హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ)పై సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సమావేశం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2026 నాటికి నక్సలిజం పూర్తిగా అంతరిస్తుంది

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అతిపెద్ద అవరోధం, మానవాళికి శత్రువుగా నక్సలిజం

నక్సలిజం కారణంగా కనీస సౌకర్యాలు కోల్పోయిన 8 కోట్ల మందికి పైగా ప్రజలు

ఇది మానవ హక్కులకు ప్రధాన ఉల్లంఘన

జనవరి నుంచి, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 237 మంది నక్సలైట్లు హతమయ్యారు, 812 మంది అరెస్ట్ అయ్యారు, 723 మంది లొంగిపోయారు.

వామపక్ష తీవ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం

ఎల్‌డబ్ల్యూఈ- ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలన్నీ అమలైతే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం


రహదారుల అనుసంధానం, మొబైల్ అనుసంధానం, ఆర్థిక అనుసంధానం అనే 3 ‘సీ’లను బలోపేతం చేస్తున్న మోదీ ప్రభుత్వం

మోదీ ప్రభుత్వ హయాంలో, ఎల్‌డబ్ల్యూఈ-ప్రభావిత రాష్ట్రాల్లో మూడు రెట్లు పెరిగి, రూ. 3,006 కోట్లకు చేరిన భద్రతా వ్యయం

2004 నుంచి 2014 వరకు నిర్మించిన పోలీస్ స్టేషన్లు 66 మాత్రమే

గడిచిన 10 ఏళ్లలోనే 544 స్టేషన్లను నిర్మించిన మోదీ ప్రభుత్వం

ఎల్‌డబ్ల్యూఈ-ప్రభావిత ప్రాంతాల్లో 53%కు తగ్గిన హింసాత్మక ఘటనలు

2004 - 2014 మధ్య నమోదైన 16,463 కేసులు

గడచిన

Posted On: 07 OCT 2024 6:24PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ)పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ ముఖ్యమంత్రులు, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి పాల్గొన్నారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనుల వేగవంతం కోసం రాష్ట్రాలకు సహకరిస్తున్న వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సిఎపిఎఫ్), కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.



కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, అన్ని ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలు ఐక్యంగా పనిచేస్తున్నాయన్నారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ లక్ష్య సాధనలో మన 8 కోట్ల మంది గిరిజన సోదర, సోదరీమణుల పాత్ర చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. మన 8 కోట్ల మంది గిరిజన సోదర, సోదరీమణులు సహా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందడమే అభివృద్ధి చెందిన భారతదేశానికి నిజమైన అర్థమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. నేడు మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నక్సలిజం అతిపెద్ద అవరోధంగా మారిందన్నారు. విద్య, వైద్యం, కనెక్టివిటీ, బ్యాంకింగ్, తపాలా సేవలు గ్రామాలకు చేరకుండా నక్సలిజం అడ్డుపడుతుందన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలను అందించడం కోసం నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

2019 నుంచి 2024 వరకు నక్సలిజంపై పోరాటంలో చెప్పుకోదగిన విజయం సాధించామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. వామపక్ష తీవ్రవాదం వల్ల ఏర్పడిన చీకటి స్థానంలో రాజ్యాంగ హక్కులనే వెలుగులు నింపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషి ద్వారానే సాధ్యపడుతున్నదన్నారు. వామపక్ష హింసాత్మక భావజాలానికి బదులుగా అభివృద్ధి, విశ్వాసంతో కూడిన కొత్త శకాన్ని ప్రారంభించామని తెలిపారు. వామపక్ష తీవ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూనే, ప్రభుత్వ పథకాలను 100% అమలు చేయడం ద్వారా, ఎల్‌డబ్ల్యూఈ- ప్రభావిత ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు శ్రీ అమిత్ షా వివరించారు.

వామపక్ష తీవ్రవాదంపై పోరాడేందుకు ప్రభుత్వం రెండు చట్టాలను రూపొందించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. వాటిలో మొదటిది, నక్సలిజం ప్రభావం గల ప్రాంతాల్లో చట్టబద్ధమైన పాలనను నెలకొల్పడం, చట్టవిరుద్ధమైన హింసాత్మక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడం. రెండోది, సుదీర్ఘ నక్సలైట్ ఉద్యమం కారణంగా అభివృద్ధికి దూరమై నష్టపోయిన ప్రాంతాల్లో ఆ లోటును భర్తీ చేస్తూ త్వరితగతిన అభివృద్ధి సాధించడం అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

