సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి అందుకున్న బహుమతుల ఈ-వేలం గడువు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
Posted On:
02 OCT 2024 2:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు ప్రత్యేక (అసాధారణ) ఈ-వేలం గడువును కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పొడిగించింది. ప్రధాని అందుకున్న జ్ఞాపికల ప్రత్యేక సేకరణ వేలంలో అందుబాటులో ఉంది. భారతదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వాన్ని ఈ-వేలం ప్రతిబింబిస్తుంది.
వాస్తవానికి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2024 వరకు జరగాల్సిన వేలాన్ని 2024 అక్టోబర్ 31 వరకు పొడగించారు. ఆసక్తి గల వ్యక్తులు అధికారిక వెబ్‌సైట్: https://pmmementos.gov.in/ ద్వారా రిజిస్టరై వేలంలో పాల్గొనవచ్చు.
సంప్రదాయ కళారూపాలు, అద్భుతమైన పెయింటింగ్స్, ముచ్చటగొలిపే శిల్పాలు, స్వదేశీ హస్తకళలు.. ఆకర్షణీయమైన జానపద, గిరిజన కళాఖండాలు వైబ్‌సైట్‌లో ప్రదర్శించారు. సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, తలపాగాలు, ఉత్సవ కత్తులతో సహా సంప్రదాయ పద్ధతుల ప్రకారం గౌరవమర్యాదలకు చిహ్నాలుగా ఉన్న వస్తువులు ఇందులో ఉన్నాయి.
ఖాదీ శాలువాలు, సిల్వర్ ఫిలిగ్రీ, మాతా ని పచేడి కళలు, గోండు చిత్రాలు, మధుబని కళలు తదితరాలకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఈ వేలానికి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. ఇవి భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తున్నాయి. 2024 పారా ఒలింపిక్స్‌లో క్రీడాకారులు ఉపయోగించిన ఆట వస్తువులు వేలంలో కీలక ఆకర్షణగా ఉన్నాయి. ప్రతి క్రీడా వస్తువు అథ్లెట్ల అసాధారణ క్రీడాతత్వం, సంకల్పాన్ని తెలియజేస్తుంది. వారి కృషికీ, సాధించాలన్న తపనకూ ఇవి నిదర్శనం. వారి విజయాలకు ఇవి గౌరవ సూచికలే కాకుండ భావితరాలకు స్ఫూర్తినిస్తాయి.
ఇది ఆరో విడతగా జరుగుతున్న ఈ-వేలం. 2019 జనవరిలో మొదటి సారి ఈ-వేలాన్ని నిర్వహించారు. మునుపటి విడతల మాదిరిగానే, ఈ సారి కూడా వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు ఇవ్వనున్నారు. మన జాతీయ నది అయిన గంగా నది పరిరక్షణ, పునరుద్ధరణ.. బలహీనమైపోయిన దాని పర్యావరణ రక్షణ కోసం నమామి గంగే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ-వేలం ద్వారా సమకూరే నిధులు ఈ దిశగా ఉపయోగపడనున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించాలనే మన నిబద్ధతను బలపరచనున్నాయి.
***
(Release ID: 2061339)
Visitor Counter : 51