ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


వాతావరణం... వాతావరణ మార్పు పరిశోధనల కోసం రూపొందించిన హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థకు ప్రారంభోత్సవం

‘‘సూపర్ కంప్యూటర్లు.. ‘హెచ్‌పిసి’ వ్యవస్థ ద్వారా కంప్యూటింగ్‌తోపాటు శాస్త్ర-సాంకేతిక ఆవిష్కరణలకు సారథ్యంలో స్వావలంబన దిశగా భారత్ ముందడుగు’’

‘‘భౌతిక శాస్త్రం నుంచి భూవిజ్ఞానం.. విశ్వావిర్భావ శాస్త్రందాకా ఆధునిక పరిశోధనలలో మూడు సూపర్ కంప్యూటర్లు ఎంతగానో తోడ్పడతాయి’’

‘‘నేటి డిజిటల్ విప్లవ యుగంలో జాతీయ సామర్థ్యానికి ప్రతీకగా మారిన కంప్యూటింగ్ సామర్థ్యం’’

‘‘పరిశోధన ద్వారా స్వావలంబన... స్వావలంబన కోసం శాస్త్ర విజ్ఞానం మన తారకమంత్రం’’

‘‘ఆవిష్కరణ-అభివృద్ధిలోనే కాకుండా చివరి అంచెలోని వ్యక్తి ఆకాంక్షలు నెరవేర్చడంలోనూ శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఉంది’’

Posted On: 26 SEP 2024 7:22PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా దాదాపు రూ.130 కోట్ల విలువైన మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు. ‘నేషనల్ సూపర్‌ కంప్యూటింగ్ మిషన్’ (ఎన్ఎస్ఎం) కింద దేశీయంగా రూపొందించిన ఈ సూపర్‌ కంప్యూటర్లను పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేశారు. దేశంలో నిర్వహించే అగ్రగామి పరిశోధనలకు ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి. దీంతోపాటు వాతావరణం, వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం రూపొందించిన ‘హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థ’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది శాస్త్ర-సాంకేతిక రంగంలో భారత్ భారీ విజయం నమోదు చేసిన సుదినమని అభివర్ణించారు. ప‌రిశోధ‌న‌-అభివృద్ధి ప్రాధాన్యంతో దేశ పురోగ‌మిస్తుండటాన్ని ఇది ప్రతిబింబిస్తున్నదని పేర్కొన్నారు. ‘‘అసాధ్యాలను సుసాధ్యం చేసే విస్తృత, వినూత్న అవకాశాలను నేటి భారత్ సృష్టిస్తోంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత శాస్త్రవేత్తలు మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్‌కంప్యూటర్లను రూపొందించడంతోపాటు వాటిని ఢిల్లీ, పుణె, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేయడం గురించి ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా ‘అర్క’, ‘అరుణిక’ పేరిట ‘హై-పెర్ఫార్మెన్స్’ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థను ప్రారంభించడం గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా యావత్ వైజ్ఞానిక సమాజానికి, ఇంజనీర్లకు, పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

   ఈ మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను దేశ యువతకు అంకితం చేస్తున్నట్లు  ప్రధాని ప్రకటించారు. తమ ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చాక వారికోసం తొలి 100 రోజులతోపాటు అదనంగా 25 రోజులు కేటాయించానని తెలిపారు. దేశంలోని యువ శాస్త్రవేత్తలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన సౌలభ్యం కల్పించడంలో ఈ సూపర్ కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. భౌతిక శాస్త్రం నుంచి భూవిజ్ఞానం, విశ్వావిర్భావ శాస్త్రందాకా ఆధునిక పరిశోధనలలో ఇవి ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. శాస్త్ర-సాంకేతిక రంగాల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేది ఇటువంటి రంగాలేనని ప్రధాని అన్నారు.

   ‘‘నేటి డిజిటల్ విప్లవ యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యమే జాతీయ సామర్థ్యానికి ప్రతీకగా మారుతోంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. పరిశోధన, ఆర్థిక వృద్ధి, జాతి సమష్టి సామర్థ్యం, విపత్తుల నిర్వహణ, జీవన సౌలభ్యం, వాణిజ్య సౌలభ్యం తదితరాల్లో అవకాశాల దిశగా శాస్త్ర-సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యాలపై ప్రత్యక్షంగా ఆధారపడుతుండటాన్ని ప్రధాని ఈ సందర్భంగా ఉటంకించారు. ‘పారిశ్రామిక విప్లవం 4.0’లో భారత్ ప్రగతికి ఇటువంటి పరిశ్రమలే మూలస్తంభాలు కాగలవని ఆయన అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో భారత్ వాటా ‘బిట్‌లు-బైట్‌ల’కు పరిమితం కాకుండా ‘టెరాబైట్‌, పెటాబైట్‌’ల స్థాయికి విస్తరించాలని ఆయన స్పష్టీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ పయనం సరైన దిశలోనే సాగుతున్నదని చెప్పడానికి నేటి సందర్భమే తిరుగులేని రుజువని ప్రధానమంత్రి అన్నారు.