గడచిన 30 ఏళ్లలో తొలిసారిగా, 2022లో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) కారణంగా మరణించిన వారి సంఖ్య 100లోపు  ఉందన్న కేంద్ర హోం మంత్రి, దీనిని గొప్ప విజయంగా అభివర్ణించారు. 2014 నుంచి 2024 వరకు నక్సల్స్ సంబంధిత ఘటనలు గణనీయంగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో 14 మంది నక్సల్స్‌ అగ్రనేతలు హతమయ్యారని తెలిపిన శ్రీ అమిత్ షా, ప్రతి వ్యక్తికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే కార్యక్రమాలు మరింత మెరుగ్గా అమలవుతున్నాయన్నారు. ఎల్‌డబ్ల్యూఈపై పోరాటం చివరి దశలో ఉందని, అందరి సహకారంతో మార్చి 2026 నాటికి దశాబ్దాల నాటి ఈ విపత్తు నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. బుద్ధ పహాడ్, చకరబంధ వంటి ప్రాంతాలు నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందాయని ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎల్‌డబ్ల్యూఈ క్యాడర్ బలం 85 శాతం తగ్గిపోయిందని, ఇప్పుడు నక్సలిజం అంతానికి తుది చర్యలు అవసరమని ఆయన అన్నారు.

2019 నుంచి మోదీ ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ, సిఎపిఎఫ్‌ల విస్తరణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీ అమిత్ షా చెప్పారు. ఫలితంగా, కేవలం ఒక సంవత్సరంలో 194కు పైగా క్యాంపులను ఏర్పాటు చేశామనీ, ఇది గణనీయమైన విజయానికి దారితీసిందన్నారు. 45 పోలీస్ స్టేషన్స్ ఏర్పాటుతో భద్రతను మెరుగుపరచడం, రాష్ట్ర నిఘా విభాగాలను బలోపేతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక బలగాల అద్భుతమైన పనితీరు ఈ వ్యూహం విజయవంతం అయ్యేందుకు దోహదపడ్డాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. హెలికాప్టర్ల సదుపాయం వల్ల మన సైనికుల ప్రాణనష్టం గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. గతంలో కేవలం రెండు హెలికాప్టర్స్ మాత్రమే బలగాలకు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం బిఎస్ఎఫ్ నుంచి 6, వైమానిక దళం నుంచి 6 చొప్పున మొత్తం 12 హెలికాప్టర్స్ సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో విజయం సాధించినందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రి అభినందించారు. జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 237 మంది నక్సలైట్లు మరణించారని, 812 మంది అరెస్టయ్యారని, 723 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు. నక్సలిజంలో నిమగ్నమైన యువత హింసా మార్గాన్ని విడనాడి సమాజ స్రవంతిలో చేరి దేశాభివృద్ధికి సహకరించాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ఈశాన్య ప్రాంతం, కాశ్మీర్, ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మందికి పైగా నక్సల్స్ హింసను విడిచి జనజీవన స్రవంతిలో చేరారని ఆయన పేర్కొన్నారు. నక్సలిజంలో నిమగ్నమైన యువతకు అన్ని రాష్ట్రాలు ప్రయోజనకరమైన పునరావాస పథకాలను రూపొందించాలని శ్రీ అమిత్ షా కోరారు. నక్సలిజం వల్ల ఎవరికీ లాభం లేదనే విషయం ఇప్పుడు పూర్తిగా రుజువైందని ఆయన పేర్కొన్నారు.

2004 నుంచి 2014 వరకు భద్రతా సంబంధిత వ్యయం  కింద రూ. 1,180 కోట్లు ఖర్చు చేయగా, 2014 నుంచి 2024 మధ్య మోదీ ప్రభుత్వం చేసిన వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగి రూ. 3,006 కోట్లకు చేరుకుందని శ్రీ అమిత్ షా చెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడం కోసం కేంద్ర ఏజెన్సీలకు సహాయం అందించే పథకం ద్వారా రూ. 1,055 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం అందించే ప్రత్యేక సహాయం ఒక కొత్త పథకం అని తెలిపిన శ్రీ అమిత్ షా, దీని కింద మోదీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో రూ 3,590 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం రూ.14,367 కోట్లకు ఆమోదం తెలిపామని, అందులో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

2004 నుంచి 2014 మధ్య కాలంలో 66 పోలీస్ స్టేషన్లు  నిర్మించగా, 2014 నుంచి 2024 వరకు 544 పోలీస్ స్టేషన్లను నిర్మించామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. 2014కి ముందు 10 ఏళ్లలో 2,900 కి.మీ రహదారి నెట్‌వర్క్‌ నిర్మించగా, గడిచిన 10 ఏళ్లలో అది 14,400 కి.మీ.కు పెరిగిందన్నారు. 2004 నుంచి 2014 వరకు మొబైల్ కనెక్టివిటీ కోసం ఎటువంటి కృషి జరగలేదన్న కేంద్ర హోం మంత్రి, 2014 నుంచి 2024 కాలంలో 6,000 టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు, 3,551 టవర్లను 4జీకి మార్చే పనులు కూడా పూర్తయినట్లు తెలిపారు. 2014కి ముందు, 38 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్) కోసం మాత్రమే ఆమోదం లభించిందన్నారు. మోదీ ప్రభుత్వ హయంలో 216 పాఠశాలల ఏర్పాటుకు ఆమోదం తెలపగా, వాటిలో 165 ఇఎంఆర్ పాఠశాలలు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలన్నీ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు జరిగిన కృషికి నిదర్శనమని హోంమంత్రి అన్నారు.

