హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 119వ వార్షిక స‌మావేశంలో ముఖ్య అతిథిగా ప్ర‌సంగించిన‌ కేంద్ర హోం, సహకార శాఖ‌ల మంత్రి శ్రీ అమిత్ షా

మొదట ముఖ్యమంత్రిగా, మూడోసారి దేశానికి ప్రధానమంత్రిగా, 23 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పద్ధ‌తిలో ప్రజల విశ్వాసాన్ని పొందిన శ్రీ న‌రేంద్ర మోదీ: శ్రీ అమిత్ షా


దార్శనికత, అనుభవం, నిబద్ధతల‌ అరుదైన

కలయికే ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ: శ్రీ అమిత్ షా


పరిశ్రమలు, ప్రభుత్వానికి మధ్య ముఖ్యమైన వారధి

పీహెచ్ డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ


పిహెచ్ డీ ఛాంబ‌ర్ సంస్థ ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, దార్శనికతను అమలు చేస్తూ అదే స‌మ‌యంలో పరిశ్రమ‌ల‌ ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి


గత ప‌దేళ్ల‌లో, ప్రపంచంలోని అన్ని రంగాలలో భారతదేశం మొద‌టి ర్యాంక్ సాధించడానికిగాను పునాది వేసిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ


‘విధానపరమైన జడత్వం’ నుంచి దేశాన్ని బయటికి తీసుకొచ్చి

కార్య‌శీల రాజ‌కీయాల‌ను నెల‌కొల్పిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ


బ‌లహీన‌మైన అయిదు ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల్లో ఉన్న దేశ‌ ఆర్థిక వ్యవస్థ ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలో ఒక ఆశాదీపంగా అవ‌త‌రించింది


2014కి ముందు గాడితప్పిన పబ్లిక్ రంగ బ్యాంకుల‌ వ్యవస్థ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రధాని మోదీ నాయకత్వంలో రూ. 1.40

Posted On: 10 OCT 2024 7:04PM by PIB Hyderabad


న్యూఢిల్లీలోని పీహెచ్ డీ  ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పిహెచ్ డీ సిసిఐ) 119వ వార్షిక సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ‌ల‌ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ ఏడాది స‌మావేశపు ఇతివృత్తం ‘విక‌సిత్ భారత్ @ 2047: ప్రగతి శిఖరం వైపు ప‌య‌నం’. ఈ కార్యక్రమంలో పరిశ్రమల రంగానికి చెందిన దాదాపు 1500 మంది వ్యాపారవేత్తలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంకర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 9వ తేదీ రాత్రి మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటాకు నివాళులర్పిస్తూ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శ్రీ రతన్ టాటా భారత పారిశ్రామిక రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవనీయమైన వ్యక్తి అని అన్నారు. టాటా గ్రూప్‌లో ప‌లు మార్పులు అవసరమైన సమయంలో ఆయ‌న టాటా గ్రూప్ సార‌థిగా బాధ్యతలు స్వీకరించార‌ని,  ఎంతో ఓపిక‌గా ప‌ని చేస్తూ సంస్థ‌కు సంబంధించిన అన్ని  వ్యాపారాల్లోను, పని పద్ధతుల్లోను మార్పులు తెచ్చార‌ని శ్రీ అమిత్ షా అన్నారు. నేటికీ, భారతదేశ పారిశ్రామిక రంగంలో టాటా సంస్థ ఒక ధ్రువతారగా నిలుస్తోందని శ్రీ షా అన్నారు. శ్రీ రతన్ టాటా తన పారిశ్రామిక సంస్థ‌ల‌ను దేశంలోనే కాదు,  ప్రపంచవ్యాప్తంగా కీల‌క స్థానానికి తీసుకుపోయార‌ని అన్నారు. ఆయ‌న నిజాయితీకి కట్టుబడి, అన్ని నియమ, నిబంధనలను అనుసరించార‌ని శ్రీ అమిత్ షా ప్ర‌శంసించారు. ట్రస్ట్ ద్వారా రతన్ టాటా దేశంలోని వివిధ సమస్యలను పరిష్కరిస్తూ, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడేలా కృషి చేశారని  శ్రీ అమిత్ షా తెలిపారు. శ్రీ రతన్ టాటా వారసత్వం  పారిశ్రామిక వేత్త‌ల‌కు చిర‌క‌పాలంపాటు మార్గదర్శకంగా ఉంటుంద‌ని  అన్నారు. 