   ప్రపంచ దేశాల సామర్థ్యానికి సరితూగడంతో మాత్రమే నేటి భారత్ సంతృప్తి చెందబోదని, శాస్త్రీయ పరిశోధనల ద్వారా యావత్ మానవాళికి సేవ చేయడాన్ని తన కర్తవ్యంగా పరిగణిస్తుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ‘‘పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి... శాస్త్ర విజ్ఞానంతో స్వావలంబనే భారత్ తారకమంత్రం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా’ వంటి చారిత్రక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉదాహరించారు. భవిష్యత్తరాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని లోతుగా పాదుకొల్పే లక్ష్యంతో పాఠశాలల్లో 10,000కుపైగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌’లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కళాశాల స్థాయిలో ‘విజ్ఞాన, సాంకేతిక, ఇంజనీరింగ్, గణిత (స్టెమ్) శాస్త్రాలకు ప్రాధాన్యంతో విద్యాభ్యాసానికి ఉపకార వేతనాలు పెంచడాన్ని ఉటంకించారు. అంతేగాక ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లతో ‘పరిశోధన నిధి’ని ఏర్పాటు చేయడాన్ని కూడా ప్రస్తావించారు. భారత్ తన ఆవిష్కరణలతో ప్రస్తుత 21వ శతాబ్దపు ప్రపంచానికి సాధికారత ఇవ్వాలన్నదే వీటన్నిటి ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు.

   అంతరిక్ష, సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వివిధ రంగాలలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు దేశం నేడు అన్ని రంగాల్లోనూ సాహసోపేత నిర్ణయాలతో లేదా వినూత్న విధానాలతో ముందడుగు వేస్తున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘‘అంతరిక్ష రంగంలో భారత్ కీలక శక్తిగా ఆవిర్భవించింది’’ అన్నారు. ఈ రంగంలో ఒక విజయం కోసం ఇతర దేశాలు వందల కోట్ల డాలర్లు వెచ్చిస్తే, భారత శాస్త్రవేత్తలు అదే ఘనతను పరిమిత వనరులతో సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు.  అలాగే చంద్రుని దక్షిణ ధ్రువం సమీపాన పాదం మోపిన తొలి దేశంగా భారత్ ఇటీవల సాధించిన విజయాన్ని శ్రీ మోదీ సగర్వంగా ప్రస్తావించారు. అంతరిక్ష పరిశోధనల్లో దేశం పట్టుదలను, ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఇది రుజువు చేసిందని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భవిష్యత్ లక్ష్యాలను విశదీకరిస్తూ- ‘‘గగన్‌యాన్ మిషన్ అంతరిక్షాన్ని అందుకోవడంతో సరిపెట్టుకోదు... మన శాస్త్రవిజ్ఞాన స్వప్నాలు అంతంలేని విశ్వం అంచులకు చేరడమే దాని లక్ష్యం’’ అని పేర్కొన్నారు. భారత్ 2035కల్లా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో తొలి దశకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయంగా భారత్ స్థాయిని ఇది మరింత పెంచుతుందన్నారు.

   నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ల ప్రాధాన్యాన్ని ఉటంకిస్తూ- ‘‘సెమీకండక్టర్లు ప్రపంచ పురోగమనానికి కీలకంగా మారాయి’’ అన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ను ప్రారంభించగా, స్వల్పకాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైందని తెలిపారు. భారత్ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తోందని, ఇది ప్రపంచ సరఫరా క్రమంలో కీలక పాత్ర పోషించగలదని ఆయన ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో మూడు ‘‘ప‌ర‌మ్ రుద్ర‌’’ సూప‌ర్‌ కంప్యూట‌ర్ల ఏర్పాటును ప్రస్తావిస్తూ- మన  బహుముఖ వైజ్ఞానిక ప్రగతికి ఇవి మ‌రింతగా తోడ్పడతాయని చెప్పారు.