2004 నుంచి 2014 మధ్య 10 సంవత్సరాల్లో 16,463 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోగా, వాటి సంఖ్య ప్రస్తుతం 53% తగ్గి 7,700కి చేరిందని శ్రీ అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, పౌరులు, భద్రతా దళాల మరణాలు 70% తగ్గాయనీ, హింసాత్మక ప్రాంతాలుగా ఉన్న 96 జిల్లాలు ఇప్పుడు 57 శాతం తగ్గుదలతో, వాటి సంఖ్య 16కి చేరిందని తెలిపారు. హింసాత్మక పోలీస్ స్టేషన్లు కూడా 465 నుంచి 171కి తగ్గాయనీ, వాటిలో 50 పోలీస్ స్టేషన్లు కొత్తవేనని తెలిపారు. ఈ విజయం అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమష్టి కృషి ఫలితమని కేంద్ర హోం మంత్రి అన్నారు. మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

నక్సలిజానికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో సాధించిన విజయం మనందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలన్నింటిలో అభివృద్ధి కోసం కొత్త ప్రచారాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. నక్సలిజం నుంచి 100% విముక్తి పొందడం లక్ష్యంగా వ్యక్తిగత, కుటుంబ సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 300 పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. ఈ పథకాల వల్ల తక్కువ ధరలకే ధాన్యాలు, మందులు లభిస్తున్నాయనీ, పాఠశాలలు, ప్రజారోగ్య కేంద్రాల వంటి వసతులు గ్రామాలకు చేరాయన్నారు.

భద్రతపరమైన లోపాలను సరిచేయడం కోసం 2019 నుంచి 280 కొత్త క్యాంపులు, 15 కొత్త జాయింట్ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటైనట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడానికి ఆరు సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌లను సిద్ధంగా ఉంచామన్నారు. దీనితో పాటు, నక్సలైట్ల ఆర్థిక వనరులను నిర్వీర్యం చేసే విషయంలో ఎన్ఐఎ చురుగ్గా చర్యలు చేపట్టిన క్రమంలో వారికి ఆర్థిక వనరుల కొరత ఏర్పడిందన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివిధ ఆపరేషన్స్ మూలంగా నక్సలైట్లకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని హోం మంత్రి తెలిపారు.



ప్రధాన పథకాలతో పాటు, రహదారుల అనుసంధానం, టెలికమ్యూనికేషన్‌ మెరుగుదల, ఆర్థిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి కీలకమైన అభివృద్ధి రంగాలపై మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించడంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు. అక్టోబరు 2న ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్‌ నుంచి ‘ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌’ను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాలు నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందే లక్ష్యంతో 15,000కు పైగా గ్రామాల్లో దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యక్తిగత సదుపాయాలను అందించడం ఈ ప్రచారంలో ఒక కీలక మైలురాయి అని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం 3-సి అంటే రహదారుల కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ, ఫైనాన్షియల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తోందని శ్రీ అమిత్ షా తెలిపారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నక్సలిజం ప్రధాన అవరోధంగా ఉందనీ, సమస్త మానవాళికీ శత్రువుగా మారిందని, అలాగే మానవ హక్కులను ఉల్లంఘనకు పాల్పడుతున్నదని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. 8 కోట్ల మందికి కనీస సౌకర్యాలు లేకుండా చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. నక్సలైట్లు అమర్చిన మందుపాతరలతో వేలాది మంది అమాయక గిరిజన సోదరులు, సోదరీమణులు మరణించారని, నక్సలిజం కారణంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోయిందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, ఈ ముప్పును శాశ్వతంగా తొలగించడానికి చివరి ప్రయత్నం అవసరమని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల అభివృద్ధి, నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల పురోగతిపై కనీసం నెలకోసారి సమీక్షించాలని ఆయన కోరారు, అలాగే పోలీసు డైరెక్టర్ జనరల్స్ కనీసం 15 రోజులకోసారి ఈ విషయంగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు.

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మనమంతా కృషి చేయాలని శ్రీ అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రజల సమష్టి బలం ద్వారా, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా పని చేసి 2026 ఏప్రిల్ నాటికి నక్సలిజం ముప్పును పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించాలన్నారు. ఇది సాధ్యమైతే అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదనీ, మానవ హక్కుల ఉల్లంఘన జరగదనీ, భావజాలం పేరుతో జరిగే హింసకు దేశంలో తావుండదనీ ఆయన స్పష్టం చేశారు.

***



(Release ID: 2063023) Visitor Counter : 22