వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సిడ్నీలో భారత వాణిజ్య ప్రోత్సాహక కార్యాలయం ఏర్పాటు: శ్రీ పీయూష్ గోయల్
ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న పథకం- మేక్ ఇన్ ఇండియా: శ్రీ గోయల్
‘ఎక్టా’, ‘సెసా’ వంటి సమగ్ర ఆర్ధిక సహకార కార్యక్రమాల
పరిపుష్టం కోసం శ్రమిస్తున్న భారత్ ఆస్ట్రేలియా దేశాలు: శ్రీ గోయల్
Posted On:
25 SEP 2024 12:36PM by PIB Hyderabad
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారత వాణిజ్య ప్రోత్సాహక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వెల్లడించారు. కార్యాలయంలో ఇన్వెస్ట్ ఇండియా, ఎన్ఐసీడీసీ, ఈసీజీసీ సహా వాణిజ్య, పర్యాటక అధికారులు, సీఐఐ ప్రతినిధులు ఇందులో ఉంటారని వివరించారు. ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక శాఖల మంత్రి శ్రీ డాన్ ఫారెల్ తో కలిసి, అడిలైడ్ లో నిన్న నిర్వహించిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతినిధులు ఇరుదేశాల మదుపర్లు, వాణిజ్యవేత్తలకి వారధిగా పనిచేస్తారని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడి, పర్యాటకం, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామన్నారు.
పదేళ్ల నుంచి అమలవుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం నేడు భారతదేశంలో విజయోత్సవాల్ని జరుపుకుంటోందన్న మంత్రి.. ఉత్పాదన రంగంలో గల సవాళ్ళను ‘సంపూర్ణ దృక్పథం’ ద్వారా పరిష్కరించే మార్గాన్ని ఈ పథకం చూపిందని అన్నారు. మౌలిక వసతులు, అనుమతులకు ఏకగవాక్ష విధానం, నిబంధనల భారాన్ని తగ్గించడం, కొన్ని నిబంధనలను నేర రహిత పరిధిలోకి తేవడం, నూతన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, అంకుర సంస్థలకు ప్రోద్బలం వంటి ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానాలను అనుసరించే అవకాశాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ అందించిందని శ్రీ గోయల్ వెల్లడించారు.
సాంకేతికతలు, అవకాశాలను ఇచ్చిపుచ్చుకునే వీలును ‘మేక్ ఇన్ ఇండియా’ మేక్ ఇన్ ఆస్ట్రేలియా పథకాలు కల్పిస్తున్నాయన్న మంత్రి... ఇరుదేశాల మధ్య వాణిజ్యావకాశాలు పెరిగేందుకు ఈ పథకాలు ఇతోధికంగా సాయపడుతున్నాయన్నారు. హరిత విధానాలకు ప్రోత్సాహం, విద్యారంగం, నైపుణ్యాల అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, కీలక ఖనిజాలు, వంటి రంగాల్లో సహకార, భాగస్వామ్యాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
తన ఆస్ట్రేలియా పర్యటన గురించి ప్రస్తావిస్తూ... తొలిసారి సీఐఐ, ఫిక్కీ (ఎఫ్ఐసిసిఐ) నాయకత్వ ప్రతినిధులు ఆస్ట్రేలియా వాణిజ్య సమావేశాల్లో పాలుపంచుకోవడాన్ని చూస్తుంటే, ఇరుదేశాల భాగస్వామ్యం విలువకు ఉన్న ప్రాముఖ్యత అర్థం అవుతున్నదని అన్నారు. 2022 మే నుంచి ఇరుదేశాల అధినేతలు 9 సార్లు ప్రత్యక్షంగా సమావేశం కావడం, ఇరువురి మధ్య నెలకొన్న మైత్రీ బంధాన్ని తేటతెల్లం చేస్తూ, వాణిజ్యం, రెండు దేశాల ప్రజల మధ్య కల స్నేహ సంబంధాలకు అదనపు విలువను జోడిస్తోందన్నారు.
ఆర్ధిక సహకార వాణిజ్య ఒప్పందం – ‘ఎకనామిక్ కోపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (ఎక్టా)’, సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందాల ‘కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోపరేషన్ (సెసా)’ బలోపేతం దిశగా భారత్ ఆస్ట్రేలియా కృషి చేస్తున్నాయని, ‘ఎక్టా’ ఒప్పందం వల్ల ఇరుదేశాల మార్కెట్లు ఒకరికొకరికి అందుబాటులోకి వచ్చాయని, దాంతో వాణిజ్యంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించిందని చెప్పారు.
వాణిజ్యం, సాంకేతికతల మార్పిడి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, అత్యాధునిక సాంకేతికత సేవలు, పెట్టుబడుల రంగాలలో ఆస్ట్రేలియా అందించిన సహకారం వల్ల ఆయా రంగాల్లో భారత్ మరింత ప్రభావశీల పాత్ర పోషించే అవకాశం కలిగిందని శ్రీ గోయల్ అన్నారు. “ప్రజాస్వామ్యం, జనాభా సంఖ్య, డిమాండ్, శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో గట్టి నాయకత్వం, అనే నాలుగు ‘డి’లతో కూడిన అనుకూల అంశాలు భారత్ దేశాన్ని- సంస్కరణ, పరివర్తన, ఉత్తమ ప్రదర్శన వైపుగా నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2059282)
Visitor Counter : 58