   శాస్త్ర-సాంకేతిక రంగాల్లో దేశ పురోగమనాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ- అద్వితీయ దూరదృష్టి ఫలితంగానే భారత్ నేడు సూపర్ కంప్యూటర్ల నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ వైపు పయనిస్తున్నదని పేర్కొన్నారు. సూపర్‌ కంప్యూటర్లు ఇప్పటిదాకా కొన్ని దేశాలకు మాత్రమే ప్రత్యేకం కాగా, 2015లో ‘నేషనల్ సూపర్‌ కంప్యూటింగ్ మిషన్‌’కు భారత్ శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. తద్వారా నేడు ప్రపంచ సూపర్‌ కంప్యూటర్ అగ్రగాముల సామర్థ్యానికి సరిజోడుగా రూపొందిందని ఆయన వివరించారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా ‘నేషనల్ క్వాంటం మిషన్’ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ఈ వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని మరింత ప్రగతిశీలం చేయగలదన్నారు. ముఖ్యంగా ఐటీ రంగంతోపాటు తయారీ, ‘ఎంఎస్‌ఎంఇ’, అంకుర సంస్థలలో అనూహ్య మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. తద్వారా కొత్త అవకాశాలను  సృష్టిస్తూ మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

   శాస్త్రవిజ్ఞాన వాస్తవ లక్ష్యం ఆవిష్కరణలు-అభివృద్ధికి మాత్రమే పరిమితం కాదని, సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడం కూడా అందులో భాగమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ‘యుపిఐ’లను ఉదాహరిస్తూ- ఈ ఉన్నతస్థాయి సాంకేతికతలతో పురోగమిస్తున్న మన దేశం, వాటిద్వారా పేదలకు సాధికారత కూడా కల్పిస్తున్నదని శ్రీ మోదీ గుర్తుచేశారు. వాతావరణం-వాతావరణ మార్పుల విషయంలో దేశాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇటీవల ‘మిషన్ మౌసం’ (వాతావరణం) గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో భాగంగా నేడు ‘హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థ’లను ప్రారంభించామని చెప్పారు. దీంతోపాటు సూపర్ కంప్యూటర్ల రంగప్రవేశంతో ఈ రెండూ స్థానికంగా-సూక్ష్మస్థాయిలోనూ (హైపర్-లోకల్) మరింత కచ్చితమైన అంచనాలు వేయగలవని చెప్పారు. తద్వారా వాతావరణ అంచనాల్లో భారత్ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. సూపర్‌ కంప్యూటర్ల ద్వారా మారుమూల గ్రామాల్లోనూ వాతావరణ, భూసార విశ్లేషణ చేయగలగడం వైజ్ఞానిక విజయం మాత్రమే కాదని, వేలాది ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పు తేవడం కూడా కాగలదని చెప్పారు. ‘‘ఈ సూపర్ కంప్యూటర్లతో ప్రపంచంలోని అత్యుత్తమ విజ్ఞానం మారుమూల గ్రామంలోని ఓ చిన్న రైతుకూ చేరువవుతుంది. పంటల సాగుపై సంపూర్ణ సమాచార సహిత నిర్ణయాలకు వీలు కలుగుతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకూ ప్రయోజనం ఉంటుంది. ఈ సాంకేతికత పరిజ్ఞానం వారికి ముప్పును తప్పించడంతోపాటు బీమా పథకాలపై పూర్తి అవగాహన కల్పిస్తుంది’’ అని ఆయన వివరించారు. భారత్ నేడు ‘కృత్రిమ మేధ (ఎఐ), మెషీన్ లెర్నింగ్‌’ సంబంధిత నమూనాలను కూడా రూపొందించగలదని, తద్వారా భాగస్వామ్య సంస్థలన్నిటికీ ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

