ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా భారత్


భారత్‌లో అన్ని సీజన్‌లకు తగిన పర్యాటక ప్రదేశాలు

మన పర్యాటకానికి అత్యంత గొప్ప రాయబారి పీఎం మోదీ

శాంతి, శ్రేయస్సులకు పర్యాటకం మార్గదర్శి వంటిది

భారత పండుగలు ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి

భారత డిజిటలైజేషన్ నమూనా లాగే పర్యాటకాన్నీ తీర్చిదిద్దాలి

ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ప్రసంగించిన ఉప రాష్ట్రపతి

Posted On: 27 SEP 2024 3:25PM by PIB Hyderabad

భారత్ ప్రస్తుతం పర్యాటకంలో ప్రపంచ గమ్యస్థానంగా మారిందని భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్ అన్నారు. “ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి, 5000 సంవత్సరాల నాగరికతకు ఆలవాలమైన భారత పర్యాటక ప్రదేశాలు ఏడాది పొడవునా అన్ని రుతువుల్లో పర్యాటకులకు మంచి అనుభూతులను పంచుతాయన్నారు.” గత దశాబ్ధ కాలంలో భారత్‌లో జరిగిన అద్భుత ప్రగతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఆర్థిక వృద్ధికి పర్యాటకం చోదక శక్తి వంటిదన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో పర్యాటకం కీలకపాత్ర పోషించనుందని శ్రీ జగదీప్  ధన్ కర్  పేర్కొన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంలో శాంతి, ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వినిమయాలను పెంపొందించుటలో పర్యాటక రంగం పాత్ర కీలకమన్నారు. మానవ సంబంధాలను పర్యాటకం బలోపేతం చేస్తుందనీ, ఇది నేటి ప్రపంచానికి అత్యంత అవసరం అని అన్నారు. “పర్యాటకం ప్రపంచ శాంతికి ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రపంచమంతా నేడు శాంతి కోసం తపిస్తోంది. ప్రపంచంలో ఏ ప్రదేశంలో అశాంతి చెలరేగినా అది అందరినీ బాధిస్తుంది. సరఫరా వ్యవస్థలకు, ఆర్థిక అభివృద్ధికి అది విఘాతం కలిగిస్తుంది.” అని ఆయన పేర్కొన్నారు.

భారత డిజిటలైజేషన్ విప్లవ విజయాన్ని పర్యాటక రంగం అనుసరించాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. “మనం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ, మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన దేశం డిజిటలైజేషన్‌లో సాధించిన విజయంలాగే అందరికీ ఉదాహరణగా నిలిచే ఒక పర్యాటక నమూనాను రూపొందించుకోవచ్చు, దాని వల్ల ఈ మూడు సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు.” అని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు అత్యంత తోడ్పాటునివ్వడం, శ్రామికశక్తిని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి మూడు రంగాలలో  పర్యాటక రంగం ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. "ప్రతీ పర్యాటకుడు ఒక కలతో ఇక్కడకు వస్తారు. తన పర్యటన సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాలని కోరుకుంటారు. కాబట్టి మనం మన మానవ వనరులను అందుకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయాలి” అని ఆయన సూచించారు.

గత పదేళ్ల కాలంలో భారత్ లో చోటు చేసుకున్న మార్పుల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచంలో భారత ప్రతిష్ట గణనీయంగా ఎలా మెరుగైందో వివరించారు. “గత దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రపంచంలో భారత ప్రతిష్ట ప్రస్తుతం అత్యంత విభిన్నంగా ఉంది. భారత నాయకత్వ పటిమను ప్రపంచం గుర్తిస్తోంది.  ప్రపంచంలో మనలాగా ఏ ఇతర ఆర్థిక వ్యవస్థ అయినా వార్షిక జీడీపీలో 8శాతం వృద్ధి నమోదు చేయగలదని చెప్పగలమా? అలాగే రాబోయే సంవత్సరాల్లోనూ ఈ వృద్ధి కొనసాగుతుందని అంచనాలు చెబుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
మరుగుదొడ్లు, విద్యుత్, ఇంటర్నెట్, విద్య అలాగే కుళాయి నీరు వంటి మౌలిక అవసరాలను మారుమూల ప్రాంతాలకు సైతం అందించడం ద్వారా 140కోట్ల మంది పౌరులకు సేవలను అందిస్తూ భారత్ ఆర్థికాభివృద్ధి సాగిన తీరును ఆయన వివరించారు. “మారుమూల ప్రాంతాలకు సైతం మరుగుదొడ్లు, విద్యుత్, ఇంటర్నెట్, విద్య, కుళాయి నీరు వంటి మౌలిక వసతులను కల్పిస్తూ 140 కోట్ల జనాభాకు సేవలందించిన విధానాన్ని గమనించాలి” అని  ధన్ కర్ పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, ఆర్థికాభివృద్ధిని కొనసాగిస్తున్న జాతీయ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు.    

