ప్రధాన మంత్రి కార్యాలయం
లావో పీడీఆర్ ప్రధానిని కలిసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
11 OCT 2024 12:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వియాంటియాన్‌లో లావో పీడీఆర్ ప్రధాని శ్రీ సోనెక్సే సిఫాండోన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 21వ ఆసియాన్-ఇండియా, అలాగే 19వ తూర్పు ఆసియా సదస్సులను విజయవంతంగా నిర్వహించినందుకు లావో ప్రధానిని ఆయన అభినందించారు.
భారత్-లావోస్ మధ్య చారిత్రక, సమకాలీన ఒప్పందాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు ప్రధానులు నిర్వహించిన చర్చలు ఫలవంతం అయ్యాయి. అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యాలను పెంపొందించడం, విపత్తు నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, వారసత్వ పునరుద్ధరణ, ఆర్థిక సంబంధాలు, రక్షణ సహకారం, ప్రజా సంబంధాల వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి వారు చర్చించారు. యాగీ టైఫూన్ తర్వాత లావో పీడీఆర్‌కు వరద సాయం అందించినందుకు ప్రధాని సిఫాండోన్ భారత ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం వాట్ ఫౌ పునరుద్ధరణ, పరిరక్షణ కోసం భారత ఆర్కియాలజికల్ సర్వే (ఏఎస్ఐ) సంస్థ ద్వారా భారత్ అందిస్తున్న సాయం ద్వైపాక్షిక సంబంధాలలో ప్రత్యేకమైనదిగా ఇరు దేశాల నాయకులూ పేర్కొన్నారు.
ప్రాంతీయ, బహుపాక్షిక వేదికలలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం పట్ల ఇరువురు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్ కీలక పాత్రను పోషిస్తోందని లావోస్ ప్రధాని సిఫాండోన్ అన్నారు. ఆసియాన్-2024 అధ్యక్షత విషయంలో లావో పీడీఆర్‌కు భారత్ అందించిన మద్దతు మరువలేనిదన్నారు.
చర్చల అనంతరం రక్షణ, ప్రసార, కస్టమ్స్ సహకారం వంటి రంగాలలో, అలాగే మెకాంగ్-గంగా సహకారంలో భాగంగా మూడు సత్వర ప్రభావ ప్రాజెక్ట్ (క్యూఐపీలు) లకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై ఇరువురు ప్రధానుల సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. లావో రామాయణ్ వారసత్వ పరిరక్షణ, రామాయణానికి సంబంధించిన కుడ్యచిత్రాలు గల వాట్ పాకియా బౌద్ధ దేవాలయ పునరుద్ధరణ, చంపాసక్ ప్రావిన్స్‌లోని రామాయణ్ ప్రదర్శించే షాడో పప్పెట్రీ థియేటర్‌కు అందించాల్సిన మద్దతు గురించి ఈ మూడు క్యూఐపీలు రూపొందించారు. ఈ మూడు క్యూఐపీలలో ప్రతి దానికీ భారత ప్రభుత్వం సుమారు 50,000ల అమెరికన్ డాలర్ల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. లావో పీడీఆర్ పోషకాహార భద్రతను మెరుగుపరచడానికి భారత్ సుమారు ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల సాయాన్ని కూడా అందిస్తుంది. భారత్ యూఎన్ అభివృద్ధి భాగస్వామ్య నిధి ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు. ఆగ్నేయాసియాలో ఈ నిధి ద్వారా సహాయం పొందనున్న మొదటి ప్రాజెక్ట్ ఇది.
(Release ID: 2064139)
Visitor Counter : 42
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam