ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వాధినేతగా 23 వసంతాలు పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు


‘‘ముఖ్యమంత్రిగా నా 13 ఏళ్ల హయాంలో ‘సబ్కా సాథ్.. సబ్‌కా వికాస్’ నినాదానికి గుజరాత్ ఉజ్వల నిదర్శనంగా నిలిచింది’’;

‘‘దేశంలో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరిక విముక్తులయ్యారు... భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది’’;

‘‘భారత పురోగమన వేగం ప్రపంచమంతా మన దేశంవైపు అత్యంత ఆశాభావంతో దృష్టి సారించేలా చేసింది’’;

‘‘మన సమష్టి స్వప్నం ‘వికసిత భారత్’ సాకారమయ్యేదాకా విశ్రమించేది లేదు’’;

Posted On: 07 OCT 2024 9:06PM by PIB Hyderabad

ప్రభుత్వాధినేతగా 23 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. తన హయాంలో ఆ రాష్ట్రం సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకు భరోసా ఇస్తూ ‘సబ్కా సాథ్-సబ్కా వికాస్’ నినాదానికి ఉజ్వల నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే గడచిన దశాబ్దంలో భారత పురోగమన వేగం ప్రపంచమంతా మనవైపు అత్యంత ఆశాభావంతో దృష్టి సారించేలా చేసిందని వ్యాఖ్యానించారు. దేశంలోని 140 కోట్లమంది పౌరుల సమష్టి స్వప్నమైన ‘వికసిత భారత్’ సాకారమయ్యేదాకా అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఆయన ప్రతినబూనారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంచుకున్న వరుస సందేశాల్లో:
   ‘‘#23 వసంతాల సేవ...
ప్రభుత్వాధినేతగా నేను 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆశీస్సులు అందజేసిన, శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7న ప్రభుత్వాధినేతగా ప్రజలకు సేవచేసే బాధ్యతలు స్వీకరించాను. నాలాంటి అణకువగల ఓ సామాన్య కార్యకర్తకు ఒక రాష్ట్ర పాలన పగ్గాలను అప్పగించడాన్ని బట్టి నా పార్టీ బీజేపీ @BJP4India గొప్పదనం ఎంతటిదో అవగతం చేసుకోవచ్చు.’’
   ‘‘నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వేళకు గుజరాత్ అనేక సవాళ్లతో సతమతం అవుతోంది. ముఖ్యంగా 2001నాటి కచ్ భూకంపం, అంతకుముందు ఒక పెను తుఫాను, భారీ కరువు, కనీవినీ ఎరుగని దోపిడీ, కుల-మతతత్వం వంటి దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలన దుష్ఫలితాలు నాకు వారసత్వంగా సంక్రమించాయి. కానీ, ఓ మహా సంకల్పంతో జనబలం వెన్నుదన్నుగా గుజరాత్ రాష్ట్రాన్ని సమష్టిగా పునర్నిర్మించాం. సంప్రదాయకంగా వ్యవసాయం వంటి పెద్దగా ప్రాధాన్యంలేని రంగం సహా గుజరాత్ ప్రగతిని అన్ని రంగాల్లోనూ సమున్నత శిఖరాలకు చేర్చాం.’’
   ‘‘‘‘ముఖ్యమంత్రిగా నా 13 ఏళ్ల హయాంలో సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకు భరోసా ఇస్తూ- ‘సబ్కా సాథ్.. సబ్‌కా వికాస్’ నినాదానికి గుజరాత్ ఉజ్వల ఉదాహరణగా నిలిచింది. అటుపైన 2014లో దేశ ప్రజలు నా పార్టీని మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఆశీర్వదించారు. తద్వారా ప్రధానమంత్రిగా జాతికి సేవ చేసే అవకాశం నాకు దక్కింది. అదొక చరిత్రాత్మక ఘట్టం... ఆనాటికి 30 ఏళ్ల దేశ రాజకీయాల్లో ఒక పార్టీ సంపూర్ణ ఆధిక్యం సాధించడం అదే తొలిసారి.’’
   ‘‘అనంతరం గత దశాబ్దంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను మేము పరిష్కరించగలిగాం. విశేషించి 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరిక విముక్తులయ్యారు. భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ పరిణామం అనేక రంగాలకు... ముఖ్యంగా మన సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ఎనలేని మేలు చేసింది. ఆరుగాలం శ్రమించే మన అన్నదాతలు, నారీశక్తి, యువశక్తి, పేదలు సహా సమాజంలోని అట్టడుగు వర్గాలకూ అపార అవకాశాల దిశగా కొత్త బాటలు పడ్డాయి.’’
   ‘‘భారత పురోగమన వేగం ప్రపంచమంతా మన దేశంవైపు అత్యంత ఆశాభావంతో దృష్టి సారించేలా చేసింది. ప్రపంచం మనతో కలసి పనిచేయడానికి, మన జనంతో మమేకమై విజయాల్లో పాలుపంచుకోవడానికి నేడు ఆసక్తి చూపుతోంది. మరోవైపు శీతోష్ణస్థితి మార్పు దుష్ప్రభావాలను అధిగమించడం, ఆరోగ్య సంరక్షణ రంగం మెరుగుదల, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన తదితర అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారం దిశగానూ భారత్ అవిరళ కృషి చేస్తోంది.’’
   ‘‘కొన్నేళ్లుగా మనమెంతో సాధించాం... కానీ, చేయాల్సింది మరెంతో ఉంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రభావం చూపగల అనేక మార్గదర్శక కార్యక్రమాలకు ఈ 23 సంవత్సరాల్లో మన అనుభవాలు జీవం పోశాయి. ఈ నేపథ్యంలో ప్రజల సేవకు నేను పునరంకితం అవుతున్నాను. ఇనుమడించిన శక్తితో, అవిరామంగా శ్రమిస్తానని నా సహ పౌరులందరికీ హామీ ఇస్తున్నాను. మనందరి సమష్టి స్వప్నం ‘వికసిత భారత్’ సాకారమయ్యేదాకా విశ్రమించేది లేదని ప్రతినబూనుతున్నాను.’’

 

 

 

***

MJPS/SR/TS



(Release ID: 2063032) Visitor Counter : 32