ఈ ఏడాది భారత‌దేశ‌ ప‌రిశ్ర‌మ‌ల‌కు నిర్ణయాత్మకమైన సంవత్సరం కాబోతున్న‌ద‌ని, ఇలాంటి సమయంలోనే పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) 119వ వార్షిక సదస్సును నిర్వహిస్తున్న‌ద‌ని కేంద్ర హోంమంత్రి తెలిపారు. నేడు ప్రపంచ దేశాలలో విశ్వాస సంక్షోభం నెలకొందని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ దేశానికి మొదట ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా గత 23 ఏళ్లుగా నిరంతరం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారని శ్రీ అమిత్ షా అన్నారు. స్థిరత్వం లేకుండా, విధానాలను సమర్థవంతంగా అమలు చేయలేమని, భద్రతకు, అభివృద్ధికి హామీ ఇవ్వలేమని అన్నారు. స్థిర‌త్వం అనేది విధానాలు, ఆలోచనలు, అభివృద్ధి  కొనసాగింపున‌కు దోహ‌దం చేస్తుంద‌ని ఆయన అన్నారు. గత ప‌దేళ్ల‌లో అనేక సమస్యల నుండి ఈ విశాలమైన దేశాన్ని ప్రధాని మోదీ ర‌క్షించారని, ఇప్పుడు వరుసగా మూడోసారి ప్ర‌ధానిగా దేశానికి సార‌థ్యం వ‌హిస్తున్నార‌ని అన్నారు. 

‘విక‌సిత్‌ భారత్ @ 2047: ప్రగతి శిఖరం వైపు ప‌య‌నం’ అన్న ఇతివృత్తం చాలా సముచితంగా ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని శ్రీ  మోదీ మన ముందు రెండు ప్రధాన లక్ష్యాలను ఉంచారని, 2047 నాటి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి, భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాల‌ని, 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాల‌నేది - ఆ రెండు ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ని వివరించారు. ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు ప్రధాని మోదీ గత ప‌దేళ్లుగా వివిధ విధానాలు, కార్యక్రమాల ద్వారా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, భారతదేశాన్ని ప్ర‌పంచ త‌యారీ రంగ కేంద్రంగా మార్చడం, పెట్టుబడికి అనుకూలావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను సృష్టించడం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మించడం, పరిశోధనల్ని, అభివృద్ధిని ప్రోత్సహించడం. అధునాత‌న‌ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో మార్గదర్శకత్వం చేసే స్థాయికి భార‌త్ ను తీసుకుపోవ‌డం త‌దిత‌ర ల‌క్ష్యాల సాధ‌న‌ కోసం ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ దార్శ‌నిక విధానాల‌ను అమ‌లు చేశార‌ని అన్నారు. సముద్ర గ‌ర్భాల్లో అన్వేషణ, సముద్ర వాణిజ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌,  అంతరిక్షం వంటి రంగాలలో కొత్త కార్యక్రమాలను ప్రారంభించార‌ని అన్నారు. ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఆయా విధానాలను రూపొందించడమే కాకుండా వాటి అమలుకు నిరంతరం కృషి చేశారని శ్రీ అమిత్ షా వివ‌రించారు.

పరిశ్రమల‌కు, ప్రభుత్వానికి మధ్య పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ  వారధిగా పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అన్నారు. రానున్న కాలంలో  ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, దార్శనికతలను పీహెచ్‌డీ ఛాంబర్ అమలు చేయాలని, పరిశ్రమల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. గత ప‌దేళ్ల‌లో మనం చాలా సాధించామని అన్నారు. ప్ర‌ధాన రహ‌దారి నిర్మాణంలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ‌మార్గం, ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన, ముంబయిలోని ప్రపంచ ప్రఖ్యాత ట్రాన్స్-హార్బర్ లింక్,  కోల్‌కతాలో నీటి అడుగున మెట్రో నిర్మాణం వంటి ప‌లు మౌలిక సదుపాయాలను గత 10 సంవత్సరాలలో నిర్మించామ‌ని అన్నారు. నీటి అడుగున ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని తీసుకురావడం ద్వారా అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో వ్యాపార అవకాశాలు మరింత మెరుగవుతున్నాయని అన్నారు. అంతేకాదు భద్రతా కోణంలో కూడా ఈ ద్వీపాలను బలోపేతం చేసినట్లు చెప్పారు.