   సూపర్‌ కంప్యూటర్ల నిర్మాణంలో స్వీయ సామర్థ్యం దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తద్వారా భవిష్యత్తులో గణనీయ మార్పులు తేవడంతోపాటు సామాన్యుల దైనందిన జీవనానికీ తగిన ప్రయోజనాలను చేరువ చేస్తుందన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ‘ఎఐ, మెషీన్ లెర్నింగ్’ యుగంలో సూపర్ కంప్యూటర్ల పాత్ర కీలకం కాగలదని ప్రధాని అన్నారు. దేశంలో డిజిటల్ విప్లవానికి మరింత ఊపునిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి పౌరుడికీ చేరువ చేసిన మొబైల్ ఫోన్ల తయారీ, 5జి సాంకేతికతల విజయంతో ఆయన దీన్ని సరిపోల్చారు. భ‌విష్య‌త్ సాంకేతిక ప్రగతితో మమేకం అయ్యేవిధంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం సామాన్యులను  సిద్ధం చేస్తుంద‌ని ప్ర‌ధాని అభిప్రాయపడ్డారు. ఈ పురోగమనంలో భాగంగా మన సూప‌ర్‌ కంప్యూట‌ర్లు సరికొత్త ప‌రిశోధ‌న‌ల‌కు ప్రేరణనిస్తూ అంతర్జాతీయంగా భార‌త్ పోటీతత్వానికి భరోసా ఇస్తాయని చెప్పారు. ఈ సాంకేతికతలు సామాన్యుల జీవితాల్లోనూ ప్రత్యక్ష ప్రయోజనం కల్పించగలవన్నారు. తద్వారా వారు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజానీకంతో సమాన స్థాయికి చేరగలరని విశ్వాసం వెలిబుచ్చారు.

   చివరగా, ఈ విజయాలన్నిటిపైనా పౌరులకు, దేశానికి అభినందనలు తెలిపారు. అలాగే శాస్త్రవిజ్ఞాన రంగంలో సరికొత్త రంగాలకు బాటలు వేయనున్న ఈ అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువ పరిశోధకులకు పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

నేపథ్యం

   సూపర్‌ కంప్యూటింగ్ సాంకేతికతలో దేశ స్వావలంబన లక్ష్యానికి అనుగుణంగా, జాతీయ సూపర్‌ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద దాదాపు రూ.130 కోట్లతో దేశీయంగా రూపొందించిన మూడు ‘పరమ్’ రుద్ర సూపర్‌ కంప్యూటర్లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ సూపర్ కంప్యూటర్లు దేశవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధనలకు సౌలభ్యం కల్పిస్తాయి. ఈ మేరకు ‘ఫాస్ట్ రేడియో బర్స్ట్‌’(ఎఫ్ఆర్‌బి), ఇతర ఖగోళ అంశాల అన్వేషణలో పుణె నగరంలోని ‘జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్’ (జిఎంఆర్‌టి) సూపర్ కంప్యూటర్లను వినియోగించుకుంటుంది. అలాగే ఢిల్లీలో ఏర్పాటైన  ‘ఇంటర్-యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయుఎసి) ద్వారా ‘పదార్థ విజ్ఞానం, అణు భౌతికశాస్త్రం తదిరత రంగాల్లో పరిశోధనలను మెరుగుదిద్దుతుంది. అదేవిధంగా భూవిజ్ఞాన, భౌతిక, విశ్వావిర్భావ శాస్త్ర రంగాల్లో అత్యాధునిక పరిశోధనలకు కోల్‌కతా నగరంలోని ‘ఎస్.ఎన్.బోస్ సెంటర్’ సారథ్యం వహిస్తుంది.

   నేటి కార్యక్రమంలో భాగంగా వాతావరణం, వాతావరణ మార్పు పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన ‘హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థ’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. వాతావరణ అంచనా అనువర్తనాల దిశగా భారత్ గణన సామర్థ్యంలో గణనీయ ప్రగతిని ఈ వ్యవస్థ ప్రతిబింబిస్తుంది. ఇది పుణెలోని రెండు కీలక సంస్థలైన ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ’ (ఐఐటిఎం), నోయిడాలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్’ (ఎన్‌సిఎంఆర్‌డబ్ల్యుఎఫ్‌) పరిధిలో ఏర్పాటైంది. అద్భుత కంప్యూటింగ్ శక్తిసామర్థ్యాలుగల ఈ వ్యవస్థలకు ‘అర్క’, ‘అరుణిక’గా నామకరణం చేశారు. ఈ పేర్లు సూర్యుడితో వాటికిగల అనుసంధానాన్ని సూచిస్తాయి. ఉష్ణమండల తుఫానులు, భారీ వర్షపాతం, పెను తుఫానులు, వడగళ్ళ వర్షాలు, ఉష్ణ తరంగాలు, కరువులు తదితర సంక్లిష్ట  వాతావరణ అంశాలపై సకాలంలో మరింత కచ్చితత్వంతో అంచనాల రూపొందించగల సామర్థ్యాన్ని ఈ అధిక-రిజల్యూషన్ నమూనాలు గణనీయంగా మెరుగుపరుస్తాయి. 

*****

MJPS/TS



(Release ID: 2059521) Visitor Counter : 8