ఉక్కు మంత్రిత్వ శాఖ
‘‘ప్రక్రియలు-ఉత్పత్తుల ఆవిష్కరణపై అంతర్జాతీయ సదస్సు (ఎంఎంఎంఎం-2024)’’సహా పర్యావరణ హిత ఉక్కు ఉత్పత్తిపై సార్వత్రిక చర్చాగోష్ఠికి కేంద్ర ఉక్కు-భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ శ్రీకారం
Posted On:
28 SEP 2024 11:10AM by PIB Hyderabad
కేంద్ర ఉక్కు-భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇవాళ ‘‘ఎంఎంఎంఎం-2024’’ పేరిట ఒక విస్తృత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ‘‘లోహాల వెలికితీత ప్రక్రియలు-ఉత్పత్తుల ఆవిష్కరణ’’ అంశంపై అంతర్జాతీయ సదస్సు, ‘పర్యావరణ హిత ఉక్కు ఉత్పత్తిపై సార్వత్రిక చర్చాగోష్ఠి’ నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా 2024 సెప్టెంబరు 27 నుంచి 29 వరకూ ‘హైవ్ ఇండియా లిమిటెడ్, ఐఐఎం-ఢిల్లీ చాప్టర్, మెటలాజిక్ పిఎంఎస్, వరల్డ్ మెటల్ ఫోరమ్’ల ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ- నేడు అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి భారీగా పెరిగిందని చెప్పారు. మునుపటితో పోలిస్తే కిలోల నుంచి 2 బిలియన్ టన్నుల స్థాయికి చేరువైందని పేర్కొన్నారు. మొత్తంమీద ప్రపంచ సామర్థ్యం 2.5 బిలియన్ టన్నులకు పెరిగిందని, ఇదంతా ఉక్కు రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు, సామగ్రి సామర్ధ్యం ఇనుమడించిన ఫలితమేనని అభివర్ణించారు.
జాతీయంగా, అంతర్జాతీయంగా ఉక్కుకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంటుందని శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. దీనివల్ల భారత ఉక్కు పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు తథ్యమని విశ్వాసం వెలిబుచ్చారు. ఈ రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో 144 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించగా, ప్రస్తుతం 178 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగిందని ఆయన గుర్తుచేశారు.
ఉక్కు రంగం తన జీవిత చక్రంలో నేడు సరికొత్త మలుపు తిరిగిందని, పర్యావరణ కర్బన జాడలను తుడిచిపెట్టే దిశగా ఉద్గార స్థాయులు తగ్గించేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ప్రక్రియలలోనేగాక, సుస్థిర ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా డిజిటలీకరణ ఆధారిత భవిష్యత్తును రూపొందించుకోనుందని మంత్రి వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ- భారత్ తన ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గార తీవ్రతను 2030 నాటికి 45 శాతానికిపైగా తగ్గిస్తుందని 2021 నవంబర్ 2నాటి ‘కాప్26’ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని శ్రీ వర్మ గుర్తుచేశారు. అంతేకాకుండా 2070 నాటికి నికరశూన్య ఉద్గార స్థాయిని చేరుకోగలమని కూడా ఆయన ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ప్రపంచ మొత్తం మీద వెలువడే ఉద్గారాలలో అంతర్జాతీయ ఉక్కు రంగం వాటా సగటున దాదాపు 8 శాతంగా ఉంటుంది. ఆ మేరకు టన్ను ముడి ఉక్కు ఉత్పత్తి నుంచి 1.89 టన్నుల దాకా కర్బన ఉద్గారం ఉద్భవిస్తుంది. కాగా, భారత్‌లో ఇది ప్రతి టన్నుకు 2.5 టన్నులుగా ఉన్న నేపథ్యంలో మొత్తం దేశీయ ఉద్గారాలలో ఈ రంగం వాటా సుమారు 12శాతంగా ఉంటోందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉక్కు మంత్రిత్వ శాఖ దేశీయ ఉక్కు రంగాన్ని కర్బనరహితం చేసే మార్గాన్వేషణ దిశగా వివిధ అంశాలపై 14 కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఇచ్చిన నివేదికలోని సిఫారసుల ఆధారంగా ‘‘భారత్‌లో పర్యావరణ హిత ఉక్కు రంగం: భవిష్యత్ మార్గం-కార్యాచరణ ప్రణాళిక’’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఇంధన పొదుపు, పునరుత్పాదక ఇంధనం, హరిత ఉదజని, పదార్థ పొదుపు, బొగ్గు ఆధారిత ‘డిఆర్ఐ’ నుండి సహజ వాయు ఆధారిత ప్రక్రియకు మార్పు, కర్బన సంగ్రహణం, వినియోగం-నిల్వ (సిసియుఎస్), ఉక్కు తయారీలో కర్రబొగ్గు (బయోచార్) వాడకం సహా వివిధ సాంకేతికతలపై సమగ్ర సిఫారసులు ఉన్నాయి.
కర్బన ఉద్గార తగ్గింపు మార్గాన్ని అనుసరించే సంస్థలు తమ కీలక వ్యూహాన్ని మెరుగుపరుచుకునే వీలుందని ‘బిసిజి’ ఇటీవలి నివేదిక ప్రముఖంగా పేర్కొనడాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ ఎన్.ఎన్.సిన్హా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్గత విధానాల మెరుగుదలపై దృష్టి సారిస్తే ఉద్గార తీవ్రతను 10 నుంచి 40 శాతందాకా తగ్గించుకోవచ్చునని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే విస్పష్ట మార్గనిర్దేశిం చేసినందున భారత ఉక్కు కంపెనీలు ఇకనైనా ముందుకు రావాలని సూచించారు.
అనంతరం ‘బిపిసిఎల్’ వాణిజ్య విభాగాధిపతి శ్రీ శుభంకర్ సేన్ మాట్లాడుతూ- భారత్ పెట్రోలియం ఉత్పత్తి చేసే ‘ఎంఎకె’ లూబ్రికెంట్లు ఉక్కు పరిశ్రమ అద్భుత వృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సుస్థిర పద్ధతులు, పర్యావరణ హిత ఉక్కు ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నందున 2030 నాటికి ఉత్పాదన 300 మిలియన్ టన్నులకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘‘ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్-ఢిల్లీ చాప్టర్ నిర్వహిస్తున్న‘‘లోహాల వెలికితీత ప్రక్రియలు-ఉత్పత్తుల ఆవిష్కరణ’’ అంశంపై అంతర్జాతీయ సదస్సు సంబంధిత సంపుటి, స్మారక సంచికలను మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు.
చివరగా స్వల్ప కర్బన ఉద్గారాలతో ఉక్కు ఉత్పత్తివైపు ముందడుగు దిశగా మార్గనిర్దేశం చేశారు. ఈ మేరకు వినూత్న ప్రక్రియల ఆవిష్కరణ, ప్రాథమిక-ద్వితీయ స్థాయి లోహ ఉత్పత్తిదారులు, విద్యావేత్తలు, పరిశోధన-అభివృద్ధి సంస్థలు, మూలధన పరికరాల ఉత్పత్తిదారులు, లోహ వినియోగ రంగాల మధ్య బలమైన సహకారం అత్యంత కీలకమని పరిశ్రమ ప్రతినిధులకు మంత్రి స్పష్టం చేశారు.
***
(Release ID: 2059931)
Visitor Counter : 45