ప్రపంచ పర్యాటక రంగానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అత్యంత గొప్ప రాయబారిగా అభివర్ణించిన  ధన్ కర్ మోదీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. “మన  ప్రధాని కేవలం కొద్ది సేపు లక్ష్యద్వీప్‌లో గడిపితే, ప్రపంచం అంతా ఆ ప్రదేశం గురించి తెలుసుకోవడం ప్రారంభించింది,” అని ఆయన పేర్కొన్నారు. పర్యాటకం, మౌలిక వసతులు, అంతరిక్ష సాంకేతికతలో భారత్ సాధించిన విజయాలు ప్రపంచమంతా మార్మోగుతున్నాయని స్పష్టం చేశారు.  

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, తూర్పు ప్రాంత సాంస్కృతిక కేంద్రం చైర్మన్‌గా తన అనుభవాలను గుర్తు చేసుకున్న ఆయన, “మేఘాలయలో ఒక ప్రదేశానికి వెళితే అక్కడి నీటి స్వచ్ఛతకు మీరు ముగ్దులవుతారు, పర్యావరణహితమైన ఒక గ్రామాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు.” అని తెలిపారు. ఈ పదేళ్లలో పర్యాటక రంగంలో భారత్ సృష్టించిన అద్భుతాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంలో చోటు చేసుకున్న అద్భుతమైన పురోగతి గురించి సైతం ఉపరాష్ట్రపతి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. "మంత్రి మండలిలో సభ్యునిగా ఉన్న సమయంలో నేను శ్రీనగర్‌ని సందర్శించినప్పుడు, అక్కడి వీధుల్లో డజను మందిని కూడా చూడలేకపోయాను. ఈరోజు, గత సంవత్సర కాలంలోనే రెండు కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించారు." ఈ గణనీయమైన వృద్ధి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్ ఎదుగుతున్న స్థితికి నిదర్శనమని ఆయన అన్నారు.

భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రపంచ ఆకర్షణను గురించి ప్రస్తావిస్తూ, "యునెస్కో జాబితాలో స్థానం సంపాదించిన వారసత్వ ప్రదేశాలు 45 మాత్రమే అయినా వాస్తవానికి అలాంటి అద్భుత కట్టడాలు చాలా రెట్లు ఎక్కువగా మన దేశంలో ఉన్నాయి. దుర్గా పూజ, గణేష్ చతుర్థి, దీపావళి వంటి మన పండుగలు అయస్కాంతంలాగా ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి." అని శ్రీ  ధన్ కర్  వ్యాఖ్యానించారు. 200 మంది విదేశీ ప్రతినిధులను భారతదేశానికి తీసుకువచ్చిన జీ20 సదస్సు, భారత వంటకాలను, సాంస్కృతిక సంపదను అలాగే మన పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి ప్రదర్శించి, అనేక ప్రశంసలను పొందిందని ఆయన పేర్కొన్నారు.

తన ప్రసంగాన్ని ముగిస్తూ, ప్రపంచ పర్యాటకంలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడానికి సమష్టిగా నిబద్ధతతో కృషి చేయాల్సిన అవసరముందని శ్రీ ధన్ కర్  తెలిపారు. “ప్రయాణాన్ని మించిన విద్య లేదు, పర్యాటకం ద్వారా ఏర్పడే బంధాలను మించిన మానవ సంబంధాలు లేవు” అని చెబుతూ, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుంటూ వివిధ పర్యాటక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడం కోసం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు.

 

2047లో జరుపుకొనే వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలకు ముందే, వ్యూహాత్మక కార్యక్రమాలు, నైపుణ్యం గల వనరులతో పర్యాటక రంగం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యం వైపు నడిపిస్తుందని ఉపరాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, పర్యాటకం, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి, పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి వి. విద్యావతి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ప్రసంగం పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవవచ్చు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2059413


 

****




(Release ID: 2059718) Visitor Counter : 48