ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అటల్ బిహారీ వాజ్ పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
10వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన రాష్ట్రపతి
అనారోగ్యం బారినపడ్డ మానవాళికి సాంత్వనను అందించేది వైద్యులే,
అప్పుడే జీవన్మరణాలకు వారు తేడా చూపించగలరు: శ్రీమతి ద్రౌపది ముర్ము
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడటానికి వైద్యులు, నర్సులు అంకితభావంతో పనిచేశారు... ఒక దేశంగా మేం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం
బంగారు భవిష్యత్తును నిర్మించడానికి మానవ వనరులు ఇక్కడున్న
విద్యార్థులు, విద్యాధికులే: శ్రీ జెపి నడ్డా
దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతిభ, నైపుణ్యాలు, విజ్ఞానాన్ని ఉపయోగించే దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం
Posted On:
30 SEP 2024 7:07PM by PIB Hyderabad
అటల్ బిహారీ వాజ్ పేయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎబివిఐఎంఎస్) 10వ స్నాతకోత్సవంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జెపి నడ్డా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ సమక్షంలో ఈరోజు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ "ఈ ఆసుపత్రి, సంస్థ ఇద్దరు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉంది. వారు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి. వీరిద్దరికీ దేశమే ముఖ్యం. వారు మన సమాజానికి, దేశానికి సరికొత్త దిశానిర్దేశాన్ని అందించారు. ఈ సంస్థ, ఆసుపత్రితో సంబంధం ఉన్న వ్యక్తులు వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తారని, వారి అడుగుజాడల్లో నడుస్తారని నేను నమ్ముతున్నాను” అని ఆమె అన్నారు.
అనారోగ్యం బారిన పడిన మానవాళికి కోలుకునే స్పర్శను వైద్యులు అందిస్తారని, అప్పుడు మాత్రమే జీవన్మరణాలకు మధ్య స్పష్టమైన తేడాను చూపగలరని రాష్ట్రపతి అన్నారు. “మీరు పెద్ద బాధ్యత భుజాన వేసుకున్నారు. మన దేశంలో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు కాబట్టే వైద్యులను దేవుళ్లుగా చూస్తారు. మీరు సూచించే మందులతో ప్రజలకు సాంత్వన లభించాలన్న సంగతిని దయచేసి గుర్తుంచుకోండి " అని ఆమె పేర్కొన్నారు.
వైద్యులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై మాట్లాడుతూ ఏ వైద్యుడూ తమ రోగులు ఇబ్బంది పడాలని కోరుకోరని, అందుకే క్లిష్ట సమయాల్లో రోగులు, రోగి సంరక్షకులు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి వైద్యులు, నర్సులు అంకితభావంతో తమ విధులను నిర్వర్తించారని, ఒక దేశంగా మేం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.
వైద్య వర్గాలు, సంబంధిత సంస్థలు మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రపతి కోరారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన మహిళలకు ఆరోగ్య సేవలను అందించడంలో సహాయపడిందని ఆమె పేర్కొన్నారు. గత పదేళ్లలో ఆరోగ్య సంరక్షణ రంగంలో సాధించిన విజయాలను ఆమె ప్రస్తావించారు. వైద్య కళాశాలల సంఖ్య పెరిగిందని, పీజీ సీట్ల సంఖ్య రెట్టింపు అయిందని ఆమె అన్నారు. కొత్తగా ఎయిమ్స్ తరహా సంస్థల్ని ఏర్పాటు చేశామని, ఈ సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఈ సందర్భంగా, 36 మంది సూపర్ స్పెషాలిటీ విద్యార్థులతో పాటు ఈ వైద్య కళాశాల విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ జేపీ నడ్డా మాట్లాడుతూ విద్యార్థులందరినీ అభినందించారు. వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి ఇక్కడ ఉన్న విద్యార్థులు, విద్యాధికులే మనకు మానవ వనరుల పెట్టుబడి అని ఆయన అన్నారు.
వృత్తి విద్య అనేది కొద్దిమందికి మాత్రమే దక్కే అదృష్టమని, అలాంటి వృత్తి విద్యను అందించడానికి ప్రతి వైద్య విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి 30-35 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యార్థులు తమ ప్రతిభ, నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆయన ప్రోత్సహించారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ లో వైద్యుల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు. భారత్ లోని ఆసుపత్రులకు భారీగా తరలివచ్చే వారి సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో పోల్చలేమని, మన డాక్టర్లు రోగులకు సంబంధించి ఎలాంటి సంరక్షణ, పరిశోధన, ఆవిష్కరణల్లో పాల్గొంటున్నారో చాలా మంది గ్రహించలేరని ఆయన తేల్చి చెప్పారు.
విద్యార్థులను విశాల హృదయంతో మానవాళికి సేవ చేసేలా ప్రేరేపిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. "మీరు ఇప్పుడు మానవ జీవితానికి మాత్రమే కాదు, ఒక ఉదాత్తమైన వృత్తికి కూడా రక్షకులు, సంరక్షకులు " అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా శ్రీ జె.పి.నడ్డా కళాశాల జర్నల్ "సంహిత" మొదటి సంచికను విడుదల చేసి, మొదటి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు.
వైద్య నిపుణుల బాధ్యతల గురించి రాష్ట్రపతి సూచించిన సలహాలను పునరుద్ఘాటిస్తూ పరిపూర్ణత, విలువలు, సహానుభూతి మాత్రమే విజయానికి కీలక కారకాలని డాక్టర్ వి.కె.పాల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని తర్వాతి తరం వైద్య నిపుణులతో పంచుకునేలా విద్యావేత్తలుగా మారాలని ఆయన ప్రోత్సహించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓఎస్ డీ శ్రీమతి పుణ్య సలీలా శ్రీవాస్తవ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు శ్రీ జైదీప్ కుమార్ మిశ్రా, ఏబీవీఐఎంఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ అజయ్ శుక్లా, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఏబీవీఐఎంఎస్ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2060538)
Visitor Counter : 41