చంద్రునిపై శివశక్తి పాయింట్‌లో భారత జెండాను ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడు ఎంతో గర్వించాడని శ్రీ అమిత్ షా అన్నారు.  దేశంలోని అభివృద్ధి చెందని ప్రాంతాలను సాగర్‌మాల ప్రాజెక్ట్ ద్వారా కలుపుతున్నామ‌ని అన్నారు. సౌకర్యంగా ప్ర‌యాణం చేయ‌డానికిగాను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వ్యవస్థను నిర్మిస్తున్నామ‌ని అన్నారు. మన అవసరాలను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ అవసరాలను తీర్చడానికి సెమీకండక్టర్ తయారీలో ముంద‌డుగు, ఎలక్ట్రిక్ వాహ‌నాల రంగంలో నూత‌న విప్ల‌వం, రికార్డు స్థాయికి ఎఫ్‌డిఐ పెరుగుద‌ల‌, భారతదేశాన్ని ప్రపంచంలోనే విదేశీ మారకద్రవ్య నిల్వల్లో నాలుగో అతిపెద్ద దేశంగా చేయడం మొద‌లైన‌వి త‌మ ప్ర‌భుత్వ ముఖ్య విజ‌యాల‌ని అన్నారు. 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంకుర‌సంస్థ‌ల‌ ఆర్థిక వ్యవస్థ మనదేనని కేంద్ర హోంమంత్రి అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వ్యవస్థను విజయవంతంగా మొద‌లుపెట్టింది తమ ప్రభుత్వమేనని, ఇప్పుడు అనేక దేశాలు దీనిని అనుస‌రిస్తున్నాయ‌ని అన్నారు. దీంతో పాటు ప్ర‌ధాని శ్రీ మోదీ  ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని సహకార సంఘాల్లో ప్రవేశపెట్టారని తెలిపారు. ఆహార భద్రత నుండి ఆరోగ్య భద్రత వరకు, త‌మ ప్ర‌భుత్వం అన్ని కోణాలను స్పృశిస్తోంద‌ని, రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉండటానికిగాను గడచిన ప‌దేళ్ల‌లో ప్ర‌ధాని శ్రీ మోదీ నాయకత్వంలో పునాది వేసినట్లు శ్రీ  అమిత్‌షా స్ప‌ష్టం చేశారు. దార్శనికత, అనుభవం, నిబద్ధత క‌లిసిన‌ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని, అందుకు శ్రీ నరేంద్ర మోదీయే అద్భుతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు.

ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలో ప్రజలు నిర్ణయించే ప్రజాస్వామ్యం భారతదేశం సొంతమని శ్రీ అమిత్ షా అన్నారు. తులనాత్మక అధ్యయనం లేకుండా, మనం చేసిన పనిని సరైన విధంగా మ‌దింపు చేయలేమని ఆయన అన్నారు. 2014, 2024లో దేశ పరిస్థితిని తులనాత్మకంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన ప్ర‌త్యేకంగా త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. 2014కి ముందు భార‌త‌దేశం విధానపరమైన జడత్వంతో ఇబ్బందిప‌డుతూ ఉండేదని, దేశంలో ఎలాంటి విధానాలు రూపొందడంలేదని అందరూ చెప్పుకునేవారన్నారు. కానీ ప్రధాని శ్రీ మోదీ త‌న పాల‌న‌లో ఈ విధాన జడత్వానికి ముగింపు పలికారని అన్నారు. అనేక విధానాలను రూపొందించార‌ని, కార్య‌ద‌క్ష‌త‌తో కూడిన‌ రాజకీయాలను తీసుకువచ్చారన్నారు. నేడు శాశ్వత విధానం లేని రంగం అంటూ ఏదీ దేశంలో లేదని శ్రీ అమిత్ షా తెలిపారు. ఇంతకుముందు, అయిదు బ‌లహీన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టిగా దేశం ఉండేద‌ని, కానీ నేడు భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌లో ఒక ఆశాదీపంగా ప్ర‌పంచ ద్ర‌వ్య‌నిధి సంస్థ పేర్కొంటున్న‌ద‌ని అన్నారు.  

మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద జోజి లా టన్నెల్, చీనాబ్ రైలు వంతెన, అస్సాం వంతెన వంటి ప్రాజెక్టులు నిర్మించామ‌ని, అవి అంద‌రికీ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని కేంద్ర హోం, సహకారశాఖ‌ల‌ మంత్రి త‌న ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇంతకుముందు భారత్‌లో రెండంకెల ద్రవ్యోల్బణం ఉండేదని, నేడు  రెండంకెల వృద్ధి దిశగా ఎంతో ఆత్మ‌విశ్వాసంతో దేశం పయనిస్తోందని అన్నారు. జి20 దేశాలలో భారతదేశ వృద్ధి రేటు చాలా సంవత్సరాలుగా అత్యధికంగా ఉందని అన్నారు. గ‌తంలో ప్రపంచ పెట్టుబడిదారులు భారత్‌పై విశ్వాసం కోల్పోయారని, అయితే నేడు తయారీ రంగంలో పెట్టుబ‌డుల‌కు భార‌త్ కీల‌క దేశంగా మారిందని శ్రీ అమిత్‌షా అన్నారు. రికార్డు స్థాయిలో 2021-22లో 85 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించినట్లు  వివ‌రించారు. నేడు డిజిటల్ చెల్లింపులు వంటి అనేక రంగాల్లో ముందున్నామని అన్నారు. 2014కి ముందు రూ. 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని, అయితే ప‌దేళ్ల శ్రీ మోదీ పాలనలో అవినీతి జ‌రిగిందంటూ ప్రత్యర్థులు కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డం లేద‌ని అన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో తీవ్రవాదం, బాంబు పేలుళ్లు, నక్సలిజం దేశానికి తీవ్ర సమస్యలుగా మారాయని, అయితే నేడు కాశ్మీర్ కావ‌చ్చు.. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావ‌చ్చు లేదా ఈశాన్య ప్రాంతాలు కావ‌చ్చు. అన్ని చోట్లా తీవ్ర‌వాదాన్ని, ఉగ్ర‌వాదాన్ని విజయవంతంగా నిర్మూలించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. సుల‌భ‌త‌ర వాణిజ్య ర్యాంకుల్లో గతంలో భారత్ 142వ స్థానంలో ఉండగా, నేడు 63వ స్థానానికి ఎగబాకిందని ఆయన పేర్కొన్నారు. గ‌తంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనమైన స్థితిలో ఉండేద‌ని, అయితే 2023-24లో ప్రభుత్వ బ్యాంకులు రూ.1.40 లక్షల కోట్ల లాభాన్ని ఆర్జించాయని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్రతి రంగంలోనూ కొత్త విధానాలను ప్రవేశపెట్టామ‌ని, త‌ద్వారా దేశం అభివృద్ధి సాధిస్తోంద‌ని అన్నారు. 

