాలంలో 1,91,000 సర్క్యూట్ కిలోమీటర్ల (సికెఎం) విద్యుత్ ప్రసార లైన్ల నిర్మాణాన్ని ఈ జాతీయ ప్రణాళిక నిర్దేశించుకుంది. అలాగే 1270 ‘జివిఎ’ మార్పిడి సామర్థ్యం జోడించాలని కూడా నిశ్చయించింది. మరోవైపు 33 గిగావాట్ల ‘హెచ్‌విడిసి’ బై-పోల్ లింక్‌లను  కూడా ప్రణాళికలో చేర్చింది. అతంతేగాక అంతర-ప్రాంతీయ ప్రసార సామర్థ్యాన్ని ప్రస్తుత 119 గిగావాట్ల నుంచి 2027కల్లా 143 గిగావాట్లకు, 2032 నాటికి 168 గిగావాట్లకు పెంచాలని కూడా నిర్ణయించింది.

   నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో సరిహద్దుల నడుమ అనుసంధానంతోపాటు సౌదీ అరేబియా, ‘యుఎఇ’ తదితర దేశాలతో అంతర-కనెక్షన్లు కూడా ఈ జాతీయ ప్రసార ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

   విద్యుత్ ప్రసార రంగంలో కొత్త సాంకేతికతలు సహా నైపుణ్యాభివృద్ధి అంశంపైనా జాతీయ ప్రణాళిక దృష్టి సారించింది. ఈ మేరకు హైబ్రిడ్ సబ్‌-స్టేషన్లు, మోనోపోల్ స్ట్రక్చర్లు, ఇన్సులేటెడ్ క్రాస్ ఆర్మ్స్, డైనమిక్ లైన్ రేటింగ్, హై-పెర్ఫార్మెన్స్ కండక్టర్లు, గరిష్ఠ ఆపరేటింగ్ వోల్టేజ్‌ను 1200 కె.వి. ‘ఎసి’ స్థాయికి ఉన్నతీకరించడం వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

   ‘సిఇఎ’ పరిధిలోఇప్పటికే అనేక విద్యుత్ ప్రసార పథకాల కింద పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు మరికొన్ని బిడ్డింగ్‌ ప్రక్రియకు సిద్ధమవుతుండగా, ఇంకొన్ని తదుపరి అంచెలో ఉన్నాయి. ఈ ప్రణాళిక ద్వారా 2032 వరకూ విద్యుత్ ప్రసార రంగంలో పెట్టుబడిదారులకు రూ.9,15,000 కోట్లకుపైగా భారీ పెట్టుబడి పెట్టే అవకాశాలు అందివస్తాయి.

 

 

***



(Release ID: 2064854) Visitor Counter : 10


Read this release in: English , Urdu , Hindi , Tamil