కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సంక్షిప్త సందేశ సేవలందించే అధీకృత పంపిణీదారులు ఇకపై నిర్ధారించిన యూఆర్ఎల్, ఏపీకే, ఓటీటీ లింక్స్ ని మాత్రమే అందించాలి: ట్రాయ్
Posted On:
26 SEP 2024 1:54PM by PIB Hyderabad
సంక్షిప్త (ఎస్సెమ్మెస్) సందేశాల దుర్వినియోగాన్ని నిరోధించే దిశగా టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ఆగస్టు 20న కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, నిర్ధారణ కాని యూఆర్ఎల్ లు, ఏపీకేలు, ఓటీటీ లింక్స్ ని ఎస్సెమ్మెస్ పంపిణీదారులు బ్లాక్ చేయవలసి ఉంటుంది. ఎస్సెమ్మెస్ సందేశాల్లో భాగంగా ఇకపై పంపే యూఆర్ఎల్ (యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్స్), ఏపీకే (యాండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్), ఓటీటీ (ఓవర్ ది టాప్) లింక్స్, విధిగా ఆమోదముద్ర పొందినవై ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది. అక్టోబర్ ఒకటో తేదీకల్లా ఈ ఆదేశాశాలను అమలు చేయవలసి ఉంటుంది.
యూఆర్ఎల్ కలిగిన సంక్షిప్త సందేశాలను నిరంతరాయంగా అందజేసేందుకు నిర్ధారించిన యూఆర్ఎల్, ఏపీకే, ఓటీటీ లింక్స్ కల జాబితాను అధీకృత ఎస్సెమ్మెస్ పంపిణీదారులు, సంబంధిత యాక్సెస్ ప్రొవైడర్ల పోర్టల్ లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇప్పటికే 3,000 మంది అధీకృత ఎస్సెమ్మెస్ పంపిణీదారులు, 70,000 పైగా లింక్స్ ని నిర్ధారించారు. తుదిగడువులోగా నిర్ధారణ జరిగిన జాబితాని సమర్పించని పంపిణీదారులు, యూఆర్ఎల్ లు, ఏపీకేలు, ఓటీటీ లింక్స్ కలిగిన సందేశాలను పంపే వీలుని కోల్పోతారు.
ప్రమాదకర లింక్స్, అనవసర సందేశాల బారి నుండి వినియోగదారులని రక్షించడంతో పాటు, సురక్షితమైన, పారదర్శక కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పాలన్న ఉద్దేశంతో ట్రాయ్ ఈ చర్య తీసుకుంది. కొత్త ఆదేశాలను పాటించే యాక్సెస్ ప్రొవైడర్లు, అధీకృత ఎస్సెమ్మెస్ పంపిణీదారులు విశ్వసనీయ, సురక్షిత వాతావరణాన్ని కల్పించడంలో భాగస్వాములవుతారు.
***
(Release ID: 2059281)
Visitor Counter : 53