దేశం పురోగమించాలంటే కొత్త విద్యా విధానం తప్పనిసరిగా ఉండాలని శ్రీ అమిత్ షా అన్నారు. అందులో మన వారసత్వాన్ని పొందుప‌రుస్తూనే విద్యను ప్రపంచీకరణ చేసేలా నూతన విద్యా విధానాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తీసుకొచ్చారని కేంద్ర హోంమంత్రి అన్నారు. జీఎస్టీ, డిజిటల్ ఇండియా, భారతమాల, సాగర్‌మాల, పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశాన్ని అన్ని దిశల్లో ముందుకు నడిపిస్తున్నాయ‌ని ఆయన అన్నారు.

ప్రధాని  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో "కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన" సూత్రం ప్రకారం, 2,000 కాలం చెల్లిన వలసరాజ్యాల చట్టాలను ర‌ద్దు చేశాం. వివిధ రంగాలలో 39,000 పైగా నియంత్ర‌ణ‌ల‌ను తొల‌గించ‌డం జ‌రిగిందని శ్రీ అమిత్ షా అన్నారు. గడచిన పదేళ్ల‌లో 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత ధాన్యం, 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు, 15 కోట్ల ఇళ్లకు పైపుల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా, 11 కోట్ల మందికిపైగా ల‌బ్దిదారుల‌కు  ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందజేశామని ఆయన వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రధాని శ్రీ మోదీ లక్షలాది మంది ప్ర‌జ‌ల‌ ఆందోళనలను దూరం చేశారని, భారతదేశాన్ని 130 కోట్ల మంది ప్రజల మార్కెట్‌గా మార్చారని శ్రీ అమిత్‌ షా అన్నారు. 60 కోట్ల మంది ప్రజలు దేశాభివృద్ధికి దూరంగా ఉంటే ఆ దేశం ఎప్పటికీ పురోగమించదన్నారు. నేడు, 130 కోట్ల మంది ప్రజలు దేశ అభివృద్ధి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున, దేశ‌ వృద్ధి రేటు పైకి ఎగబాకిందని స్ప‌ష్టం చేశారు. 

పరిశోధన‌ల‌ రంగంలో శ్రీ మోదీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసిందని కేంద్ర హోం, సహకార రంగాల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. తొలిసారిగా రూ50,000 కోట్లతో రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. రానున్న 25 ఏళ్లలో ప్రపంచ పరిశోధనల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందనే న‌మ్మ‌కాన్ని ఆయ‌న  వ్యక్తం చేశారు. ప్రధాని శ్రీ మోదీ వివిధ రంగాల్లో విస్తృతంగా కృషి చేశారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల పరంగా, భారతదేశం ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. అయితే గ్లోబల్ ఫిన్‌టెక్, స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంలో భార‌త్ మొదటి స్థానంలో ఉంద‌న్నారు.. ఈ రోజు ప్రపంచంలోని రోజువారీ డిజిటల్ లావాదేవీలలో సగం భారతదేశంలోనే జరుగుతున్నాయని శ్రీ అమిత్ షా త‌న ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. .

భారతదేశ‌ పరిశ్రమలు ఇప్పుడు వాటి పరిమాణం, స్థాయి రెండింటినీ  పెంచ‌డానికి కృషి చేయాలని శ్రీ అమిత్ షా సూచించారు. భార‌త్‌ కంపెనీలు ప్రపంచవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు మన ఛాంబర్లు, పరిశ్రమలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన త‌న ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. 



(Release ID: 2064090) Visitor Counter : 18