ప్రధాన మంత్రి కార్యాలయం
సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
Posted On:
22 SEP 2024 11:50PM by PIB Hyderabad
న్యూయార్క్‌లో సాంకేతిక రంగ దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది. కృత్రిమ మేథ, పరిణామం, జీవసాంకేతికత, జీవశాస్త్రాలు, కంప్యూటింగ్, ఐటీ, కమ్యూనికేషన్లు, సెమీకండక్టర్ సాంకేతికతలపై ప్రధాన దృష్టితో ఈ రౌండ్ టేబుల్ సమవేశం జరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి, అధునాతన సాంకేతికతలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజల శ్రేయస్సుకు ఎలా దోహదపడుతున్నాయనే అంశాలపై సీఈఓలు ప్రధానమంత్రితో సంభాషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మానవాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఆవిష్కరణలకు సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో వారు తెలియజేశారు.
సాంకేతిక రంగ దిగ్గజాలను ఒక్కచోటకు చేర్చడం పట్ల ఎంఐటీ ఇంజినీరింగ్ విభాగం, ఈ సంస్థ డీన్ ప్రయత్నాలను ప్రధానమంత్రి అభినందించారు. ఇనిషియేటీవ్ ఆన్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసీఈటీ) లాంటి సాంకేతిక భాగస్వామ్యాలు, ప్రయత్నాలు భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా తన మూడో పర్యాయంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం భారతదేశ వృద్ధి గాథను సద్వినియోగం చేసుకోవాలని సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధి కల్పించిన అవకాశాలను ఉపయోగించుకొని ప్రపంచం కోసం భారత్‌లో సహ-అభివృద్ధి, సహా-రూపకల్పన, సహా-ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. మేథో సంపత్తి రక్షణ, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారతదేశ బలమైన నిబద్ధత గురించి వ్యాపార దిగ్గజాలకు ఆయన హామీ ఇచ్చారు.
భారత్‌లో వస్తున్న ఆర్థిక పరివర్తనను ప్రధానమంత్రి ముఖ్యంగా ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు, జీవసాంకేతికత, హరిత అభివృద్ధి రంగాల గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పారు. సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను జీవసాంకేతిక కేంద్రంగా మార్చేందుకు తీసుకొచ్చిన బయో ఈ3 విధానం గురించి ఆయన మాట్లాడారు. కృత్రిమ మేథకు సంబంధించి నైతిక, బాధ్యతాయుతమైన వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తూ అందరికీ ఏఐను చేరేలా ప్రోత్సహించడమే భారత్ విధానమని పేర్కొన్నారు.
(Release ID: 2058072)
Visitor Counter : 35
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam